Teen Beheaded| కుటుంబాల మధ్య గొడవలు, పగల వల్ల భావితరాలు సైతం నాశనైపోతాయి. దురాశ, ద్వేషం కారణంగా రక్తపాతాలు జరిగిపోతాయి. అలాంటి గొడవలు, పగల కారణంగా ఒక అమాయక పిల్లాడు చనిపోయాడు. దేశానికి గర్వకారణం కావాల్సిన నైపుణ్యం ఉన్న పిల్లాడు కుటుంబ కక్షలకు బలైపోయాడు. దశాబ్దాల శత్రుత్వం కారణంగా ఓ 17 ఏళ్ల పిల్లాడిని అతని కుటుంబానికి శత్రువులు పరుగెత్తించి పరుగెత్తించి ఒక దెబ్బతో అతని తలకు నరకివేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్ జిల్లాలో జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం.. జౌన్ పూర్ జిల్లాలోని కబీరుద్దీన్ గ్రామానికి చెందిన రామ్ జీత్ యాదవ్, లాల్తా యాదవ్ మధ్య నాలుగు దశాబ్దాలుగా శత్రుత్వం ఉంది. ఇద్దరి కటుంబాలకు ఒకరంటే మరొకరికి పడదు. రెండు కుటుంబాల పూర్వీకులు ఒకరే కావడంతో ఇది దాయాదుల శత్రుత్వం. పైగా భూమి వివాదం కూడా ఉంది. ఈ క్రమంలో రామ్ జీత్ యాదవ్, లాల్తా యాదవ్ మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉంటాయి.
అయితే రామ్ జీత్ యాదవ్ కు అనురాగ్ అనే 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అనురాగ్ ఒక టేక్‌వాండో కరాటే ప్లేయర్. జిల్లా స్థాయిలో అతను గుర్తింపు సాధించాడు. అనురాగ్ లాంటి యంగ్ టాలెంట్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించకముందే అతడు కుటుంబ పగలకు ఆహుతి అయిపోయాడు.
Also Read: ఇద్దరు భర్తలను వదిలి అక్క మొగుడితో సహజీవనం.. అనుమాస్పద స్థితిలో మృతి
అక్టోబర్ 29న రామ్ జీత్ యాదవ్, లాల్తా యాదవ్ కుటుంబాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ గొడవ జరిగే సమయంలో, ప్రాంతంలో దురదృష్టవశాత్తు అనురాగ్ అక్కడే ఉన్నాడు. గొడవ పెద్దదై లాల్తా యాదవ్ కుటుంబ సభ్యుడైన రమేశ్ యాదవ్ పెద్ద కత్తి దూశాడు. తన తండ్రి రామ్ జీత్ యాదవ్ పై దాడి చేయబోయిన రమేశ్ యాదవ్ ను అనురాగ్ అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అనురాగ్ తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు రమేశ్ యాదవ్ కోపంలో అనురాగ్ ను చంపేందకు ప్రయత్నించాడు.
కానీ అనురాగ్ తప్పించుకొని పారిపోతుండగా.. రమేశ్ యాదవ్ వెనుకనుంచి అతని తలను తన చేతిలో ఉన్న కత్తితో ఒక్కసారిగా నరికివేశాడు. ఒకటే దెబ్బకు అనురాగ్ తల అతని శరీరం నుంచి వేరుపడింది. దీంతో ఆ ప్రాంతమంతా నేలపై రక్తం ఏరులై పారింది. ఘటనా స్థలానికి అనురాగ్ తల్లి చేరుకొని రోడ్డుపై పడి ఉన్న తన కుమారుని తలని తన ఒడిలో పెట్టుకొని అక్కడే గంటల తరబడి ఏడుస్తూ కూర్చుంది.
ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి అజయ్ పాల్ శర్మ, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనురాగ్ హత్య కేసులో లాల్తా యాదవ్, మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ అనురాగ్ ను హత్య చేసిన రమేశ్ యాదవ్ పరారీలో ఉన్నాడు.
జౌన్ పూర్ జిల్లా కలెక్టర్ దినేశ్ చంద్ర అనురాగ్ హత్య కేసులో మీడియాతో మాట్లాడుతూ.. “ఇది రెండు కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలకు పైగా జరుగుతున్న పగ. పైగా సివిల్ కోర్టులో ఇరు వర్గాలు మధ్య ఒక భూమి వివాదం కేసు కూడా విచారణలో ఉంది. అనురాగ్ హత్య కేసులో లాల్తా యాదవ్ వర్గంలోని అయిదుగురిని అరెస్టు చేయడం జరిగింది. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. హత్య కేసులో పోలీసులకు వివరంగా ఒక నివేదిక మూడు రోజులలోగా సమర్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ” అని తెలిపారు.