EPAPER

Frauds In Gulf Countries: ఎడారి దేశాల్లో తడారిపోతున్న బతుకులు.. నరకానికి నకళ్లుగా గల్ఫ్ దేశాలు

Frauds In Gulf Countries: ఎడారి దేశాల్లో తడారిపోతున్న బతుకులు.. నరకానికి నకళ్లుగా గల్ఫ్ దేశాలు

అసలు గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు ఎలా మోసపోతున్నారో ఒకసారి చూసేద్దాం.. గల్ఫ్‌ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా ఏజెంట్లు చేసుకోవడం దగ్గర్నుంచి సమస్య మొదలవుతుంది. ఇండ్లు, కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మీరు పెట్టిన ఖర్చు రెండు నెలల్లోనే తిరిగి వస్తుంది. ఆ తర్వాత అంతా ఇంటికి పంపుకోవచ్చు అంటూ ఏజెంట్లు ఆశలు చూపిస్తుంటారు. నిజానికి ఎడారి దేశాలకు పొట్టకూటి కోసం వెళ్తున్న వారిలో చాలా మంది సరైన నైపుణ్యాలు లేని వారే ఉంటున్నారు. వారికి చట్టబద్ధంగా ఎలా వెళ్లాలి.. ఎక్కడ నమోదు చేసుకోవాలి వంటి విషయాలు తెలియవు. ఏజెంట్ చెప్పిందే ఫైనల్.. అందుకే ఈ కష్టాలు.

సరైన వీసాలు, అనుమతులు లేకుండా వెళ్లిన వారికి అక్కడ గల్ఫ్‌లో యజమానులు అనుమతి ముద్ర వేస్తేనే ఆ దేశంలో ఉండేందుకు వీలవుతుంది. కొంతమంది యజమానులు కార్మికులను బాగానే చూసుకున్నా.. చాలా మంది నరకయాతన పెడుతుంటారు. ఫస్ట్ వారి దగ్గర్నుంచి పాస్‌పోర్టు తీసేసుకుంటారు. దీంతో కష్టమైనా, నష్టమైనా అక్కడే పని చేయాల్సి ఉంటుంది.తిండి కూడా సరిగ్గా పెట్టరు. కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడనివ్వరు. ఎలాగొలా తప్పించుకుని పారిపోయి బయటికొస్తే పాస్ పోర్ట్ లేని కారణంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తుంటారు. చాలామంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెలు కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతున్నారు. ఉండటానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి ఉండిపోతున్నారు. చివరికి ఆ గొర్రెలకు పెట్టే ఆహారాన్నే తింటూ పొట్ట గడుపుకునే వారందరో ఉన్నారు. అక్కడి కష్టాలు, కన్నీళ్ల గురించి చెప్పాలంటే మాటలు చాలవు.


ఇక అక్కడ పెట్టే టార్చర్ తో కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, మరి కొంతమంది హత్యలకు కూడా గురవుతారు. చాలామంది అనారోగ్యంతో చనిపోతుంటారు. వీరిలో కొన్ని మృతదేహాలు స్వగ్రామం చేరుతుండగా, పాస్‌పోర్టు లేని మృతదేహాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోతున్నాయి. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు లేని ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీసా వచ్చిన వెంటనే దాన్ని ఏజెంట్ తో కాకుండా మరొకరితో అవసరమైతే పోలీస్ స్టేషన్ వెళ్లి క్రాస్ చెక్ చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతం వారికి అరబిక్, ఇంగ్లీష్ రాకపోవడంతో దాన్ని క్యాష్ చేసుకుంటున్న వారూ ఉండడంతో ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015తో పోలిస్తే ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తగ్గింది. తక్కువ ఖర్చులో ప్రయాణం, కుటుంబీకులతో వీడియోకాల్స్ మాట్లాడే సదుపాయం వచ్చినా, రూపాయితో దిర్హమ్ కరెన్సీ పెరిగినా తగ్గిపోయారు. ఇప్పుడు వెళ్లే వారిలో చాలా మంది సరైన విధానంలో వెళ్లకపోవడమే సమస్యలు పెంచుతోంది. అందుకే ఈ పరిస్థితికి చెక్ పడాలంటున్నారు. నకిలీ ఏజెంట్లను గుర్తించడం, జనంలో అవగాహన పెంచడం కీలకంగా మారింది. తెలంగాణలో కోరుట్ల, వేములవాడ, బాల్కొండ, జగిత్యాల, సిరిసిల్ల సహా ఉత్తర తెలంగాణకు చెందిన 21 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు.

Also Read: రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్

అటు ఏపీలో కోనసీమ జిల్లా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్నారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాన్నైతే మినీ గల్ఫ్ గా పిలుస్తారంటే ఏ స్థాయిలో వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఊరికో ఏజెంట్ చొప్పున పుట్టుకొచ్చారు. ఉపాధి కోసం ఎడారి దేశాలు వెళ్లడం తప్పు కాదు. కానీ సరైన పద్ధతిలో అవగాహన పెంచుకుని వెళ్లిన వారు శ్రీమంతులు అయ్యారు. ఏజెంట్ల వలలో పడి వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

విదేశాలకు వెళ్లిన వారి సంక్షేమం ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్ల సంక్షేమాన్ని చూసుకోవడం కేంద్ర, రాష్ట్రాల బాధ్యతే. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వాణిజ్య సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తూ వలస కార్మికులను విస్మరిస్తున్నాయన్న వాదనను కొందరు ఎక్స్ పర్ట్స్ వినిపిస్తున్నారు. చిన్న నేరాలకే చాలా మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారని, వారికి సరైన న్యాయ సహాయం అందడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చివరికి ఏదైనా కారణంతో చనిపోయిన వారి మృతదేహాలు కూడా సరైన సమయానికి భారత్ కు రావడం లేదని, ఏజెంట్ వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా డమ్మీ కంపెనీల మోసాలు అరికట్టవచ్చంటున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యలకు చెక్ పడుతుందంటున్నారు.

కేరళలో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థే ఉంది. అలాగే తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కేరళలో మాదిరిగా ముందస్తు నైపుణ్య శిక్షణ, గల్ఫ్ నుంచి వచ్చిన వారికి విస్తృత స్థాయిలో పునరావాసం, గల్ఫ్ రిక్రూటింగ్ ఏజన్సీల నియంత్రణ, కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలు కోరుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు నైపుణ్య శిక్షణ, మోసాలను తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. ‘టామ్ కామ్’ చట్టబద్ధ మార్గాల్లో ఉపాధి కోసం విదేశాలకు పంపే రిక్రూటింగ్ ఏజెన్సీగా చేస్తుందని అప్పట్లో ఊదరగొట్టినా.. లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇలా బాధితులు రోజుకొకరు ఉండొద్దంటే తెలుగు రాష్ట్రాలు గల్ఫ్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలంటున్నారు.

Related News

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×