Facilities For Senior Citizens : ఇండియన్ రైల్వేస్ వృద్ధులకు రైళ్లలో పలు రకాల ప్రత్యేక సౌకర్యాలను అందిస్తోంది. అయితే, చాలా మందికి వాటి గురించి తెలియక వినియోగించుకోవడం లేదు. ఇంతకీ రైల్వే సంస్థ సీనియర్ సిటిజన్లకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లోయర్ బెర్త్ రిజర్వేషన్
భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది. ప్రతి తరగతికి చెందిన ప్యాసింజర్లకు వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్ల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రాయితీలు అందిస్తోంది. 58 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉన్న పురుషులు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళా ప్రయాణీకులు వీటిని పొందే అవకాశం ఉంది. రైళ్లలో లోయర్, మిడిల్, అప్పర్ అనే మూడు రకాల బెర్తులు ఉంటాయి. సీనియర్ సిటిజెన్లకు లోయర్ బెర్త్ రిజర్వ్ చేస్తుంది. టిక్కెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ లు ఆటోమేటిక్‌గా కేటాయించబడతాయి. సీనియర్ సిటిజన్లకు ఇబ్బంది కలగకుండా ఈ సీటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. రిజర్వేషన్ సమయంలో వారికి లోయర్ బెర్త్ లభించకపోతే, ప్రయాణ సమయంలో టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ (TTE)ని సంప్రదించి ఏవైనా ఖాళీగా ఉన్న లోయర్ బెర్త్ లో కూర్చునే అవకాశం పొందవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరిన తర్వాత లోయర్ బెర్త్ అందుబాటులోకి వస్తే, మిడిల్, అప్పర్ బెర్త్ లో ఉన్న సీనియర్ సిటిజన్లు దానిని తమకు కేటాయించమని TTEని అభ్యర్థించవచ్చు.
స్లీపర్, AC కోచ్‌లలో స్పెషల్ బెర్తులు
అన్ని రైళ్లలో స్లీపర్, ఏసీ కోచ్ లలో సీనియర్ సిటిజన్ల కోసం నిర్దిష్ట బెర్త్ లు ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడ్డాయి. స్లీపర్ కోచ్‌ల కోసం 6 లోయర్ బెర్త్ లు కేటాయించగా, 3-టైర్ ఏసీ, 2-టైర్ ఏసీ కోచ్‌లలో 3 లోయర్ బెర్త్ లు సీనియర్ సిటిజన్‌లకు రిజర్వ్ చేయబడ్డాయి. గర్భిణీలు కూడా ఈ సీట్లను పొందే అవకాశం ఉంది. రాజధాని ఎక్స్ ప్రెస్, దురంతో ఎక్స్ ప్రెస్ లాంటి పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైళ్లలో, సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల కోసం ఎక్కువబెర్త్ లు రిజర్వ్ చేయబడ్డాయి.
లోకల్ రైళ్లలోనూ స్పెషల్ సీట్లు
చెన్నై, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో లోకల్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ముంబైలో, సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు రెండు లోకల్ రైళ్లను నడుపుతున్నాయి. ఇందులో రెండు జోన్లలో సీనియర్ సిటిజన్లకు నిర్దిష్ట సీట్లను కేటాయించారు. ఈ రైళ్లలో చాలా వరకు, సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించిన సీట్లు మహిళలకు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు సీనియర్ సిటిజన్ల కోసం వీల్‌చైర్లు, పోర్టర్ల వంటి సౌకర్యాలను అందిస్తున్నాయి. అవసరం అయిన వాళ్లు ఉపయోగించుకోవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు.