EPAPER
Kirrak Couples Episode 1

Haridasu : అక్షయ ఫలితాన్నిచ్చే.. హరిదాసు దీవెన

Haridasu : అక్షయ ఫలితాన్నిచ్చే.. హరిదాసు దీవెన

Haridasu : ఏడాదిలో ఎప్పుడూ కనిపించని హరి దాసు సంక్రాంతికి నెల రోజుల ముందునుంచి పల్లెల్లో ఇంటింటికీ తిరుగుతూ హరి నామ సంకీర్తన చేస్తాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి, స్నానం చేసి కాషాయ వస్త్రాలు ధరించి నుదిటిపై తిరునామాలు దిద్దుకుని మెడలో పూల దండలను ధరించి, నామాలతో అలంకరించిన అక్షయ పాత్రను నెత్తిమీద పెట్టుకుని, భుజంమీద తంబురాను మీటుకుంటూ ఒక చేతితో చిరుతలతో తాళం వేస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో, పాటకు తగిన నృత్యం చేస్తూ ‘హరిలో రంగ హరి’ అంటూ బయలుదేరి ప్రతి ఇంటికీ వచ్చి భిక్ష స్వీకరిస్తుంటాడు.


హరి దాసును చూడగానే మనకు నారదుడి రూపమే గుర్తుకొస్తుంది. హరిదాసులు మూడు రకాలు. మొదటిరకం వారు.. హరికధలు చెబుతూ స్వామిసేవలో కొనసాగుతారు. రెండవ రకం వారు హరిదీక్షను తీసుకుని భజన, గానం, నృత్యాలు చేస్తూ హరి నామాన్ని వ్యాప్తి చేస్తారు. మూడవ రకం వారు హరినామ సంకీర్తన చేస్తూ సంక్రాంతి వేళ.. గ్రామాల్లో భిక్ష స్వీకరిస్తారు. మనకు సంక్రాంతి వేళ కనిపిచేది.. ఈ మూడవ రకం వారే.

హరిదాసు వాయించే సంగీత వాయిద్యాన్ని బట్టి వీరు తుంబుర హరిదాసు, గంట హరిదాసు, చిడతల హరిదాసు, కొమ్మ హరిదాసు అని పిలుస్తారు. మనకి ఎక్కువగా కనిపించే హరిదాసుల చేతుల్లో తుంబుర, చిడతలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఏక భుక్తం (ఒంటి పూట భోజనం చేయటం), అథః శయనం (నేల మీద పడుకోవటం), శీతల స్నానం (చన్నీటితో స్నానం), బ్రహ్మచర్యం (మనసా, వాచా కర్మణా) పాటిస్తూ సర్వావస్థలలోనూ ఆ భగవంతుని ప్రతినిధులుగా ఈ నెలరోజులు హరిదాసులు వ్యవహరిస్తారు.


హరిదాసు సంప్రదాయం వెనక ఓ పౌరాణిక గాథ కూడా ఉంది. పాండవ వనవాస సమయంలో సూర్యారాధనతో ధర్మరాజు దానిని పొందుతాడు. అయితే.. యుద్ధం పూర్తయి, ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత ‘దీనిని ఎవరికివ్వాలి’ అని కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ‘వేయిగంటల మండపాన్ని కట్టించి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయి. ఏ వ్యక్తి ఆ మండపంలో అడుగుపెడితే మండపంలోని గంటలు మోగుతాయో ఆ అక్షయపాత్ర వారికి ఇవ్వు’ అంటాడు. కానీ.. ఎందరొచ్చినా గంటలు మోగకపోవటంతో ధర్మరాజు శ్రీకృష్ణున్ని ప్రార్ధించగా చాత్తాది శ్రీవైష్ణవునకు భోజనం పెట్టమని సూచిస్తాడు. చాత్తాది శ్రీవైష్ణవుడు తనకు భోజనానికి బదులు స్వయంపాకం తీసుకుపోయి.. శుచిగా వండి కృష్ణుడికి, గోదాదేవికి నివేదన చేసి.. ఆ తర్వాత భోజనం చేస్తాడు. సరిగ్గా ఆ సమయానికి మండపంలో గంటలు మోగుతాయి. దీంతో ధర్మరాజు అక్షయపాత్రను చాత్తాది శ్రీవైష్ణవునకు ఇచ్చాడనీ, వారి వంశజులే నేటి హరిదాసులనీ చెబుతారు.

ఇంటిలోని ఇల్లాలు గాని, పిల్లలు గాని, దోసెడు బియ్యాన్ని తీసుకువస్తే, హరిదాసు వినమ్రతతో మోకాటి మీద కూర్చుని అక్షయ పాత్రలో వేయించుకుంటూ వారిని దీవించి మరో ఇంటికి సాగిపోతాడు. ఇలా ఊరంతా తిరిగి ప్రతి ఒక్కరి మనసులోనూ ఆధ్యాత్మిక పరిమళాలను పూయిస్తాయి. నెల రోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు గానూ, కనుమ రోజున ఇల్లిల్లూ తిరిగి, భక్తులు ఇచ్చే స్వయంపాకాన్ని స్వీకరించి, వారిచ్చే ధన, ధాన్య దానాలను స్వీకరిస్తారు.

విష్ణువుకు ప్రతినిధి అయిన హరిదాసు నెత్తిమీది అక్షయ పాత్రలో బియ్యం పోస్తే.. తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అంతేకాదు.. ఆయన తలమీది అక్షయ పాత్రలో పోసే ధాన్యం.. ఆ దాతకు అక్షయమైన ఫలితాన్నిస్తుందని చెబుతారు. అంతేకాదు.. ఇంటి నుంచి బయలుదేరి.. తిరిగి ఇంటికి చేరేవరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.

హరిదాసుకు పేద, ధనిక భేదం లేదు. కులాల పట్టింపు అసలే లేదు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళతాడు. ప్రతి ఇంటి ముందున్న ముగ్గు చుట్టూ.. హరి నామ సంకీర్తన చేస్తూ ఒకసారి ప్రదక్షిణం చేస్తాడు. ఈలోపు ఆ ఇంటివారు భిక్షతో వస్తే సరేసరి. లేకుంటే.. మరో ఇంటికి సాగిపోతాడు. అయితే.. పల్లెల్లో హరిదాసు అవతలి వీధిలో ఉండగానే ఇంట్లోని పిల్లలు ఓ పాత్రలో ధాన్యం పట్టుకుని ‘మా ఇంటి ముందుకు ఎప్పుడు వస్తాడా’ అన్నట్లుగా ఎదురుచూసి, ఉత్సాహంగా అక్షయ పాత్రలో బియ్యం పోస్తుంటారు.

Related News

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Big Stories

×