EPAPER

Srilanka: ఈసారి లంకాధిపతి ఎవరో?

Srilanka: ఈసారి లంకాధిపతి ఎవరో?

Political Crisis: ద్వీపదేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. దేశాధ్యక్ష పదవి కోసం 39 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదేళ్ల క్రితం 2019లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స గెలవగా, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సోదరుడు మహింద రాజపక్స గెలిచి అధికారంలోకి వచ్చారు. అది మొదలు అన్నదమ్ముల హయాంలో లంకేయుల జీవన స్థితిగతులు మరీ క్షీణించాయి. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడిపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి రావటానికి దశాబ్దాల తరబడి లంక రాజకీయాలను శాసించిన రాజపక్స కుటుంబీకులే కారణమని ఆగ్రహించిన ప్రజానీకం వారిపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో మందుగా.. ప్రధానిగా మహీంద రాజపక్స ముందు వైదొలగగా, తర్వాతి పరిణామాల్లో అధ్యక్షుడిగా ఉన్న గొటబాయ కూడా దిగిపోయి, విదేశాలకు పారిపోవాల్సి వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్‌‌లో జరిగిన దృశ్యాలే ఆనాడు కొలంబో వీధుల్లో కనిపించాయి. కొన్నాళ్ల అనిశ్చితి తర్వాత అన్ని పార్టీల ఆమోదంతో రణిల్‌ విక్రమసింఘె పాలనను చేపట్టి, వేగంగా పలు సంస్కరణలు అమలు చేశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. ఈ పరిస్థితిలోనే అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. ఈ నెల 21న శ్రీలంక వాసులు తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.


ద్వీప దేశంలోని 22 ఎన్నికల జిల్లాల్లో 17 మిలియన్ల మంది ఈ సారి ఓటు హక్కును వినియోగించుకోనుండగా, గురువారం నామినేషన్లు వేయటానికి గడువు ముగిసే సమయానికి 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్‌ శరత్‌ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులు, ముగ్గురు మైనారిటీ తమిళ నేతలు, పలు పార్టీలకు చెందిన పెద్దనేతలున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్‌ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఓటర్లు జాబితాలోని అభ్యర్థులలో ఓటరు తనకు నచ్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రాథాన్యత ప్రకారం ఓటు వేస్తారు. దశల వారీగా తక్కువ వచ్చిన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతూ, చివరికి విజేతను ఎంపిక చేస్తారు. ఈ విధానం మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను పోలి ఉంటుంది. అయితే, తొలి అధ్యక్ష ఎన్నిక నాటి నుంచి తొలి ప్రాధాన్యం ఓటుతోనే ప్రజలు తమకు నచ్చిన అధ్యక్షులను ఎన్నుకుంటూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా బరిలో నిలవలేదు. 1982 అక్టోబర్‌లో జరిగిన తొలి అధ్యక్ష ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేయగా, 2019లో జరిగిన చివరి అధ్యక్ష ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, ప్రధాని దినేశ్ గుణవర్థనె దేశాన్ని గాడిన పెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నది వాస్తవం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 290 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేసినా అది ఏమూలకూ చాలకపోగా, చైనా సహా అనేక దేశాలనుంచి అప్పులు తెచ్చి దేశాన్ని నెట్టుకొస్తున్నారు. సంస్కరణల అమలునూ పట్టాలెక్కించారు. 2023 నవంబర్‌లో బడ్జెట్ తర్వాత అక్కడి ఆర్థిక వ్యవస్థను కొంతవరకూ గాడిలో పెట్టగలిగినా, జనం ఇంకా అధిక ధరలు, వస్తువుల కొరతతో అగచాట్లు పడుతూనే ఉన్నారు. 2022లో 70 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసి, 1.5 శాతానికి తీసుకురావడంలో వీరిద్దరి కృషి ఎంతో ఉంది. ఇక.. వచ్చే మరోమారు అధ్యక్ష పదవిని అందుకునేందుకు యునైటెడ్ నేషనల్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె ఈసారి వ్యూహాత్మకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఈయనకు 30కిపైగా రాజకీయ పార్టీలు, సంఘాలూ మద్దతు పలుకుతున్నాయి. ఇక రాజపక్సల కుటుంబం నుంచి మాజీ ప్రధాని మహింద రాజపక్స తనయుడు నమల్ రాజపక్స (శ్రీలంక పొదుజన పెరమున) బరిలోకి దిగారు. వీరితోపాటు విపక్ష నేత సజిత ప్రేమదాస, నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్ పిపి) నేత అరుణ కుమార దిశనాయకే పోటీలో ఉన్నారు.


Also Read: CM Revanth Reddy: ప్రాజెక్టుల్లో జలకళ.. వరద నీరు రిజర్వాయర్లకు తరలించాలి

లంక ఎన్నికలను చైనా, భారత్ నిశితంగా పరిశీలిస్తున్నాయి. భారత మిత్ర దేశమైన లంకను తనవైపు తిప్పకునేందుకు చైనా ఆ దేశానికి భారీ రుణాలు అందించింది. రాజపక్స సోదరులు అధికారంలో ఉన్న సమయంలో హంబన్ టొటా పోర్టును 99 ఏళ్లపాటు చైనాకు లీజుపై కట్టబెట్టారు.అక్కడే చైనా కంపెనీ ఒక ఆయిల్ రిఫైనరీని కూడా ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా చైనా ఈ విషయంలో కొంతమేర విజయవంతమైంది. ఈ క్రమంలో ఈ దేశంలో తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు కావాలని భారత్ ఆకాంక్షిస్తోంది. అందుకే చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అమెరికా, ఇండియా సైతం శ్రీలంకలో పెట్టుబడులకు దేశీయ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవలే అదానీ గ్రూప్ భారీయెత్తున పవన విద్యుత్ ప్రాజెక్టులు, కొలంబోలో పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. శ్రీలంకతో ఇండియాను కలుపుతూ భూమార్గం నిర్మించాలనే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఇది సాకారం దాల్చితే ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్ఠం కావడంతోపాటు వాణిజ్య అవకాశాలు ఊపందుకుంటాయని భారత పాలకులు భావిస్తున్నారు. గతంలో చైనా అప్పులు ఇచ్చి.. మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దేశాలను తన బుట్టలో వేసుకుని ఒక్కో పొరుగును తనవైపు తిప్పుకోవటంతో ఈసారి లంకలో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడకుండా చూసే పనిలో భారత్ ఉంది. కాగా, ఈసారి ఎన్నికల్లో మళ్లీ రణిల్ గెలవాలని మనదేశం కోరుకుంటున్నా.. సర్వే ఫలితాలు మాత్రం కుమార దిశనాయకే వైపు మొగ్గు ఉందని చెబుతున్నాయి. వామపక్షవాదిగా ముద్రపడిన దిశనాయకే గెలిస్తే మాత్రం చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇండియా ప్రాబల్యానికి ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

మహేష్ కనగండ్ల

(7674963131)

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×