EPAPER

MLC Kavitha: ఢిల్లీ డీల్స్..! కవిత బెయిల్ చుట్టూ పొలిటికల్ జగడం

MLC Kavitha: ఢిల్లీ డీల్స్..! కవిత బెయిల్ చుట్టూ పొలిటికల్ జగడం

– ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు భారీ ఊరట
– కండిషనల్ బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
– పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని కండిషన్
– రూ.10 లక్షల పూచీకత్తు నిబంధన
– ఢిల్లీ, తెలంగాణలో బీఆర్ఎస్ సంబురాలు
– పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు
– కాంగ్రెస్ కృషి వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్న బీజేపీ
– ఇటు బెయిల్.. అటు రాజ్యసభ సీటు అంటూ సెటైర్
– సుప్రీం తీర్పుపైనే అభ్యంతరాలా అంటూ బీఆర్ఎస్ కౌంటర్
– బీజేపీ, బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడిందన్న కాంగ్రెస్
– ఇంతకీ ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు?


BRS MLC Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసుల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ఒకటి. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. ఎట్టకేలకు ఆమె నిరీక్షణ ఫలించింది. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. కవిత తరపున ముకుల్ రోహిత్గీ వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు రూ.10 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అలాగే, బయటకు వెళ్లాక సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. మార్చి 15న కవితను తన ఇంటిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచి 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఈడీ పలుమార్లు కోర్టుకు వెల్లడించింది. ఆ తర్వాత కుమారుడి పరీక్షలు, అనారోగ్య సమస్యలు అంటూ బెయిల్ కావాలని కవిత కోర్టును కోరారు. ఈ క్రమంలోనే ఆమెకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. కేసు విచారణ సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని బెంచ్ పేర్కొంది. లిక్కర్ కేసులో విచారణ పూర్తయి, ఛార్జిషీట్ దాఖలైనా కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందే అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. కవిత అరెస్ట్ అయి, మంగళవారంతో 165 రోజులైంది. 10 రోజులపాటు కస్టడీలో ఉండగా, తర్వాతి రోజు నుంచి 155 రోజులపాటు తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అటు ఢిల్లీ, ఇటు తెలంగాణలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్.

అంతా కుట్రపూరతమన్న కవిత లాయర్


కవితకు బెయిల్ నేపథ్యంలో ఆమె లాయర్ మోహిత్ రావు మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అని అన్నారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణనలోకి తీసుకుందని, కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినవారు కేసులో నిందితులుగా కూడా లేరని తెలిపారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందన్న ఆయన, విద్యాధికురాలు, ఎంపీ, ఎమ్మెల్యే అయినంత మాత్రాన కవిత మహిళ కాకుండా పోరు అని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. తాను మొదటినుంచి ఈ అరెస్ట్ అక్రమమని చెబుతూ వచ్చానని, సుప్రీం వ్యాఖ్యలతో అది నిరూపితమైందని చెప్పారు.

క్రైమ్ పార్టనర్స్‌కు కంగ్రాట్స్ – బీజేపీ

కవితకు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే బెయిల్ వచ్చిందని ఆరోపించారు. కవితకు బెయిల్ రావడం, కవిత తరఫున వాదనలు వినిపించిన మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వడం ఒకేసారి జరిగాయన్నారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి విజయమని విమర్శించారు. క్రైమ్ పార్టనర్స్‌కు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు. సంజయ్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ‘‘మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గుర్తించి కోర్టు ధిక్కార చర్యలను తీసుకోవాలని కోరుతున్నా’’ అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు కేటీఆర్.

ఇక విలీనమే మిగిలింది – కాంగ్రెస్

సుప్రీం తీర్పు అలా వచ్చిందో లేదో, కాంగ్రెస్ నేతలు వరుసగా బీజేపీ, బీఆర్ఎస్ చీకటి బంధంపై సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. కవిత బెయిల్ ముందే ఊహించామని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తర్వలోనే మొదలవబోతోందన్న వాదనను వినిపిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని చూశారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని గుర్తు చేశారు. హరీష్, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారన్నారు. వాళ్ల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కవితకి బెయిల్ వస్తుందని వారం క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. బెయిల్ వచ్చింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మిగిలి ఉందని సెటైర్లు వేశారు.

Also Read: Revanth Reddy: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారా? సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తులు షురూ

అరెస్ట్ సమయంలోనూ ఇదే పంచాయితీ

కవిత అరెస్ట్ సమయంలోనూ ఇదే విధంగా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆమె అరెస్ట్ ఖాయమే అనుకున్నప్పుడల్లా ఈ మ్యాటర్ ఒక్కసారిగా తెరవెనక్కు వెళ్లిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ, జరగలేదు. సరిగ్గా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరిగింది. ఇందులో రాజకీయ కోణమే ఉందన్న ఆరోపణలను బీఆర్ఎస్ వినిపించింది. చేసిన తప్పునకు శిక్ష తప్పదని బీజేపీ అన్నది. సానుభూతి ఓట్లు సాధించేందుకు బీఆర్ఎస్, అరెస్ట్ చేసి ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రయత్నించాయని కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పుడు బెయిల్ విషయంలోనూ ఇదే తరహా డైలాగ్ వార్ జరుగుతోంది. మీదంటే మీది కుమ్మక్కు రాజకీయం అంటూ విమర్శలు చేసుకుంటున్నాయి పార్టీలు.

