EPAPER

Bangladesh Student Protest 2024: ప్రధాని హసీనా చేసిన తప్పులే.. బంగ్లాదేశ్‌లో అల్లర్లకు కారణమా?

Bangladesh Student Protest 2024: ప్రధాని హసీనా చేసిన తప్పులే.. బంగ్లాదేశ్‌లో అల్లర్లకు కారణమా?

Bangladesh Student Protest 2024: ఏ దేశ ప్రధాని అయినా తన దేశంలో అల్లర్లు జరుగుతుంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలి. కానీ, బంగ్లా ప్రధాని హసీనా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకోవడమే కాకుండా అగ్నికి ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేసారని విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఇంతకీ, ఆమె అన్న మాటలేంటీ..? ప్రధాని హసీనా వ్యాఖ్యలు అంతలా ఎందుకు ప్రభావం చూపాయి..?


బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రిజర్వేషన్ కోటాకు సంబంధించి తన నిర్ణయాన్ని సమర్థించుకోవడంలో తప్పు లేకపోవచ్చు. దానికి తగ్గ కారణాలను సంయమనంగా వివరించి ఉండాల్సింది. కానీ, దేశంలో చెలరేగిన నిరసనలపై ఆమె అగ్నికి ఆజ్యం పోసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులను రజాకార్లతో పోల్చారు. 1971లో బంగ్లాదేశ్‌లో స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ సమయంలో స్వతంత్ర ఉద్యమాన్ని రజాకార్‌లు అణిచివేయాలని చూశారనే వాదన ఉంది. అందుకే ఆ పేరు వింటేనే బంగ్లాదేశ్ ప్రజలు మండిపడతుంటారు. అలాంటిది, తూర్పు పాకిస్థాన్‌కి చెందిన ఈ రజాకార్‌ దళంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోల్చడమే ఇప్పుడు మరింత ఆగ్రహానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే, ప్రధాని హసీనా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ‘స్వాతంత్య్ర సమరయోధుల మనవళ్లకు కాకపోతే కోటా బెనిఫిట్స్ ఎవరికి దక్కాలి? అని హసీనా ఆందోళనకారులను ఉద్దేశించి ప్రశ్నించారు. రజాకార్ల మనవళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలా? అన్నారు. ఇక, నిరసనకారులు ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే, నేను ఏమీ చేయలేను అన్న ఆమె… నిరసనను కొనసాగించవచ్చనీ… నిరసనకారులు ఆస్తులను పాడు చేసినా లేదా పోలీసులపై దాడి చేసినా, చట్టం తన పని తాను చేస్తుందని… ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని వెల్లడించారు. ఇక్కడ, ప్రధాని హసీనా ఉద్దేశం. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి వారసుల ప్రయోజనాలను కాపాడటమే అయినప్పటికీ రజాకార్ అనే పదాన్ని వాడటం ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యింది.


నిజానికి, బంగ్లాదేశ్‌‌లో ఉన్న రిజర్వేషన్ పాలసీ ప్రకారం, 10శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10శాతం మహిళలకు, 5శాతం మైనారిటీ తెగల వారికి, 1శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. దీనికి అదనంగా ఇప్పుడు 30 శాతం స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన వ్యక్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థులతో పాటు ప్రజలు కూడా ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్‌షాహీ, ఖుల్నా, చత్తోగ్రాంలలో దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహిస్తుండగా రాను రానూ దేశవ్యాప్తంగా ఉన్న ఇతర యూనివర్సిటీలకు కూడా ఉద్యమం వ్యాపించింది. అయితే, విద్యార్థి కేంద్రంగా నడుస్తున్న ఈ ఉద్యమాన్ని రజాకార చర్యలతో పోల్చడం ఇప్పుడు మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది.

Also Read: మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయా?.. కొత్త బడ్జెట్‌పై ఆశలు..

గతంలోకి వెళితే.. బంగ్లాదేశ్ చరిత్రని రజాకార్‌లను విడదీసి చూడలేని పరిస్థితి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగింది. పాకిస్థాన్‌ నుంచి విడిపోయి స్వాతంత్య్రం కావాలని అందరూ బంగ్లాదేశ్ ప్రజలు ఉద్యమించారు. ఆ సమయంలోనే పాకిస్థాన్‌ ఆర్మీ ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పారామిలిటరీ ఫోర్స్‌ని రంగంలోకి దింపింది. ఈ దళాన్ని రజకార్ల దళం అంటారు. ఈ సైన్యంలో పాకిస్థాన్‌కి మద్దతుగా ఉన్న బెంగాలీలతో పాటు, ఉర్దూ మాట్లాడే బిహారీలు కూడా ఉన్నారు. అయితే, వీళ్లు చేయని దారుణమంటూ లేదని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అత్యాచారాలు, మూక హత్యలు, దాడులతో ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు రజాకార్లు. ఈ దాడుల్లో లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్వాతంత్య్రం సాధించినప్పటికీ.. ఈ ఉద్యమం మాత్రం చరిత్ర పుటల్లో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.

