EPAPER

Manipur: మణిపూర్ మంటలు ఆగేదెప్పుడు..?

Manipur: మణిపూర్ మంటలు ఆగేదెప్పుడు..?

Manipur Conflict: సుమారు 17 నెలలుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మళ్లీ రాజుకుంది. ఇక్కడ జాతుల సంఘర్షణ ఈనాటిది కాకున్నా.. నిరుడు మే 3 నుంచి అడపా దడపా రెండు వర్గాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. అనేక శాంతి ప్రయత్నాల తర్వాత జిరిబాయ్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో సీఆర్‌పీఎఫ్, అస్సాం రైఫిల్స్, హ్మార్, మెయితీ, థాడ్, మిజోరామ్ కమ్యూనిటీల ప్రతినిధులు ఆగష్టు 2న కాల్పులు విరమణకు అంగీకరించారు. కానీ, దీనిని జిరిబాయ్ జిల్లా బయట ఉన్న కొన్ని హెచ్మార్ గిరిజన సంస్థలు వ్యతిరేకించటంతో, సెప్టెంబర్ 1న కొన్ని గ్రామాలపై డ్రోన్ దాడులు జరిగి, పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా, 9 మంది గాయపడ్డారు. దీంతో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలలో అక్కడి జనం బతుకులీడుస్తున్నారు.


మణిపూర్‌లో ప్రధాన తెగలుగా ఉన్న కుకీ, మెయితీ తెగల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తోంది. మణిపూర్ 1949లో భారత్‌లో విలీనమైన నాటికే ఈ ఘర్షణ ధోరణి ఈ తెగల్లో ఉంది. ఈ రాష్ట్ర జనాభా నిష్పత్తిలోని తేడాలూ ఈ ఘర్షణకు కారణాలుగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో మెయితీల వాటా 53 శాతం కాగా వీరంతా విష్ణువును ప్రధాన దైవంగా పూజించే హిందువులుగా ఉన్నారు. మైదాన ప్రాంత వాసులైన వీరంతా ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు. మరోవైపు 47 శాతం మంది కుకీలు, జో, నాగా తెగల వారు. వీరు కొండప్రాంతాల్లో నివసిస్తారు. వీరిలో 99 శాతం మంది క్రైస్తవులుగా ఉన్నారు. కుకీ,జో గిరిజనులకు అమలు జరుపుతున్న రిజర్వేషన్లను తమకూ ఇవ్వాలంటూ నిరుడు మెయితీలు డిమాండ్ చేయటం, మెయితీ తెగకు చెందిన హిందూ సీఎం బీరెన్ సింగ్ ఉండగా, హైకోర్టు ఈ రిజర్వేషన్లకు పచ్చజెండా ఊపటంతో నిరుడు రగడ మొదలైంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తిమంతులైన మెయితీలను ఎస్టీ జాబితాలోకి చేరిస్తే తమ జీవితాలు ఇంకా దుర్భరమవుతాయని కుకీలు, నాగాలు వాదిస్తు్న్నారు. ఆ వాదనలూ ప్రతివాదనలు శ్రుతిమించి భౌతిక దాడుల రూపం తీసుకున్నాయి.

Also Read: ముంబై మొదటి భూగర్భ మెట్రో లైన్ 3ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఛార్జీల వివరాలు ఇవే