 

ఢిల్లీ లిక్కర్ కేసు డేట్ లైన్

2020 సెప్టెంబర్ 4న కొత్త లిక్కర్ పాలసీ తయారీ కోసం ఎక్సైజ్ కమినర్ నేతృత్వంలోని కమిటీకి డిప్యూటీ సీఎం ఆదేశాలు
2021 జనవరి 5న పాలసీపై సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
మార్చి 22న నివేదికను సిద్ధం చేసిన కమిటీ. దీని ప్రకారమే 2021-22 పాలసీ తయారు చేయాలని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు
మే 21న కొత్త లిక్కర్ పాలసీకి కేజ్రీవాల్ కేబినెట్ ఆమోదం
నవంబర్ 8న ఫారిన్ లిక్కర్ ధరల విషయంలో సంబంధిత అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుందని అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆరోపణ
2022 జులై 20న పాలసీలో అన్నీ అవకతవకలు ఉన్నాయని ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేంచేలా నిర్ణయాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
జులై 22న లేఖను పరిగణనలోనికి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
ఆగస్టు 19న 15 పేర్లతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు. అదే రోజు డిప్యూటీ సీఎం సిసోడియా ఇంటితో పాటు 25 చోట్ల సోదాలు
ఆగస్టు 22న ఈడీ ఎంట్రీ, కేసు నమోదు
సెప్టెంబర్ 6న లిక్కర్‌స్కామ్‌లో ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు, నివాసంపై ఈడీ సోదాలు
సెప్టెంబర్ 17న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు నివాసం, ఆఫీసులో ఈడీ సోదాలు
సెప్టెంబర్ 22న మనీలాండరింగ్ ఆరోపణలపై అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం
అక్టోబర్ 7న ముత్తా గౌతమ్‌విచారణ, సంబంధింత ఆఫీసుల్లో సోదాలు
అక్టోబర్ 10న లిక్కర్ స్కామ్‌లో సంబంధాలున్నాయని బోయినపల్లి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
అక్టోబరు 17న డిప్యూటీ సీఎం సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
నవంబర్ 25న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో తొలి చార్జిషీట్‌. మొత్తం 10 వేల పేజీలతో సమర్పించిన సీబీఐ
నవంబరు 26న లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ మొదటి చార్జిషీట్‌
నవంబరు 29న సౌత్ గ్రూపు కీలక పాత్ర పోషించినట్లు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఈడీ
నవంబర్ 29న తొలిసారి వెలుగులోకి కల్వకుంట్ల కవిత పేరు. రెండు వేర్వేరు నెంబర్లతో పది మొబైల్ ఫోన్లను మార్చారని డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు
డిసెంబరు 6న విచారణకు రావాలని కవితకు సీబీఐ నోటీసు
డిసెంబరు 11న కొన్ని అనివార్య కారణాలతో సీబీఐ విచారణకు హాజరుకాని కవిత. అదే రోజున సీఆర్పీ 191 కింద మరో నోటీసు జారీ
డిసెంబర్ 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు కవిత నివాసంలోనే 6 గంటలపాటు సీబీఐ విచారణ
2023 మార్చి 11న కవితను మొదటిసారి విచారించిన ఈడీ
మార్చి 20న రెండోసారి విచారణ
మార్చి 21న మూడోసారి విచారణ
అదే నెలలో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్. ఈడీ విచారణపై అభ్యంతరం
2024 ఫిబ్రవరి 21న కవితకు సీబీఐ నోటీసులు
మార్చి 15న కవిత ఇంట్లో ఈడీ సోదాలు, అరెస్ట్
అనేక వాయిదాల తర్వాత ఆగస్ట్ 27న కవితకు బెయిల్

Also Read: Raj Tarun: రాజ్ తరుణ్ కు మ్యాటర్ లేదు.. అంతా దానికోసమా.. ఏం షాకిచ్చావయ్యా ?

 

ఎవరెవరు ఎప్పుడు అరెస్ట్ అయ్యారంటే..?

2022 సెప్టెంబర్ 28న సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని
నవంబర్ 11న శరత్ చంద్రారెడ్డి, అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్
నవంబర్ 11న బినోయ్ బాబు, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీ
నవంబర్ 13న అభిషేక్ బోయినపల్లి
నవంబర్ 13న విజయ్ నాయర్
నవంబర్ 29న అమిత్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్
2023 ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా
ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబు, కవిత మాజీ ఆడిటర్
ఫిబ్రవరి 9న రాజేష్ జోషి, చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
ఫిబ్రవరి 11న మాగుంట రాఘవ, ఎంపీ కుమారుడు
మార్చి 2న అమన్ దీప్ దల్ సింగ్
మార్చి 6న అరుణ్ రామచంద్ర పిళ్ళై, కవిత బినామీగా అనుమానం
మార్చి 9న మనీశ్ సిసోడియా
2024 మార్చి 15న కవిత
మార్చి 21న కేజ్రీవాల్

Tags

Related News

Bigg Boss Sonia : సోనియా లవర్ గురించి బయట పడ్డ నిజం.. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా?

Bigg Boss 8 Telugu Promo: మనిషి పుట్టుక పుట్టారా లేదా.. వారిపై అభయ్ సీరియస్, హౌస్‌మేట్స్ మధ్య మరోసారి గుడ్ల లొల్లి

Bigg Boss 8 Telugu: సిగ్గు.. సిగ్గు.. ఆ ముద్దులేంటీ? ఆ హగ్గులేంటీ? బిగ్ బాస్.. ఫ్యామిలీస్ చూస్తున్నారు

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియాతో ప్రేరణ ‘దోశ’ గొడవ.. మణికంఠ తలకు గాయం

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Bigg Boss 11 : కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కు ఫ్యూజులు ఔట్ అయ్యే రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లంటే?

Big Stories

×