EPAPER

Unemployment in India : చేతినిండా డిగ్రీలు.. భారత్ ను భయపెడుతోన్న నిరుద్యోగం

Unemployment in India : చేతినిండా డిగ్రీలు.. భారత్ ను భయపెడుతోన్న నిరుద్యోగం

Unemployment in India : భారత్ యువరక్తంతో వెలిగిపోతున్న మాట వాస్తవమే అయినా అది ఉపయోగం లేకుండా పోతే అందులో అర్థం ఏముంటుంది..? గల్లీకొక విద్యాలయం పుడుతున్న కాలంలో ఉద్యోగాలు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, ఈ పరిస్థితి దేనికి దారి తీస్తుంది..? యువతలో విద్యకు, నైపుణ్యానికి గ్యాప్ తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?


ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన భారతీయులు కనిపిస్తారు. అక్కడ ఏదో ఒక వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. కానీ, సొంత దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. దేశ యువత విద్య పరంగా మంచి మార్కులు, గ్రేడ్లు సంపాదిస్తున్నప్పటికీ.. జీవనోపాధి అవకాశాలు అందిపుచ్చుకోడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇలా, నైపుణ్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొరవడితే.. యువతలో అసహనం పెరిగిపోతుంది. అది, చివరికి దేశంలో తిరుగుబాటుకు కూడా దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు. కొన్ని దేశాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కున్న సందర్భాలున్నాయి. నిరుద్యోగం పెరిగి, ప్రభుత్వాలు వారికి పెన్షన్ వంటి పథకాలు ప్రవేశపెట్టి.. ఆనక ఆర్థిక సంక్షోభం ఏర్పడి, అల్లకల్లోలం అయిన దేశాలూ ఉన్నాయి. ఇక, ఈ పరిస్థితి కంటే ముందు, దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన యువత మానసిక ఆరోగ్యంపై, నిరుద్యోగం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే, ఈ గ్యాప్స్‌ ఎంత త్వరగా పూడ్చడానికి చర్యలు తీసుకుంటే, అంత త్వరగా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడం సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : మైక్రోసాఫ్ట్ ను ఆపేసిన బగ్.. ఈ బగ్ కథేంటి?


భారతదేశంలో నిరుద్యోగ సమస్యపై అంతర్జాతీయ కార్మిక సంస్థ, మానవాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఇటీవల ఓ అధ్యయనం చేపట్టాయి. ‘భారత ఉపాధి నివేదిక-2024’ పేరిట ఆ ఫలితాలను వెల్లడించాయి. దేశంలో పనిచేసే వయసులో ఉన్నవారి సంఖ్య 2011లో 61శాతం కాగా.. 2021నాటికి అది 65 శాతానికి పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. ఇక, ఏటా 78 లక్షల మంది శ్రామిక శక్తిలో భాగస్తులు అవుతున్నా.. నిరుద్యోగులుగా మిగిలిపోతున్నవారిలో 83 శాతం యువతే ఉంటోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, దేశంలో ఎక్కువ ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే లభిస్తున్నాయనీ.. చాలా మంది చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారేనని నివేదిక తెలిపింది. ఇక, గిగ్‌ వర్కర్లు వంటివారు దీని పరిధిలోకే వస్తారు. అయితే, గతేడాది, 90 శాతం పైచిలుకు ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే లభించాయనీ.. కానీ, ఈ రంగంలో పనిచేసే వారికి కనీస వేతనాలు దక్కట్లేదు.. జీవనోపాధికైనా భద్రత ఉండట్లేదని అధ్యయనం వెల్లడించింది.

దేశంలో మొత్తం ఉద్యోగితలో సంఘటిత రంగం వాటా తొమ్మిది శాతమే. అందులో 42శాతం ఉద్యోగాలు అసంఘటిత రంగ స్వభావాన్ని కలిగినవే ఉంటున్నాయి. ఆర్థిక సంస్కరణల మూలంగా ఒప్పంద ఉద్యోగ వ్యవస్థ విస్తరిస్తుండటంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇక, అందుబాటులోకి వస్తున్న ప్రతి వంద ఉద్యోగాల్లో కేవలం రెండు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంటున్నాయని ఉపాధి నివేదిక విశ్లేషించింది. ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీకి హామీలు గుప్పిస్తున్న పార్టీలు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలేదు. దాంతో అనేకమంది విద్యావంతులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని నివేదిక పేర్కొంది. కాబట్టి, సంఘటిత రంగంలో పెద్దయెత్తున ఉద్యోగాలను భర్తీచేయాల్సిన అవసరాన్ని నివేదిక గుర్తుచేసింది.

