యూపీఐ లావాదేవీల్లో అక్టోబర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దసరా, దీపావళి ఇలా వరుసగా పండుగలు రావడంతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు తెలుస్తోంది. దేశంలో గత నెల రూ.23.5 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ లావాదేవీలు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. యూపీఐ సేవలు 2016 ఏప్రిల్ నెలలో అందుబాటులోకి రాగా ఇప్పటి వరకు గత నెలలోనే అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయని ప్రకటించింది.
ఎన్ పీసీఐ శుక్రవారం వెల్లడించిన డేటా ప్రకారంగా సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలలో ట్రాన్సాక్షన్స్ సంక్షలో పదిశాతం, విలువ పరంగా 14 శాతం పెరుగుదల నమోదైంది. గత నెలలో రోజువారీ యూపీఐ లావాదేవీలు 535 మిలియన్స్ జరగ్గా, వాటి విలువ రూ.75,801 కోట్లు దాటినట్టు ఎన్ పీసీఐ ప్రకటించింది. అదే విధంగా సెప్టెంబర్‌లో రూ.68,800 కోట్ల విలువైన 501 మిలియన్ల లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. మరోవైపు తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలు గత నెలలో 467 మిలియన్లు జరగ్గా, సెప్టెంబర్ నెలలో 430 మిలియన్లు జరిగినట్టు తెలిపింది. దీంతో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ లో 9 శాతం వృద్ధి నమోదైంది.
ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీల సంఖ్య కూడా అక్టోబర్ లో పెరిగినట్టు తెలిపింది. సెప్టెంబర్ లో 318 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరగ్గా అక్టోబర్ లో 8శాతం పెరిగి 345 మిలియన్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. ఇక అక్టోబర్ లో ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 126 మిలియన్స్ లావాదేవీలు జరగ్గా, సెప్టెంబర్ లో 100 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ లో లావాదేవీలు 26 శాతం పెరిగాయి. నవంబర్ లో దేశంలో జరిగిన లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆర్థికవేత్త ప్రదీప్ భుయాన్ మాట్లాడుతూ… ఇండియాలో డిజిటల్ లావాదేవీలు చాలా వేగంగా పెరిగాయన్నారు. నగదు వినియోగం 2024 మార్చి నాటికి 60 శాతంగా ఉన్నట్టు తెలిపారు. 2021 మార్చిలో డిజిటల్ చెల్లింపుల వాటా 14-19 శాతం నుండి 2024 మార్చిలో 40-48 శాతానికి పెరిగినట్టు చెప్పారు.