స్వాభావికంగా మణిపూర్ వాసులు సాత్వికులే. వీరు ఆర్థికంగా నష్టపోవటానికైనా సిద్ధపడతారు గానీ, తమ రాజకీయ, సాంస్కృతిక వారసత్వానికి భంగం కలిగితే సహించలేరు. జనాభాలో మెయితీల వాటా ఎక్కువ కనుక సహజంగానే అసెంబ్లీలో వారి ప్రాతినిథ్యం అధికంగా ఉంది. దీనికి తోడు హిందూ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వైఖరి, క్రైస్తవులుగా ఉన్న మిగిలిన తెగలలో అభద్రతకు కారణమవుతోంది. ముఖ్యంగా గత 34 ఏళ్లుగా మణిపూర్‌ సీఎంలంతా మెయితీలే కావటం, కుకీలు, నాగాలుండే ప్రాంతాల కంటే మెయితీలుండే రాజధాని ఇంఫాల్, కొన్ని ఇతర ప్రాంతాలకే నిధుల కేటాయింపులు జరిగి, వారు అభివృద్ధి పథంలో సాగుతున్నారనే భావన కుకీ, నాగా తెగలలో స్థిరపడిపోయింది. అటు.. కేంద్ర, రాష్ట్ర పాలకులు దీనిని జాతుల, సాంస్కృతిక, మతపర, భాషాపరమైన కోణంలో చూడకుండా, ఆర్థికకోణంలో చూస్తూ, ప్యాకేజీలు ఇస్తూ, ఒప్పందాలు కుదుర్చుకుంటూ రావటం వల్ల ఈ సమస్య నేటికీ సజీవంగా ఉండిపోయింది. మణిపూర్‌లో గత 17 నెలలలో జరిగిన హింసతో 230 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. 67 వేల మంది సర్వం కోల్పోయి సహాయశిబిరాల్లో బతుకుతున్నారు. హింస మూలంగా 32 మంది ఆచూకీ లేకుండా పోగా, 4800 ఇళ్లు తగలబడ్డాయి. 400 ప్రార్థనా మందిరాలు ధ్వంసమయ్యాయి. మహిళలపై లైంగిక దాడులకైతే లెక్కేలేదు. పలువురు రాష్ట్రాన్ని విడిచి పొరుగుతావుల్లో పనిచేసుకోవాల్సి వచ్చింది. విద్వేష మూకల భయానికి చదువులను సగంలోనే వదిలేసి పారిపోయిన యూనివర్సిటీ విద్యార్థులు తిరిగి చేరలేదు. తమ బిడ్డలు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని తెలిసినా, అధికారులు దానిని ప్రకటించకపోవటంతో వారికి మరణానంతర మతపరమైన విధులు చేయలేకపోతున్నామనే దిగులుతో పలువురు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర బలగాలతో కూడిన యూనిఫైడ్ కమాండ్‌ను ఏర్పాటుచేసి అక్కడ శాంతిభద్రతల బాధ్యతను కేంద్రం పరోక్షంగా తన చేతుల్లోకి తీసుకున్నా పరిస్థితిలో మార్పులేదు. మెయితీలు-కుకీ, జో గిరిజనుల మధ్య ఘర్షణలను అదుపుచేయలేక తలపట్టుకుంటున్న భద్రతా దళాలకు అక్కడి విద్యార్థుల ఆందోళనలు మరో తలనొప్పిగా మారుతున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ కుకీలపై జరిగిన హింసాత్మక దాడుల్లో 11 మంది చనిపోగా, దీనిని నిరసిస్తూ కుకీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనల ధాటికి 2000 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలను కేంద్రం దించింది. నాటి నుంచి కొన్ని వేలమంది ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. ప్రధాని ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాకపోగా, హోం మంత్రి అమిత్ షా ఒకటి, రెండు సార్లు సందర్శించి సరిపెట్టేశారు. పరస్పర విశ్వాసం కోల్పోయిన జాతుల నడుమ సయోధ్య కుదర్చాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు, రాజకీయ ప్రయత్నాలకు ప్రాధాన్యమివ్వకుండా సాయుధ బలగాలనే నమ్ముకోవటమే పరిస్థితి దిగజారటానికి కారణం.

Also Read: దళితులపై ఆ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ… వైరలవుతున్న వీడియో

బీజేపీ పాలిత మణిపూర్‌లో కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన యూనిఫైడ్ కమాండ్‌ను తనకు అప్పగించాలని ఇటీవల సీఎం.. ఆ రాష్ట్ర గవర్నర్‌ను కోరినా, అందుకు కేంద్ర హోం మంత్రి స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు, ఎన్ని కేంద్ర బలగాలను పంపినా ఉపయోగం లేదంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, సీఎంకు స్వయానా అల్లుడైన రాజ్ కుమార్ ఇమో సింగ్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినా స్పందనా లేదు. పైగా, మెయితీల వాణిగా చెప్పే సంస్థ వ్యవస్థాపకుడైన బెంగోల్ ఎల్ సనజోబాను రాజ్యసభకు కేంద్రపెద్దలు ఎంపిక చేయటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ‘మీ గుండెల మీద చేయి వేసుకుని, మణిపూర్‌లో నిరాశ్రయుల గురించి, వారి తల్లులు, పిల్లలు, భర్తలను పోగొట్టుకున్న మహిళల గురించి ఆలోచించైనా, చర్యలు ప్రారంభించండి. అక్కడి ప్రజలు ఆయుధాలు చేతబట్టి తమ గ్రామాలను కాపాడుకుంటున్నా.. కేంద్ర పెద్దలుగా చూస్తూ ఉండటం న్యాయం కాదు’ అంటూ ఇన్నర్ మణిపూర్ ఎంపి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన బిమోల్ అకోయిజామ్ ప్రాధేయపడటంతో తాజాగా మరోమారు దేశవ్యాప్తంగా మణిపూర్ అంశం చర్చకు వచ్చింది. ఈ కీలక సమయంలోనైనా, కేంద్ర పెద్దలు ఉదాసీనత వీడి, అక్కడి ప్రధాన వర్గాలతో చర్చలకు పిలుపునివ్వాల్సిన అవసరముంది.

Related News

JP Nadda: తెలంగాణ బీజేపీ లీడర్లపై జేపీ నడ్డా ఫైర్.. ఎందుకంటే..

YSRCP: ఆ నియోజక వర్గంలో వైసీపీ దుకాణం బంద్ ?

History of Naxalism: మావోయిస్టుల అంతం.. ఎందుకీ పరిస్థితి వచ్చింది?

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

×