Also Read : షర్మిల తో గేమ్స్.. వాళ్ల పోస్ట్ ఊస్ట్

ఇక, దేశంలో ఉపాధి అవకాశాలు కొరవడటానికి ప్రధాన కారణం.. నాణ్యతలేని చదువులేనని ఎప్పటి నుండో నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2022 నాటికి దేశ యువతలో 15.62 శాతం వివిధ వృత్తివిద్యలను అభ్యసించారు. కానీ, వారిలో సుమారు 4 శాతమే సంబంధిత వృత్తుల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను సాధించారు. దాంతో ఉద్యోగాలు లభించక చాలామంది ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. దీని వల్ల, దేశంలో తయారీ రంగం కల్పించే ఉపాధి వాటా 12.14 శాతం దగ్గరే నిలిచిపోయింది. ఇప్పుడిక, దీన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని నివేదికలు నొక్కి చెప్పాయి. పెద్దసంఖ్యలో యువత ఉన్నత విద్యను పూర్తి చేస్తున్నప్పటికీ, ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలు వారిలో కొరవడుతున్నాయనీ.. 75 శాతం యువత సరిగ్గా ఈ-మెయిల్‌ పంపలేకపోతున్నారని, 60 శాతం కంప్యూటర్లలో ఫైళ్లను కాపీ, పేస్ట్‌ చేయలేకపోతున్నారంటూ వాస్తవ పరిస్థితిని ఉపాధి నివేదిక వివరించింది. నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు అసలు అభ్యర్థులే దొరకడంలేదని పరిశ్రమలు చెబుతున్నాయి.

దేశంలో యువతకు ఉత్పత్తి రంగంలో ఎక్కువ అవకాశాలను కల్పించాల్సిన అవసరాన్ని నివేదికలు గుర్తుచేస్తున్నాయి. దీని కోసం, విద్యా వ్యవస్థలో ఒకేషనల్‌ శిక్షణను అభివృద్ధి పరచాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలి. ఆధునిక కాలంలో ముఖ్యంగా ఆటోమేషన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, జీ-పాట్‌ వంటి నూతన చదువులు, విధానాలు అన్నింటా ఆధిపత్యం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశ విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానానికి, నైపుణ్యాల అభివృద్ధికి పెద్ద పీట వేయాలి. సైంటిఫిక్‌ టెంపర్‌ను ప్రోత్సహించే చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త కొత్త చదువులు, రంగాల్లో యువతను ప్రోత్సహించాలి. 2022 ఇండియా స్కిల్‌ రిపోర్ట్‌ నివేదిక ప్రకారం మనదేశంలో 52.8 శాతం మహిళలు నూతన రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటే.. పురుషులు కేవలం 47.2 శాతం మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. గతంలో, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించిన నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారత్‌‌లో సుమారు 29 మిలియన్ల యువత నైపుణ్యలేమితో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి.

Also Read : ఇది మన తెలుగోడి కథ.. లోకేశ్‌ కృషితో ‘కువైట్ శివకి విముక్తి!

అభివృద్ధి చెందిన సింగపూర్, సౌత్ కొరియా వంటి దేశాలు తమ దేశాల యువతకు భవిష్యత్ అవసరాలను తీర్చేలా నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాయి. తద్వారా ప్రపంచ మార్కెట్లను అందిపుచ్చుకుని, అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండే విధంగా తర్ఫీదు ఇస్తున్నారు. అదే విధంగా, ఫిన్లాండ్‌ దేశం కూడా ఆ దేశ యువతకు వివిధ పరిశ్రమలకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చదువును, నైపుణ్యాలను అందిస్తుంది. ప్రపంచ మార్కెట్లో నిలబడే విధంగా తర్ఫీదు ఇస్తుంది. ఇలాంటి దేశాల్లా భారత్ కూడా దేశ యువతకు పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక నైపుణ్యాలను అలవర్చే దిశగా చదువుల్లో మార్పు తీసుకురావాలి.

అలాగే.. దేశంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటివి పలు సిఫారసులు కూడా చేశాయి. ప్రభుత్వాలు అభివృద్ధితో కూడిన ఉపాధి కల్పన భావనను విస్మరించడం తగదని, దేశానికి ఉపాధి కేంద్రీకృత అభివృద్ధి చాలా అవసరమని సూచించాయి. కాబట్టి, ఆ దిశగా ఉత్పత్తి రంగాన్ని పరిగెత్తించాలి. ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు పెద్దయెత్తున పెట్టుబడులను సమకూర్చడం కూడా ఎంతో ముఖ్యం. అలాగే, దేశంలో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. ఉద్యోగావకాశాలు పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంటాయి. కాబట్టి భారత్ కు వలసవచ్చేవారికి, మహిళలు, యువత అవసరాలను తీర్చేలా సమ్మిళిత పట్టణ, వలస విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, ఉద్యోగ మార్కెట్లో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాలి. అప్పుడే.. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన లక్ష్యాన్ని సాధించడంలో సక్సెస్ అవుతుంది.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×