EPAPER

Apara Shaktipeethas: అపార శక్తి కేంద్రాలు.. మన శక్తిపీఠాలు

Apara Shaktipeethas: అపార శక్తి కేంద్రాలు.. మన శక్తిపీఠాలు

Apara Shakti Kendras our Shaktipeethas: చరాచర సృష్టికి మూలంగా, తన చరణాలను ఆశ్రయించిన భక్తుల పాలిటి కల్పవల్లిగా కొలువైన దైవం.. జగన్మాత. ఈమెనే పలువురు పలు రూపాల్లో పూజిస్తారు. మనదేశంలోని 18 శక్తి పీఠాల్లో ఈ జగన్మాత పలు పేర్లతో కొలువై, భక్తులను అభయాన్ని ఇస్తోంది. ఇంతకూ ఈ శక్తి పీఠాలేవి? వాటి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం.


సృష్టిని మొదలుపెడుతూ బ్రహ్మదేవుడు 9 మంది ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతీదేవి. ఈమె తండ్రి మాటను కాదని పరమేశ్వరుడిని వివాహమాడగా, దక్షుడు శివద్వేషిగా మారాడు. ఈ కాలంలోనే దక్షుడు ఒక యజ్ఞం చేస్తాడు. దానికి అల్లుడైన ఈశ్వరుడిని తప్ప దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. ఆహ్వానం లేకపోయినా.. పుట్టింట వైభవంగా జరుగుతున్న యజ్ఞానికి వెళ్లాలని సతీదేవి ఆరాటపడగా, శివుడు తగదని నచ్చబెబుతాడు.

కానీ.. ఆమె భర్తమాట కాదని యజ్ఞానికి వెళ్లగా, అక్కడ తండ్రి దక్షుడు ఆహ్వానం లేకుండా ఎందుకొచ్చావంటూ అందరి ముందూ అవమానిస్తాడు. దీంతో ఆమె తన కాలి బొటనవేలితో అగ్నిని సృష్టించుకుని అందులో ఆహుతైంది. విషయం తెలిసిన శంకరుడు ఆగ్రహంతో శివ తాండవం చేస్తాడు. తన తల వెంట్రుకల్లో ఒక దానిని తీసి నెలమీద విసిరికొట్టగా అందులోని వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు. వెళ్లి మామగారి యజ్ఞాన్ని ధ్వంసం చేయమిని శివుడు ఆదేశించగా, వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.


పిదప పరమేశ్వరుడు సతీదేవి మృతదేహాన్ని భుజంపై వేసుకుని చండ ప్రచండంగా విలయ తాండవం చేయగా ముల్లోకాలు గడగడ వణికిపోతాయి. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగల్ని ఖండఖండాలుగా చేయగా అవి 18 ప్రదేశాల్లో పడ్డాయి. పిదప శివుడు దేవతల ప్రార్థనల మేరకు శాంతిస్తాడు. నాడు అలా 18 ప్రదేశాల్లో పడిన అమ్మవారి నగలు, శరీర భాగాలే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయి. అవి..

శ్రీ శాంకరీదేవి : సతీదేవి కాలి గజ్జెలు పడిన శక్తి పీఠం ఇది. శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. రావణాసురుడి భక్తికి మెచ్చి అమ్మవారు శాంకరీదేవిగా రావణ రాజధానిలో వెలసింది.

శ్రీ కామాక్షీదేవి: సతీదేవి వీపు భాగం పడిన శక్తిపీఠమిది. ఇది తమిళనాడులోని కంచిలో ఉంది. లోకాలను పీడిస్తున్న బంధకాసురుడిని ఉగ్రరూపం ధరించి సంహరించిన అమ్మవారు శాంత స్వరూపిణిగా కొలువైన శక్తిపీఠమిది.

శ్రీ శృంఖలాదేవి: త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని సృష్టించినట్లు పురాణ కథనం. అమ్మవారి కడుపు భాగం పడిన ప్రదేశమిది. పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లా ప్రద్యుమ్నంలో ఈ క్షేత్రం ఉంది. అయితే.. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆలయం లేదు. అయితే.. కలకత్తాకు 135 కి.మీ దూరంలోని గంగాసాగర్ శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

శ్రీ చాముండి: సతీదేవి తల వెంట్రుకలు పడిన ఆ ప్రదేశం కర్ణాటకలోని మైసూరుకి సమీపంలో ఉంది. ఈ అమ్మవారే లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి లోకాలను కాపాడింది.

శ్రీ జోగులాంబ: అమ్మవారి పై వరుస దంతాలు పడిన క్షేత్రమిది. ఓ యువ శివభక్తుడు ఇక్కడ ఆలయం నిర్మిస్తుండగా, అక్కడి రాజైన విలసద్రాజు ఆ యువకుడిని చంపివేయిస్తాడు. ఈ పాపం కారణంగా రాజు సర్వకోల్పోయి, అమ్మవారిని ఆరాధించగా, ఆమె కలలో దర్శనమిచ్చి ఆలయం నిర్మించమని చెప్పగా కట్టిన ఆలయం ఇది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ శక్తిపీఠం ఉంది.

