EPAPER

Hydra Commission: హైడ్రా 111 జీవో ప్రాంతాలను రక్షిస్తుందా?

Hydra Commission: హైడ్రా 111 జీవో ప్రాంతాలను రక్షిస్తుందా?

Will Hydra Commition Protect 111 GO Places: మహానగరానికి మిగిలిన జీవవాయువు ఏదైనా ఉంటే అక్కడి నుండే రావాలి. ఈ కాంక్రిట్ అడవిలో కాస్త స్వచ్ఛమైన వాతావరణం కావాలంటే అక్కడికే వెళ్లాలి. అంతెందుకు, దేశానికి జీవ నదులు ఉన్నట్లే హైదరాబాద్ మహానగరానికి జీవ చెరువులు అనే చెప్పుకునే ప్రాంతం అది. జీవో 111 చలువతో ఎంతో కాలంగా కబ్జాదారులు కనుసన్నల నుండి ఇక్కడున్న వ్యవసాయ భూములు, నీటి వనరులకు సహకరించే ప్రదేశాలు తప్పించుకుంటున్నాయి. అయితే, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇప్పటికీ ఆ ప్రాంతం ఆక్రమణదారులకు అడ్డాగా మారింది. నిబంధనలకు నీళ్లొదిలి, నిర్థాక్ష్యణ్యంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇంతకీ, జీవో 111లో పరిస్థితి ఎలా ఉంది..? ఆ ప్రాంతాన్ని రక్షించే నాథులే లేరా..? జీవో 111 సంగతేంటి? విశ్వనగరంగా తయారౌతున్న హైదరాబాద్ మహానగరం అభివృద్ధి పథంలో నడుస్తోంది. నడవాలి కూడా.. అయితే, దానికి పర్యావరణాన్ని బలి చేయాలా..? ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే నీటి వనరుల్ని నాశనం చేయాలా..? నలుగురికీ తిండి పెట్టే వ్యవసాయ భూముల్ని నిర్వీర్యం చేయాలా..? మాల్స్, మార్కెట్లే అభివృద్ధికా తార్కాణాలా..? పీల్చుకోడానికి ఆక్సిజన్ లేని అభివృద్ధి అంత అవసరమా..? రేపు హైదరాబాద్ కూడా ఢిల్లీలా దిక్కుతోచని స్థితికి చేరుకోవాలి..? ఇలాంటి చాలా ఆందోళనల మధ్య జీవో 111 ప్రాంతంపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అధికారుల్లోనూ తీవ్రమైన చర్చ కొనసాగుతోంది.


గత ప్రభుత్వం జీవో 111ను రద్దు చేస్తామంటూ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయితే, ఈ నిర్ణయాన్ని విశ్లేషించడానికి వేసిన కమిటీ ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రాంతంలో భూములన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి తాగు నీరు, వ్యవసాయ అవసరాలను తీరుస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తీరం కూడా ఆక్రమణ దారులకు బలౌతోంది. నగరంలోని ఈ రెండు రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలపై ఆంక్షలు కాగితంపై మాత్రమే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. జీవో 111లో ఉన్న ఏడు మండలాలైన.. మొయినాబాద్, గండిపేట్, శంషాబాద్, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ అక్రమ కట్టడాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవో 111 సంగతేంటీ అనేదీ అంతుబట్టకుండా ఉంది.

ముఖ్యంగా, 2007 నుండి ఫుల్ ట్యాంక్ లెవల్, నీటి వనరుల బఫర్ జోన్‌పై వేలకొద్దీ అక్రమ నిర్మాణాలు వచ్చాయి. రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నగరంలో తాగునీటి అవసరాలకు ఇకపై ఈ రిజర్వాయర్లు అవసరం లేదని గత కేసీఆర్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా పేర్కొంది. కానీ, రుతుపవనాలు ఆలస్యం అవుతున్న కారణంగా జంట రిజర్వాయర్లు నుండి నీటిని తీసుకుంటామని మళ్లీ ప్లేట్ ఫిరాయించింది. 17 ఏళ్ల క్రితం అప్పటి ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైనప్పటి నుండీ దీన్ని పట్టించుకోవడంలో చాలా జాప్యం జరిగింది. రెవెన్యూ అధికారులు అనధికార నిర్మాణాలను గుర్తించినప్పటికీ నిరోధక చర్యలు మాత్రం తూతూ మంత్రంగానే నడిచాయి.


