EPAPER
Kirrak Couples Episode 1

Karthika Pournami 2023 : కోటి పున్నముల వేడుక.. కార్తీక పౌర్ణమి

Karthika Pournami 2023 : కోటి పున్నముల వేడుక.. కార్తీక పౌర్ణమి

Karthika Pournami 2023 : సకల శుభప్రదం, అనంతకోటి ఫలితాన్నిచ్చే కార్తీక మాసంలో స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని మన పురాణాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అలా చేయలేని వారు కనీసం.. ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా వీటిని ఆచరించాలనీ, ఇదీ సాధ్యం కానివారు ఒక్క కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీకయజ్ఞం చేసినంత ఫలం లభిస్తుందని పెద్దల మాట.


మనకు ప్రతి నెలకూ ఓ పౌర్ణమి వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చే.. ఈ కార్తీక పౌర్ణమికి ఉన్నంత ప్రత్యేకత మరే పున్నమికీ ఉండదు. ఈరోజు చంద్రుడిలో కనిపించే తేజస్సు.. ఏడాదిలో మరే రోజూ కనిపించదు. పిండి ఆరబోసినట్లుగా ఉండే కార్తీక పౌర్ణమి వెన్నెలలో దేశంలోని దేవాలయ ప్రాంగణాలూ, జలాశయాలూ కార్తీకదీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయి.

ఈ రోజు వేకువజామునే లేచి శివనామస్మరణతో కుదిరితే.. నదీస్నానం/ తటాక స్నానం.. వీలుకాకుంటే.. ఇంట్లోనైనా తలస్నానం చేస్తారు. ఇంకా చీకటి ఉందనగానే.. ఇంట్లో దీపారాధన చేసి వాటిని అరటిదొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదిలి, రాత్రికి తులసికోటలో ఉసిరికొమ్మ(కాయలతో)పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే.. కన్యలకు మంచి భర్త లభిస్తాడనీ, వివాహితల సౌభాగ్యం పదికాలాల పాటు నిలుస్తుందని పెద్దలు చెబుతారు.


ఈ రోజున ముత్త్తెదువులు కార్తీక చలిమిళ్ల నోము అనే మూడేళ్ల నోమును నోచుకుంటారు. ఇందులో భాగంగా తొలి ఏడాది కార్తీక పౌర్ణమి నాడు చలిమిడి చేసి ఐదుగురు ముత్త్తెదువులకు, రెండవ ఏడాది పదిమందికి, మూడో ఏడాది పదిహేనుమందికీ చొప్పున వాయినాలిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈరోజున కృత్తికా దీపాల నోము చేస్తారు. ఇందులో భాగంగా మహిళలు రాత్రి కాగానే శివాలయంలో తొలి ఏడాది 120 దీపాలు, రెండవ ఏడాది 240, మూడవ ఏడాది 360 దీపాలను వెలిగిస్తారు.

ఈ రోజున నమకచమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితాసహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట. కార్తీక పౌర్ణమిను త్రిపురిపూర్ణిమ, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి మత్య్సావతారంలో అవతరించినదీ, వృందాదేవి తులసివెుక్కగా ఆవిర్భవించిందీ, కార్తికేయుడు, దత్తాత్రేయులు జన్మించినదీ నేడే.

దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలి కాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. అందుకే నేడు దీపారాధన చేస్తే.. విశేష శివానుగ్రహం కలుగుతుంది. దీపాలను వెలిగించేవాళ్లకి సాయపడినా, కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అలాగే ఈరోజున… కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీకపురాణం చెబుతోంది.

క్షీరసాగరమథనంలో వెలువడిన హాలాహలాన్ని తన గళాన దాచుకున్న శివుడి చుట్టూ పార్వతీదేవి ప్రదక్షిణ చేసిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ఈరోజున శివాలయాల్లో ఎండుగడ్డిని తాడుగా పేని, తోరణంగా కట్టి వెలిగించి, భగభగ మండే ఆ తోరణం చుట్టూ పార్వతీదేవి విగ్రహాన్ని మూడుసార్లు తిప్పుతారు. దీనికే ‘జ్వాలా తోరణోత్సవం’ అని పేరు. నేటి రాత్రి కాశీలోని గంగాతీరంలోని ఘాట్లన్నీ దీపకాంతులతో ప్రకాశిస్తాయి.

Related News

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Big Stories

×