మన పురాణాల్లో ఎంతో మంది దేవతలు ఉన్నారు. వారిలో తథాస్తు దేవతలు కూడా ఉన్నారు. తథాస్తు అంటే ఆ ప్రకారంగా జరగాల్సిందే అని అర్థం. అంటే మనం ఏదైనా కోరుకుంటే ఆ దేవతలు తథాస్తు అంటారని, అప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అంటారు. అందుకే వారిని తథాస్తు దేవతలు అని పిలుస్తారని చెప్పుకుంటారు. ఈ తథాస్తు దేవతలు ఎవరు? వారి కథ ఏమిటో ఇక్కడ ఇచ్చాము తెలుసుకోండి.
అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు
సూర్యుని భార్య సంధ్యాదేవి. ఆమె సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాలుస్తుంది. గుర్రం రూపంలోనే ఆమె కురు దేశం వెళ్లిపోతుంది. అయితే భార్య గుర్రం రూపాన్ని ధరించడంతో సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి ఆ సంథ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. గుర్రం రూపంలో వీరిద్దరూ కలవడం వల్ల వారికి అశ్విని కుమారులు పుడతారు. వీరు గుర్రం ముఖాలతోనే ఉంటారు. వీరిని తధాస్తు దేవతలని అంటారు. అలాగే దేవతలకు వైద్యులుగా కూడా చెప్పుకుంటారు.
గుర్రం రూపంలో పుట్టిన దేవతలు అశ్విని కుమారులు. అందుకే వారు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. గుర్రంలాగే దౌడు తీస్తారు. ప్రయాణించే మార్గంలో నోటితో తథాస్తూ అనుకుంటూ పరుగులు పెడతారు. వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు యజ్ఞాలు, యాగాలు జరిగే చోట తిరుగుతూ ఉంటారని చెప్పుకుంటారు. ఆ యజ్ఞ యాగాదుల్లో ఎవరైనా కోరికలు కోరుకుంటే వెంటనే తథాతస్తు అని దీవిస్తారని చెబుతారు. అప్పుడు అనుకున్నవన్నీ ఫలిస్తాయని అంటారు.
అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంధాన్ని, మరో చేత్తో అభయ హస్తానని చూపిస్తారు. ఆయుర్వేద గ్రంథం ఆరోగ్యాన్ని అందిస్తే, అభయ హస్తం అనుకున్నవి జరగాలని దీవిస్తున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా వీరు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అందుకే సాయంత్రం పూట చెడు మాట్లాడకూడదని పెద్దలు చెబుతారు.
సాయంత్రం పూట మీ దగ్గర ఏమీ లేదని బాధపడడం, ఏదైనా నష్టం జరుగుతుందేమోనని మాట్లాడడం వంటివి చేయకూడదు. అలా మాట్లాడుతూ ఉంటే దేవతలు తధాస్తు అంటారని, నిజంగానే మీ దగ్గర నుంచి అన్నీ పోతాయని చెబుతారు. సాయంత్రం సమయంలో ఇతరులకు హాని కలగకుండా, నిస్వార్ధంగా కోరుకోవాలని అంటారు. అలాగే మీకు ఎవరైనా అన్యాయం చేస్తే అదే విషయాన్ని సాయంత్రం పూట పదేపదే మాట్లాడకూడదు, అలా మాట్లాడితే తధాస్తు దేవతలు మీకు అన్యాయం జరిగేలా చేస్తారని అంటారు. కాబట్టి సాయంత్రం పూట మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో చెడు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ మంచినే కోరుకోవాలి. పురాణాల ప్రకారం సాయంత్రం పూట కోరుకునే కోరికలు మంచివిగా ఉండాలని, అవి కచ్చితంగా తీరుతాయని కూడా అంటారు.
అశ్వాల రూపంలో ఉండే అశ్విని దేవతలు కవలలుగా చెప్పుకుంటారు. మహాభారతంలో పాండురాజు భార్య అయిన మాద్రికి అశ్విని దేవతల మంత్ర ప్రభావం వల్ల నకులుడు, సహదేవుడు అనే కవలలు జన్మించారని అంటారు. ఈ కవలలే ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి కూడా నేర్పారని చెప్పకుంటారు.