శబరిమలలో ఈ నెల 16 నుండి మండల మకరవిలక్కు యాత్ర సీజన్ ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు యాత్రా సీజన్ కొనసాగనుండగా దేశంలోని నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర కోసం కేరళ ప్రభుత్వం, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆన్ లైన్ టికెట్లతో పాటు స్పాట్ బుకింగ్స్ దర్శనాలకు సైతం అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు శబరిమల యాత్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సీజన్ లో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్టు కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ వెల్లడించారు.
ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ నెల మూడోవారం నుండి ప్రారంభమయ్యే యాత్ర సీజన్ లో స్వామి వారి దర్శనం సాఫీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా భక్తులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు కూడా టీడీబీ చేస్తుందని స్పష్టం చేశారు. గతేడాది ఈ సీజన్లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేశామని, ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో యాత్రా సీజన్ గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. శబరిమలలో మొత్తం 13,600 పోలీస్ సిబ్బంది, 2500 అగ్నిమాపక సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు మోహరించినట్టు చెప్పారు. యాత్రికుల కోసం ఎక్కడికక్కడ తాగునీరు, నిలక్కల్, సన్నిధానం సహా యాత్రమార్గంలో తక్షణ వైద్యసాయం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యాత్ర సాఫీగా సాగేందుకు రవాణాశాక మూడు కంట్రోల్ రూములను ఏర్పాటు చేసిందన్నారు.