Delhi Crime : దీపావళి నాడు దిల్లీలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. స్కూటర్ పై వచ్చిన దుండగులు.. ఓ వ్యక్తి కాళ్లకు మొక్కి మరీ కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటన దిల్లీలోని షహదారలో జరిగినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. డబ్బుల విషయంలో నెలకొన్న వివాదమే ఈ హత్యలకు కారణంగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
దిల్లీలోని ఫర్హా బజార్ నివాసముండే ఆకాశ్ శర్మ (44) రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటి ముందు టపాసులు కాల్చుకుంటున్నారు. తన కొడుకు క్రిష్ శర్మ(15), తమ్ముడి కొడుకు రిషబ్ శర్మ(16)లతో కలిసి దీపావళి సంబురాలు చేసుకుంటుండగా… అటుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. అతనితో పాటే మరో వ్యక్తి స్కూటీపై వచ్చి.. వాళ్ల దగ్గర ఆగారు. వాళ్లను చూస్తూనే కొడుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్లేందుకు ఆకాశ్ ప్రయత్నించగా.. నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి తుపాకీ బయటకు తీసి కాల్పులకు పాల్పడ్డాడు. అప్పటికే.. గేటు మూసేందుకు ఆకాశ్ ప్రయత్నిస్తూ.. నెట్టుకుంటూ వెళ్లిన ఆ వ్యక్తి.. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు.
తుపాకీ కాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన రిషబ్ శర్మ .. స్కూటర్ పై పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న దండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో.. అతనిపైనా కాల్పులకు జరపడంతో.. సంఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ కాల్పుల్లో ఆకాశ్, రిషబ్ లు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆకాశ్ కొడుకు క్రిష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాు.
17 ఏళ్ల మైనర్ కుర్రాడే నిందితుడు.. కారణమేంటంటే.?
పండుగ నాటు చోటుచేసుకున్న ఈ ఘటన జాతీయ స్థాయిలో వైరల్ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు.. కాల్పులకు పాల్పడింది అకాశ్ శర్మకు దూరపు బంధువైన ఓ మైనర్ బాలుడిగా గుర్తించారు. నెల రోజుల క్రితం ఆ కుర్రాడి నుంచి ఆకాశ్ రూ.70 వేలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమంటే.. ఇవ్వడం లేదని, ఫోన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదన్న కారణంగా నిందితుడు ఆకాశ్ ను హత్య చేయాలని 17 రోజుల క్రితమే నిర్ణయించుకున్నాడు. దాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య చేసేందుకు మైనర్ బాలుడు ఓ వ్యక్తిని కిరాయికి మాట్లాడుకున్నాడని గుర్తించిన పోలీసులు.. హంతకుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే.. నిందితుడైన మైనర్ బాలుడిపై హత్యా యత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. మిగతా నిందుతుల కోసం గాలింపు చేపట్టారు.