అయితే, ఆ ఉద్యమం సమయంలో అరాచకాలు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వీలుగా 2010లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రత్యేంగా ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కాగా.. ఇంత దారుణమైన చరిత్ర ఉన్న రజాకార్లతో ఆందోళనకారులు పోల్చడమేంటని కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితులు అదుపు తప్పుతుంటే వాటిని సరి చేయాల్సింది పోయి ప్రభుత్వం ఇంకా రెచ్చగొడుతోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ విధించింది హసీనా ప్రభుత్వం. చాలా చోట్ల భద్రతా బలగాలు మొహరించి ఆందోళనకారులను కట్టడి చేస్తోంది. గొడవలు చేసే వాళ్లు కనిపిస్తే కాల్చి పారేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఒక విధంగా, హసీనా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ చారిత్రకంగా జరిగిన అన్యాయాలను పరిష్కరించడానికి ఆమె వ్యూహంలో భాగంగా ఉంది. ఆమె పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో ఇది ప్రముఖంగానూ కనిపించింది. అయితే, సదరు ట్రిబ్యునల్ చాలా మంది వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు నిషేధించబడిన జమాత్-ఇ-ఇస్లామీ పార్టీకి చెందినవారు ఉన్నారు. 2019 డిసెంబర్‌లో, ప్రభుత్వం రజాకార్లుగా గుర్తించబడిన 10 వేల 789 మంది వ్యక్తుల జాబితాను ప్రచురించింది. ఇది ఈ రజాకార్ల సహకారులకు మొదటి అధికారిక గుర్తింపుగా గుర్తించబడింది. ఈ జాబితాలో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. భవిష్యత్ తరాలు వారి చర్యల చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకునేలా హసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే, ఇందులో రాజకీయ కోణం ఉందనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ఇక, రాజకీయాల మాట అటుంచితే, ఈ రిజర్వేషన్ పాలసీ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా సామాన్యులను ఉద్యోగ అవకాశాలకు దూరం చేస్తుందనే విమర్శలను ఎదుర్కుంటోంది.
ఇక, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల అంశం గతంలోనూ వివాదాస్పదమైంది. 1972లో ఇది అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంలో…. విమర్శలు రావడంతో ఈ రిజర్వేషన్ పాలసీని 2018లో పక్కన పెట్టేశారు. అయితే, ఇటీవల ఐదో సారి ప్రధానిగా పీఠం ఎక్కిన తర్వాత ఈ రిజర్వేషన్‌లను అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టుదల వదల్లేదు. కచ్చితంగా అమలు చేస్తామని తేల్చి చెప్పారు.

Also Read: లోక్‌సభలో నీట్ రగడ, రాహుల్ సూటి ప్రశ్న

దీనితో దేశంలో అల్లర్లు మరింత ఉద్ధృతంగా మారాయి. జులై 19న ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు, బాష్పవాయు గోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను, పెద్ద శబ్దాలు చేసే గ్రనేడ్లను ప్రయోగించారు. అయినా పరిస్థితి సద్దుమణగలేదు. దాంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించింది. ఢాకాలో ఇంటర్నెట్, మొబైల్‌ సేవలను నిలిపివేశారు. అన్ని రకాల సభలు, ప్రదర్శనలను నిషేధించారు.

ఇప్పుడిక విద్యార్థుల ఉద్యమం రిజర్వేషన్ కోటా వ్యవస్థకు మించి డిమాండ్లను పెంచింది. దేశంలో అధిక శాతంగా ఉన్న యువత నిరుద్యోగం ఉద్యమాన్ని విస్తృతం చేసింది. అలాగే, స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ వంటి సమస్యలు విద్యార్థుల అసంతృప్తికి కారణం అయ్యాయి. ఆర్థిక అవకాశాలు పరిమితంగా ఉన్న దేశంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, వాటి సాధారణ వేతనాలు, ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజకీయం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని హసీనాను డిక్టేటర్‌గా పేర్కొంటున్న విద్యార్థులు కోటా పాలసీని వెనక్కి తీసుకుంటే తప్ప ఉద్యమం ఆగదని చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో 20 ఏళ్ల హసీనా అధికారం బీట్లు వారే స్థాయికి వెళ్లిందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇక, బంగ్లాలో కాకరేపుతున్న ఈ మంటలు ఎప్పుడు ఆరిపోతాయా అని అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×