శ్రీ భ్రమరాంబా దేవి: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉన్న ఈ శక్తిపీఠంలో అమ్మవారి మెడ భాగం పడింది. అరుణాసురుడిని సంహరించేందుకు అమ్మవారు తమ్మెద (భ్రామరి)ల గుంపు రూపంలో వచ్చి సంహరించిందని స్థల పురాణం చెబుతోంది.

శ్రీ మహాలక్ష్మి: అమ్మవారి నేత్రాలు పడిన శక్తిపీఠం ఇది. ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉంది. దేవతలను పీడిస్తున్న కాల్హుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు ఆవిర్భవించిందని ఐతిహ్యం. దీనినే కరవీర పురం అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో చిన్న దానం చేసినా.. అది అక్షయ ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

శ్రీ ఏకవీరాదేవి: సతీదేవి కుడి చేయి పడిన ప్రాంతమిది. దీనిని మాహుర్ అంటారు. తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లి రేణుకాదేవి, సోదరుల తలలు నరికేశాడు. నాడు రేణుకాదేవి తల్లి శిరస్సు పడిన ప్రాంతమూ ఇదేనని చెబుతారు. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి 42 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ మహాకాళి: ఇది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీ తీరాన ఉంది. సతీదేవి పైపెదవి పడిన ఈ శక్తిపీఠంలోనే అమ్మవారు మహాకాళీ అవతారమెత్తి…త్రిపురాసురులను సంహరించింది.

శ్రీ పురుహూతీకా దేవి: ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడింది. గయాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు సంహరించిన ప్రదేశమిది.

శ్రీ గిరిజాదేవి: ఇక్కడ సతీదేవి నాభి భాగం పడింది. ఇది ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 110 కి.మీ దూరంలో ఉంది. లోక సంక్షేమం, శాంతి కోసం బ్రహ్మ ఇక్కడ తపస్సు చేయగా, అమ్మవారు గిరిజా దేవిగా ఇక్కడ కొలువైందని చెబుతారు.

శ్రీ మాణిక్యాదేవి: అమ్మవారి కణత భాగం పడిన ఈ ప్రదేశం.. ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడే శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడిలోని శివుని ఆత్మలింగం ముక్కలు కాగా అవే పంచారామాలుగా ఏర్పడ్డాయని స్థలపురాణ గాథ చెబుతోంది.

శ్రీ కామ రూపాదేవి: దీనినే కామాఖ్య అనీ అంటారు. అమ్మవారి యోని భాగం పడిన క్షేత్రమిది. అసోం రాజధాని గౌహతికి 7 కి.మీ దూరాన గల ఈ శక్తిపీఠం బ్రహ్మపుత్రా నదీ తీరాన ఉంది. శివుడి కోపాగ్ని భస్మమైన మన్మథుడు తిరిగి తన రూపాన్ని పొందిన ప్రదేశమూ ఇదే.

శ్రీ మాధవేశ్వరి: అమ్మవారి చేతి ఉంగరపు వేలు పడిన ప్రాంతమిది. పాలసముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన అమృతాన్ని దేవతలకు, రాక్షసులకు పంచటానికి శ్రీ మహా విష్ణువు మోహినీ అవతారాన్ని ధరించిన శక్తిపీఠమూ ఇదేనని చెబుతారు. ఇది యూపీలోని అలహాబాద్‌కు 5 కి.మీ దూరంలో ఉంది.

శ్రీ వైష్ణవీ దేవి: అమ్మవారి శిరస్సు భాగం పడిన శక్తిపీఠమిది. జమ్మూ నగరానికి 60 కి.మీ. దూరంలో హిమాలయ పర్వతపు గుహలో అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మవారు లక్ష్మీ, పార్వతి, సరస్వతి రూపాల్లో కొలువైన జ్వాలా క్షేత్రం ఇది.

శ్రీ మాంగల్యా దేవి: అమ్మవారి వక్షోజం పడిన ఈ ప్రదేశాన్నే గయ అంటారు. బిహార్ రాజధాని పట్నాకు 75 కి.మీ దూరంలో ఉంది. ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమైన ఈ ప్రయాగ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు ఇక జన్మ ఉండదని విశ్వాసం.

శ్రీ విశాలాక్షి: యూపీలోని వారణాసి నగరంలో కొలువైన ఈ శక్తిపీఠంలో అమ్మవారి చెవి కుండలం పడింది. వ్యాసుడు వంటి ఎందరికో ముక్తిని ప్రసాదించిన ఈ తల్లి.. తనను ఆశ్రయించిన భక్తుల పాలిట కల్పవల్లిగా పేరొందింది.

శ్రీ సరస్వతీ దేవి: సతీదేవి కుడి చేయి పడిన ఈ ప్రదేశం నేటి కశ్మీర్‌లో ఉంది. కానీ.. ఆలయపు రూపురేఖలేమీ మిగలలేదు. ఈ శక్తిపీఠం శ్రీనగర్ పట్టణానికి 11 కి.మీ దూరంలో ఉంది.

Tags

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×