2007 అక్టోబర్‌లో ఆక్రమణలపై పంచాయతీరాజ్ శాఖలు రూపొందించిన జాబితాను హైకోర్టుకు సమర్పించారు. దానికి రెండు సంవత్సరాల ముందు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు కలిసి జీవో 111 పరివాహక ప్రాంతాల్లో వందలాది ఫామ్‌హౌస్‌లు వచ్చాయని నివేదించారు. వీటిలో దాదాపు 130 నిర్మాణాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, 2002లో పంచాయతీల వారీగా 128 అక్రమ లేఅవుట్‌లను గుర్తించింది. వీటిలో చాలా శంషాబాద్‌‌లో ఉన్నట్లు తేల్చారు. రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లోని 2 వేల 465 అనధికార గృహాల్లో 2 వేల 341 శంషాబాద్ మండలంలో ఉన్నాయని రంగారెడ్డి కలెక్టర్ నవంబర్ 3, 2007న హైకోర్టుకు నివేదించారు. ఇక, మొయినాబాద్ మండలంలో మరో 123 ఇళ్లు… అలాగే, 261 అక్రమ లేఅవుట్‌లలో శంషాబాద్‌లో 179, మొయినాబాద్‌లో 62, రాజేంద్రనగర్‌లో 8, శంకర్‌పల్లి, చేవెళ్లలో ఆరు చొప్పున ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు…జీవో 111 పరిథిలోని ప్రాంతాలు, వాటి పరిసర ప్రాంతాల్లో వేల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు అంగీకరించారు. అయినా, వీటిపై గత ప్రభుత్వం కినుకు వహించింది.

Also Read: హైదరాబాద్ నాలాలపై.. హైడ్రా ఫోకస్..

2020లో నాటి మంత్రి కేటీ రామారావు జీవో 111 కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారంటూ నాటి కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపించడంతో రాజకీయ యుద్ధం చెలరేగింది. జీవో 111 పరిధిలోకి వచ్చే జన్వాడ గ్రామంలో నిబంధనలను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో నిర్మాణాలు జరిగాయని… అలాగే ఉస్మాన్ సాగర్ లోకి వర్షపు నీరు చేరే సహజసిద్ధమైన నాలాను ఆక్రమించి నిర్మాణాలు జరిగాయని అన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను చూపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను రేవంత్ ఆశ్రయించగా, కేటీఆర్ తో పాటు ప్రభుత్వానికి నోటీసులు అందాయి. అయితే, నాటి కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌస్ నిర్మాణంపై వివరణ ఇవ్వకపోగా… అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో డ్రోన్లు తిప్పారనే కారణంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పటి నుండి కొనసాగుతున్న ఈ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరంతో పాటు, నగర శివారులోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు ‘హైద‌రాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రా’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కొన్ని రోజులుగా నగరంలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన వాటిని కూల్చేస్తున్నారు. అందులో భాగంగా, జీవో 111ను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్‌ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నట్లు నిబంధనల మేరకే అక్కడ జన్వాడలో నిర్మాణం జరిగిందా లేదా అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రూల్స్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే, వెంటనే ఫామ్ హౌస్‌ను కూల్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖలకు చెందిన అధికారులు అనుమతులు ఇచ్చారనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై హెచ్ఎండీఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి సమగ్ర నివేదిక కోరుతున్నారు.

హైడ్రా తన దర్యాప్తులో ఎవ్వరినీ సహించేది లేదనే ధోరణిలో ముందుకు సాగుతోంది. ఎంతగా అంటే… అక్రమ నిర్మాణాలను ఎంకరేజ్ చేస్తున్నారనే కారణంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కూడా హైడ్రా అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే, సిటీ శివారులోని రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్‌కు చెందిన ఫామ్ హౌస్‌లపై హైడ్రా దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీలు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటిపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సమయం, సందర్భం చూసుకుని ఒక్కొక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు విస్వనీయ సమాచారం ఉంది.

గతేడాది, అసెంబ్లీ ఎన్నకలకు ముందు.. జీవో 111 ఎత్తివేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ నేతలతో పాటు రాష్ట్రంలోని బడాబాబుల ఆశలకు రెక్కలొచ్చాయి. జీవో పరిధి గ్రామాల్లో వందల ఎకరాలు పోగేసుకోడానికి ప్రజాప్రతినిధులు, కంపెనీలు, అధికారులు, రియల్టర్లు సిద్ధమయ్యారు. వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ల మధ్య నాటి అధికార పార్టీ పంట పండిందని అనుకున్నారు. లక్షా 32 వేల ఎకరాల భూమిలో రియల్‌ ఎస్టేట్‌పై పాతికేళ్లుగా ఉన్న ఆంక్షలను ఎలాంటి షరతులు లేకుండా ఒక్కసారిగా ఎత్తేయడంతో ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం దొరుకుతుందని అనుకున్నారు. దీనికి ఏడాది ముందే జీవో 111 ఎత్తివేత ఖరారు కాగా… కొంతమంది, ఎడాపెడా వందల ఎకరాలు కొనేశారు. జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని లక్ష ఎకరాల ప్రైవేటు భూముల్లో దాదాపు 70% ధనికుల ఖాతాలోకి చేరింది. నాటి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు, వ్యాపారులు, రియాల్టర్లు దొరికినంత గుంజుకున్నారు. మిగిలిన 30 శాతం భూమిని మాత్రమే రైతులకు మిగిల్చారు. అయితే, ఇప్పుడు హైడ్రా రాకతో జీవో 111 పరిధి ప్రాంతం భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×