Navratri : చైత్ర నవరాత్రుల సమయంలో 9రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో దుర్గా దేవిని పూజిస్తారు.చైత్ర నవరాత్రుల వేళ వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఉండే వస్తువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. వాస్తు దోష నివారణకు నవరాత్రులు ఉత్తమ సమయంగా పండితులు చెబుతారు. ఈ సమయంలో కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వాసం.
ఛైత్ర నవరాత్రుల వేళ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు వైపులా తొమ్మిది రోజుల పాటు పసుపుతో స్వస్తిక్ చిహ్నం ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటు ఈశాన్య దిశలో అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఎదుట కలశం ప్రతిష్టించండి. ఈ దిశను దేవతా స్థానం అంటారు. ఈ దిశలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరుగుతుంది. అమ్మవారి విగ్రహం లేదా ఫొటో, కలశం ప్రతిష్టించడానికి ముందు గంధపు చెక్కను ఉపయోగించడం చాలా మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం సానుకూల శక్తికి కేంద్రంగా పరిగణిస్తారు. గంధపు చెక్క లేకపోతే, ఏదైనా ఇతర చెక్కను కూడా వాడొచ్చు. ఎర్రని వస్త్రం పరిచి దానిపైనే చెక్కను పెట్టాలి.
అమ్మవారిని పూజించే ముందు నేతి దీపం వెలిగించి, ఆ తర్వాత మాత్రమే పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. మీరు ఏకశిలా దీపం వెలిగిస్తే, అందులోనూ నెయ్యి వాడొచ్చు.వాస్తు శాస్త్రం ప్రకారం, నవరాత్రుల వేళ అమ్మవారి ఆరాధనకి ఎరుపు రంగు వస్త్రం, ఎర్రని రంగులో ఉండే పువ్వులను మాత్రమే వాడాలి. ఇవి శక్తి, బలానికి చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో దుర్గా భవానీ భక్తులందరూ ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు. ఉపవాస దీక్షలతో తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.