EPAPER

Rayachoti constituency: రాయచోటి నియోజకవర్గంలో.. ఈసారి జెండా పాతేదెవరు?

Rayachoti constituency: రాయచోటి నియోజకవర్గంలో.. ఈసారి జెండా పాతేదెవరు?

Who Will Win in Rayachoti Constituency(AP political news): నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యేకి ఈసారి గట్టి పోటీ తప్పదా? గడికోట గడియలు బద్దలు కొట్టే అవకాశం ఉందా? ప్రభుత్వ పథకాలకు జనం ఓటేస్తారా లేక అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా అనేది ఉత్కంఠగా మారింది. రాయచోటి నియోజకవర్గంలో.. ఈసారి జెండా పాతేదెవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాయచోటి.. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి. గతంలో కాంగ్రెస్‌ నుంచి తర్వాత వైసీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం వైపే శ్రీకాంత్ చూస్తుండగా.. కూటమి నుంచి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. రాయచోటి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదిపారు. హోరాహోరీగా సాగిన ఆ యుద్ధంలో విజేత ఎవరు అనేది.. ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.


రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లి ఒక్కరికే.. వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం ఉందని భావించిన టీడీపీ ఆయన్ను రంగంలోకి దించిందట. ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి.. ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవతరంగానే ఉంటుంది. 1955లో ఏర్పడిన నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్‌ పార్టీనే గెలిచింది. టీడీపీ సీనియర్‌ నేత సుగవాసి పాలకొండ్రాయుడు హవాతో.. కాంగ్రెస్‌ వెనకబడినా 2009లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయిందనేది రాజకీయ నిపుణుల మాట.

తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి.. జగన్‌కు అత్యంతసన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో తనదైన శైలిలో వాదన వినిపించిన శ్రీకాంత్‌రెడ్డి అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకత స్థానం సంపాదించుకున్నారు. YS రాజశేఖర్‌రెడ్డి మరణం అనంతరం.. జగన్‌తోనే జతకట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉపఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.అప్పటినుంచి వైసీపీలో కీలకనేతగా శ్రీకాంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని శ్రీకాంత్ రెడ్డి నిరూపించుకున్నారనేది విశ్లేషకుల మాట.


Also Read: తణుకు నియోజకవర్గంలో.. తళుక్కుమనేదెవరు?

రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 31 వేల 637 ఓట్లు ఉండగా.. గత రెండు ఎన్నికల్లోనూ 95 వేల పైచిలుకు ఓట్లను వైసీపీ సాధించింది. 2004లో ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండ్రాయుడు.. 2009లో శ్రీకాంత్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. తర్వాత కాలంలో పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు టీడీపీకి నాయకత్వం వహించినా.. శ్రీకాంత్‌రెడ్డిపై పట్టు సాధించలేకపోయారనేది స్థానికంగా వినిపించే మాట.

దీంతో రెడ్డప్పగారి రమేశ్‌రెడ్డిని టీడీపీ తెరపైకి తెచ్చింది. ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో రమేష్‌.. వైసీపీ గూటికి చేరారు. నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మార్చడంతో శ్రీకాంత్‌రెడ్డి క్రేజ్‌బాగా పెరిగిందట. వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో ఎలాగైనా గెలవాలనే టార్గెట్‌తో కొత్తనేతను.. టీడీపీ తెరపైకి తెచ్చిందట. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అవకాశం కల్పించారు. ఈ వ్యవహరంతో తెలుగుతమ్ముళ్లలో కాస్త అసహనం ఉన్నా.. గెలుపే లక్ష్యంగా పార్టీ తీసుకున్న నిర్ణయం.. తమకు శిరోధార్యం అన్న్నట్లుగా ఎన్నికలు పూర్తి అయ్యాయి.

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినా.. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టడం అంత ఈజీ కాదనేది రాజకీయవర్గాల మాట. బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరఫున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేయటం ఆసక్తికరంగా మారింది. జనసేనతో పొత్తు ఉండటం వల్ల బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చని టీడీపీ భావిస్తోంది. కానీ… నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీకాంత్‌రెడ్డిపై గెలుపు అంత సులువేమీ కాదని విశ్లేషకులు అంటున్నారట. టీడీపీలో అంతర్గత విభేదాల వల్ల అంతిమంగా వైసీపీకే మేలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. దీంతో రాయచోటి కోటలో జెండా ఎవరు ఎగరవేస్తారని ఉత్కంఠ.. అటు అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీలోనూ నెలకొందట. మొత్తంమ్మీద ప్రజలు మార్పు కోరుకుంటే తప్ప.. శ్రీకాంత్‌రెడ్డిని రాయచోటిలో ఓడించటం అంత సులువైన విషయం కాదనే చర్చ సాగుతోంది. మరి.. ప్రజలు ఎవరిపక్షాన నిలిచారు అనేది తెలుసుకోవాలంటూ మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×