Diwali Celebrations In India: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో దీపావళిని వివిధ రకాలుగా జరుపుకుంటారు. కానీ వీటి ప్రాథమిక అర్థం మాత్రం ఒకటే. చెడుపై మంచి విజయం, చీకటిపై వెలుగు విజయం. దీపావళి పండుగ మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. దీపావళి ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని దీపావళి పండుగ మనకు నేర్పుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీపావళికి సంబంధించి వివిధ సంప్రదాయాలు ఉన్నాయి. దీపావళి చరిత్ర, ప్రాముఖ్యతను పంచుకునే కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య దీపోత్సవం:
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో దీపావళి పండగను ఘనంగా నిర్వహిస్తారు. అయోధ్యలో శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రజలు తమ ఇళ్లలో దీపాలు, రంగోలీలతో అలంకరిస్తారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటారు. నూతన వస్త్రాలు ధరించి, మిఠాయిలు పంచి, లక్ష్మీదేవిని పూజిస్తారు.
తూర్పు భారతదేశం: కాళీ పూజతో దీపావళి:
బెంగాల్‌లో, దీపావళి పండుగను కాళీ పూజతో గొప్ప వైభవంగా జరుపుకుంటారు. వారికి ఈ పండుగ దీపాల పండుగ మాత్రమే కాదు.. శక్తి దేవత అయిన కాళీ దేవిని పూజించే పవిత్ర సందర్భం కూడా. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక కాళీమాత. కాళీ పూజ బెంగాలీ సంస్కృతిలో అంతర్భాగం.
దక్షిణ భారతదేశం: తమిళనాడులో దీపావళి వేడుక:
దక్షిణ భారతదేశంలో దీపావళిని జరుపుకోవడానికి గల కారణాలు, నమ్మకాలు ఉత్తరాది నుండి కంటే భిన్నంగా ఉంటాయి. కార్తీక కృష్ణ పక్షం చతుర్థశి నుండి దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందు నూనె రాసుకుని స్నానం చేస్తారు. అమావాస్య నాడు తలకు నూనె రాసుకోరు. అంటే దీపావళి వేడుక ఇక్కడ కొన్ని రకాల సాంప్రదాయాలతో ప్రారంభమవుతుంది.
వెస్ట్ ఇండియా: గుజరాత్‌లో గాలిపటాలు ఎగురవేయడం:
పశ్చిమ భారతదేశంలో, ముఖ్యంగా గుజరాత్‌లో దీపావళిని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. పండగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు కొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. గుజరాత్‌లో దీపావళి సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం ఒక ప్రసిద్ధ సంప్రదాయం.
వారణాసిలో దీపావళి:
దేవతల దీపావళి వారణాసిలో జరుపుకుంటారు. దీనిని దేవ్ దీపావళి అని కూడా అంటారు. దీపావళి రోజున దేవతలు గంగలో స్నానం చేయడానికి భూమిపైకి వస్తారని నమ్ముతారు. అందుకే గంగానది ఒడ్డున దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. దీపాలు, రంగోలీలతో అలంకరించబడిన గంగానది ఒడ్డు చూసే వారిని మంత్రముగ్దులను చేస్తుంది.
మహారాష్ట్రలో ‘వాసు బరస్’ ఆచారం:
మహారాష్ట్రలో దీపావళి ‘వాసు బరస్’ ఆచారంతో ప్రారంభమవుతుంది. ఇది ఆవుల కోసం. ఆయుర్వేద పితామహుడైన ధన్వంతరికి నివాళులు అర్పించేందుకు ధన్తేరస్ జరుపుకుంటారు. మరాఠీ మాట్లాడే ప్రజలు దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా ‘దీపావళి చా పడ్వా’ జరుపుకుంటారు.
Also Read: దీపావళి రోజు దీపాలు వెలిగించేటప్పుడు తప్పక పాటించాల్సిన 7 నియమాలు ఇవే
ఒడిశా కౌరియా కతి:
ఒడిశాలో ప్రజలు దీపావళి రోజున కౌరియా కతి చేస్తారు. ఇది స్వర్గంలోని వారి పూర్వీకులను పూజించే ఆచారం. పూర్వీకులను పిలిచి వారి ఆశీర్వాదం కోసం జనపనార కర్రలను కాల్చుతారు. ఒరియాలు దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, గణేశుడిని, కాళీ దేవిని పూజిస్తారు.
బెంగాల్‌లో కాళీ పూజ :
బెంగాల్‌లో దీపావళిని కాళీ పూజ లేదా శ్యామ పూజతో జరుపుకుంటారు. ఇది రాత్రిపూట నిర్వహించబడుతుంది. కాళీ దేవిని మందార పూలతో అలంకరించి దేవాలయాలు, ఇళ్లలో పూజిస్తారు. భక్తులు అమ్మవారికి మిఠాయిలు, పప్పులు, బియ్యం, చేపలు కూడా సమర్పిస్తారు. కలకత్తాలోని దక్షిణేశ్వర్, కాళీఘాట్ వంటి ఆలయాలు కాళీ ఆరాధనకు ప్రసిద్ధి చెందాయి. అదనంగా, కాళీ పూజకు ముందు రోజు రాత్రి, బెంగాలీలు ఇళ్లలో 14 దీపాలను వెలిగించడం ద్వారా దుష్ట శక్తిని దూరం చేయడానికి భూత్ చతుర్దశి ఆచారాన్ని కూడా పాటిస్తారు.