Indian Railways: దీపావళి, ఛత్ పూజా లాంటి పండుగల కోసం తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు రైల్వే స్టేషన్లకు పెద్ద సంఖ్యలతో తరలి వస్తున్నారు. వేలాదిగా వచ్చిన ప్రజలతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండుగల సందర్భంగా గతం కొన్నిసార్లు తొక్కిసలాటలు జరిగిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి విపత్కర పరిస్థితులు కలగకుండా రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
దీపావళి పండుగ కోసం సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు హైదరాబాద్ లోని మౌలాలి రైల్వే స్టేషన్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చాయి. వారందరినీ రైల్వే అధికారులు క్యూలో ఉంచి రైలు ఎక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా RPF సిబ్బంది జనాన్ని క్యూలో ఉంచారు. ఒకరివెంట మరొకరిని రైల్లోకి పంపించారు. ఈ వీడియోను ‘jsuryareddy’ అనే నెటిజన్ షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు సుమారు 30 వేల వ్యూస్ అందుకుంది. ప్రయాణీకులను క్యూ పద్దతిలో ఎలాంటి తొక్కిసలాటకు తావులేకుండా రైల్లోకి ఎక్కించిన RPF సిబ్బందిపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
జనరల్ బోగీలు పెంచాలని నెటిజన్ల డిమాండ్
మౌలాలి RPF సిబ్బంది పనితీరును మెచ్చుకుంటూనే రైల్వే అధికారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “RPF సిబ్బంది పని తీరు బాగుంది. కానీ, ఒకే బోగీలో ఎక్కేందుకు 200 మందికి పైగా క్యూ కట్టారు. ఇండియన్ రైల్వేస్ ధనవంతుల కోసం వందే భారత్‌ను ప్రవేశపెట్టడం కంటే జనరల్ బోగీలను పెంచడం మంచిది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. RPF సిబ్బంది అన్ని రైల్వే స్టేషన్లలో ఇలాగే ప్రయాణీకులను క్యూ పద్దతిలో ఉంచితే బాగుంటుంది” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఒకే బోగీలో సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మందిని ఎందుకు ఎక్కిస్తున్నారు?” ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు.
This is how South Central Railway, managing the huge rush during #Diwali festival and #ChhathPuja
RPF personnel manage the rush at Moula-Ali Railway station, by queuing up the passengers.#Hyderabad #DiwaliRush #DiwaliCelebration pic.twitter.com/stq2fv27we
— Surya Reddy (@jsuryareddy) October 29, 2024
దీపావళి సందర్భంగా ప్రత్యేక భద్రత
దీపావళి, ఛత్ పూజా పండుగల నేపథ్యంలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాస్మిత ఛటోపాధ్యాయ వెల్లడించారు. “ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత పెంచాం. ప్రయాణీకులు రద్దీకి తగినట్లుగా పోలీస్ బందోబస్త్ నిర్వహిస్తున్నాం. దీపావళి రద్దీ నేపథ్యంలో తప్పిపోయిన 22 పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరికి చేరల్చినట్లు తెలిపారు. ప్రయాణీకులు పోగొట్టుకున్న లగేజ్, మోబైల్స్ , ల్యాప్ టాప్స్, గోల్డ్ లాంటి రూ.14 లక్షల విలువ గల వస్తువులు దొరికినట్లు వెల్లడించారు. ఇక పండగ సమయంలో హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న 54 మందిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. 36 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని షిఫ్ట్ లలో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!