Momos Eat Death| చాలామందికి బయట టిఫిన్స్, స్నాక్స్ తినడం అలవాటు. ఫుడ్ లవర్స్ అయితే స్ట్రీట్ ఫుడ్ ని లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. అయితే అలా తినడం చాలా సందర్భాల్ల అనారోగ్యానికి దారి తీస్తుంది. తాజాగా అలాంటి బయట స్ట్రీట్ ఫుడ్ తిన్న యువతి ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన ఒక యువతి తనకు ఇష్టమైన మోమోస్ తిని చనిపోయింది. ఆమెతో పాటు ఆ మోమోస్ తిన్న దాదాపు 20 మందికి ఫుడ్ పాయిజనింగ్ తో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలో జరిగింది.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన రేష్మా బేగం అనే 33 ఏళ్ల యువతి ఆమె ఇంటికి సమీపంలోని ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ వద్దకు వెళ్లి మోమోస్ ఇష్టంగా ఆరగించింది. అయితే ఆ మోమోస్ తిన్న రోజు రాత్రి ఆమెకు వాంతులు, విరేచనాలు చేయడంతో రేష్మా బేగం చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది.
వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేసి ఫుడ్ పాయిజనింగ్ అయిందని ధృవీకరించారు. రేష్మా బేగం కడుపులో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అయితే మరుసటి రోజు రేష్మా బేగం చికిత్స పొందుతూ మరణించింది.
Also Read: కలెక్టర్ బంగ్లా పక్కన బిజినెస్‌మ్యాన్ భార్య శవం లభ్యం.. 4 నెలల క్రితం హత్య!
రేష్మా బేగం మోమోస్ తినడం వల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని.. ఈ కారణంగానే ఆమె మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రేష్మా బేగం లాగే మరో 20 మంది కూడా అదే చోటులో మోమోస్ తినడం వల్ల ఆస్పత్రిలో ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.
బంజారా హిల్స్ పోలీసులు ముందుగా.. ఆ మోమోస్ విక్రయిస్తున్న ఫుడ్ వెండర్ షాపుని సీజ్ చేశారు. అతని షాపులో నుంచి మోమోస్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. అతని షాపులోని ఫ్రిడ్జి లో మోమోస్ కోసం కలిపిన పిండి ఓపెన్ గానే ఉందని.. దానిపై ఎటువంటి కవర్లు లేవని పోలీసుల విచారణలో తేలింది. అతని వద్ద ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేకపోవడంతో ఆ ఫుడ్ వెండర్ పై ఫుడ్ సేఫ్టీ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇలాంటిదే మరో కేసు బెంగుళూరులో జరిగింది. అక్కడ ఒక 66 ఏళ్ల వ్యక్తి 5 సంవత్సరాల క్రితం బయట ఫిష్ ఫ్రై తినడంతో అతనికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. అప్పటి నుంచి అతను ఎంతమంది డాక్టర్లకు చూపించినా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. అయితే ఇటీవల అతను ఫార్టిస్ ఆస్పత్రిలో చూపించుకోగా.. ఆ వ్యక్తి అయిదేళ్ల క్రితం తిన్న ఫిష్ ఫ్రై లోని చేపముల్లు అతని గొంతు భాగం నుంచి కడుపులోకి చేరిందని.. వైద్య పరీక్షల ద్వారా డాక్టర్లు తెలుసుకున్నారు. ఆ చేపముల్లు సైజు రెండు సెంటీమీటర్లు ఉండడంతో దాన్ని తీయడానికి లాపరోస్కోపీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.