భారతదేశంలో విభిన్న ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడి ప్రజలు ప్రకృతిని సైతం దైవంగా భావిస్తారు. బతుకమ్మ పండుగకు పూవులనే బతుకమ్మగా పేర్చి తొమ్మిది రోజుల పాటు పాటలు పాడుతూ, నైవేద్యాలు పెడుతూ పూజిస్తుంటారు. వర్షాకాలంలో సరిగా వర్షాలు రాకపోతే కప్పలకు పెండ్లి చేస్తూ పూజలు చేస్తారు. అయితే ఈ క్రమంలోనే ప్రకృతిలో మనకు దేవుడిచ్చిన వృక్షాలను సైతం పూజిస్తారు. దేవతా స్వరూపులుగా భావించి పూజలు చేస్తారు.
ALSO READ: టీటీడీ బోర్డు సభ్యుల లిస్ట్ మారనుందా? కొత్తగా ఛాన్స్ కొట్టేది ఎవరు?
అయితే వృక్షాలలో రావి, వేప చెట్లు చాలా ముఖ్యమైనవి. వీటివల్ల అనేక లాభాలు ఉండటంతో పాటు పురాతన సంప్రదాయాల ప్రకారం గుడి ముందు ఈ చెట్లనే ఎక్కువగా నాటుతుంటారు. వీటికి పూజలు చేస్తూ ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అదే విధంగా రావి, వేప చెట్లను లక్ష్మి నారాయణ స్వరూపంగా భావిస్తుంటారు. దేవతేలే ఈ వృక్షాలను సృష్టించారు అనే నమ్మకం కూడా ఉంది. ఈ చెట్లకు పూజ చేస్తే దేవుళ్లకు పూజ చేసినట్టేనని భక్తులు నమ్ముంతుంటారు. అయితే ఈ చెట్లకు పెళ్లికూడా చేస్తారని చాలా మందికి తెలియదు.
రాగి వేప చెట్లకు పెళ్లి ఎందుకు చేస్తారు? ఎక్కడ చేస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ సంకల్ప సిద్ధి సాయినాథ ఆలయంలో నాటిన రావి, వేప చెట్లకు శనివారం ఆలయ నిర్వాహకులు అత్యంత వైభవంగా వివాహ వేడుకలను నిర్వహించారు. ఈ వృక్షాల కింద వెలసిన నాగ దేవతలను పూజిస్తే సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. దీంతో వేద పండితుల సమక్షంలో భక్తుల సన్నిధిలో వివాహ వేడుకలను నిర్వహించారు. ఈ పెళ్లికి స్థానికులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.