Policemen Suspended : హైదరాబాద్ లో దొంగా, పోలీస్ దోస్తీ కహానీ బయటపడింది. పట్టుబడితేనే దొంగ.. లేకుంటే దొరే అన్నట్లుగా.. చేతికిచిక్కిన నేరస్తుల్ని వదిలేసి చేతులు దులుపుకున్నారు కొందరు పోలీసులు. సరేకదా.. ఏదో అనాకానీ కేసులో వదిలేశారులే అనుకుంటే.. అదీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గంజాయి, మత్తు పదార్థాల కేసు. దాంతో.. తప్పించుకోబోయి, దొరికిపోయారు.. ఆ పోలీసు అధికారులు. వీరి నిర్వాకంతో మొత్తం ప్రభుత్వ, పోలీసు పనితీరే అప్రతిష్టపాలైయ్యిందని ఆగ్రహిస్తున్న ఉన్నతాధికారులు.. ఊచలు లెక్కించండయ్యా అంటూ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పఠాన్ చెర్వు పోలీస్ స్టేషన్ లోఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న అంబారియా, వీఆర్ లో ఉన్న ఎస్ఐ వినయ్ కుమార్, సీసీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధులు గంజాయి స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు నెరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో.. వీరిని తక్షణం సస్సెండ్ చేస్తూ మల్టీ జోస్ 2, ఐజీ వీ.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే నెలలో మనూర్ మండలం, సనత్పూర్ లో వీరు విధులు నిర్వహిస్తుండగా.. అటుగా వచ్చిన ఓ వాహనంలో 120 కిలోల గంజాయి పట్టుబడింది. చాలా పెద్దమొత్తంలో గంజాయి దొరకగా, నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనంతో సహా నేరస్థుల్ని వదిలేశారు.
మరో ఘటనలో నిజామాబాద్ లోని వర్ని దగ్గర గంజాయి ముఠాను పట్టుకున్న ఈ అధికారులు.. నేరస్థుల్ని నారాయణెడ్ తీసుకువచ్చారు. అక్కడ వారి నుంచి 400 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకుని నేరస్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా, వాహనంతో సహా వదిలేశారు. ఇలా.. పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని, నేరస్థుల్ని వదిలేస్తుండడంతో.. వారు మరింత విచ్చలవిడిగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేరస్థులు మల్లుగొండ, మల్లేష్ నాయక్, లకాస్ లు మరోసారి పోలీసులకు చిక్కారు. ఈ సారి పోలీస్ స్టైల్లో విచారణ చేయగా.. గతంలో వారు చేసిన నేరాలు సైతం బయటకు వచ్చాయి. వాటిలో.. పోలీసులు గంజాయిని తీసుకుని వదిలేసిన వ్యవహారం కూడా బయటపడడంతో.. పోలీస్ అధికారులు అవాక్కయ్యారు. పోలీసులై ఉండి ఇదేం పనంటూ తలలు పట్టుకున్న ఉన్నతాధికారులు.. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించడంతో పాటు.. చట్టపరమైన చర్యలకు ఆదేశించారు.
Also Read : కల్తీ మోమోస్ తయారు చేసిన.. బీహార్ గ్యాంగ్ అరెస్ఠ్..!
ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లభించడానికి వీలు లేదని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుంటే.. మరోవైపు పోలీసులే ఇలా వ్యవహరించడంతో ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచని స్థితిలో పోలీస్ ఉన్నతాధికారులు పడిపోయారు. తమ శాఖ, నార్కొటిక్ బ్యూరో లు ప్రతిష్ఠాత్మకంగా గంజాయి స్మగ్లర్స్ పై ఉక్కుపాదం మోపి, మంచి ఫలితాలు సాధిస్తున్న క్రమంలో ఇలా ఒక్కరిద్దరి కారణంగా మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడిన సంబంధిత పోలీసులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదుకు సైతం సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామన్న ఐజీ సత్యనారాయణ ప్రకటించారు.