EPAPER

HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2

HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2

వరంగల్ ఆక్రమణలపై స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2


– వరదలు వచ్చినప్పుడల్లా బిక్కుబిక్కుమంటూ జీవనం
– హైడ్రా తరహాలో వాడ్రా వస్తేనే వరంగల్‌లో మార్పు
– ఇదంతా గత పాలకులు, అధికారుల పాపమే
– ప్రస్తుతం ప్రభుత్వమన్నా పట్టించుకోవాలి
– మమ్మల్ని వరదల నుంచి రక్షించాలి
– ఓరుగల్లు ప్రజల ప్రత్యేక వినతి

సతీష్ పబ్బు, స్వేచ్ఛ వరంగల్ ఇన్వెస్టిగేషన్ టీం


Warangal Wants Wadra similar to HYDRA: కొందరు చేసిన పాపం ఇంకొందరికి శాపంగా మారుతుంది. వరంగల్‌లో జరుగుతోంది అదే. విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు, అడ్డగోలు పర్మిషన్లతో వరదలు వచ్చినప్పుడల్లా జనం అవస్థలు పడుతున్నారు. అందుకే అక్కడివారు వాడ్రా కావాలని అడుగుతున్నారు. ఆక్రమణలను తొలగించి నగరానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు ఎక్కించాల్సిందే!

వరంగల్ మహా నరగంలో గుర్తింపు పొందిన చెరువులు, కుంటలు ఎన్నో ఉండేవి. సాగు చేయకపోయినప్పటికీ వర్షాకాలంలో నిండుకుండల్లా కనిపించేవి. ప్రస్తుతం అవి ఆక్రమణలపాలవుతున్నాయి. కొన్నింటిలో నిర్మాణాలు జరిగి, పేరులో మాత్రమే కుంటలుగా కొనసాగుతున్నాయి. పట్టణంలో పెద్ద చెరువులుగా ఉన్న భద్రకాళి, వడ్డేపల్లి, కోట చెరువు, బంధం చెరువు, ఉర్పు చెరువు, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి, న్యూశాయంపేట చెరువు, గొర్రెకుంట కట్టములన్న, కడిపికొండ, భట్టుపల్లి చెరవుతో పాటు పుల్లాయకుంట, లెనిన్‌నగర్, మీరాసాబ్ కుంట, బీరన్న కుంట, కాశికుంట, తుమ్మలకుంట, వీవర్స్ కాలనీ చిన్నకుంట, శాకరాశికుంట చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆయా చెరువుల్లో వందల నిర్మాణాలు వెలిశాయి. ఇవేగాక విలీన గ్రామాల్లోని పదుల సంఖ్యలో ఉన్న చెరువు శిఖాల్లో వందలాది ఎకరాలు కబ్జాదారుల కబంధహస్తాల్లోకి చేరాయి. ఈ క్రమంలో కాకతీయులు నిర్మించిన చారిత్రాత్మక గొలుసుకట్టు చెరువులను చెరబట్టి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు ఎక్కించాల్సిందేనని నగర ప్రజల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

హైడ్రా వచ్చాక హడలిపోతున్న కబ్జాదారులు

ప్రభుత్వ భూములు కబ్జా చేసి విక్రయించిన వారు, బిల్దింగులు నిర్మించుకున్న వారు, చెరువులు, శిఖం భూములు, నాలాలు ఆక్రమించుకుని నిర్మించుకున్న వారు, వివిధ కారణాలతో నాడు హ్యాపీగా ఉన్నా హైడ్రా కారణంగా నేడు వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో, హైదరాబాద్‌లో హైడ్రా మాదిరిగా ఓరుగల్లులో వాడ్రా ఏర్పాటు చేస్తే అనేక అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఈ ఉచ్చులో ఒకనాటి అధికార పార్టీ నాయకులు అనేక మంది చిక్కుతారనే చర్చ జరుగుతోంది. వీరితో పాటు రియల్ వ్యాపారులు ఇరుక్కుంటారని అంతా అంటున్నారు. అంతేకాకుండా ముందుముందు ఆక్రమణదారులకు గడ్డుకాలం తప్పదని చెబుతున్నారు.

Also Read: Land Allotment: గుడ్ న్యూస్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

వాడ్రా రావాల్సిందే
హైదరాబాద్‌లో ఎలాగైతే హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ భూముల పరిరక్షణ చర్యలు చేపడుతున్నారో అలాగే ఓరుగల్లులో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. వరంగల్‌లో గొలుసు కట్టు చెరువులు కబ్జా చేశారు. వీటిని కాపాడాలంటే కచ్చితంగా వరంగల్‌కు వాడ్రా ఆపరేషన్ చేపట్టాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
పింగిలి అశోక్ రెడ్డి, ప్రజాతంత్ర ఆలోచనా వేదిక

చెరువుల పరిరక్షణ చర్యలు చేపట్టాలి
తెలంగాణలో ఎక్కడా లేనంతగా వరంగల్ మహానగరంలో కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. కానీ, వీటిని పాలకులు, బడాబాబులు చెరపట్టి భవష్యత్ తరాలకు చెరువులు కనబడకుండా చేయాలని చేస్తున్నారు. ఇప్పటికే చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఏరియాల్లో వందల ఎకరాల్లో నిర్మాణాలు చేయడం దారుణం. ఇప్పటికే చాలా చెరువులు కుచించుకుపోయాయి. ఇక్కడ చెరువుల పరిరక్షణకు వాడ్రా ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలి. చెరువులు కబ్జాకోరుల చెర నుంచి విడిపించాలి.
తిరుణహరి శేషు, తెలంగాణ ప్రజా వేదిక కన్వీనర్

వరంగల్‌ను ముంపు నుంచి కాపాడాలి
చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలు తొలగించి గ్రేటర్ వరంగల్‌ను ముంపు బారి నుంచి కాపాడాలి. అనేక సంవత్సరాలుగా చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తుంటే, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోగా తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. వాడ్రా తీసుకు వచ్చి వెంటనే ఆక్రమణలు తొలగించాలి.
తుపాకుల దశరథం, ప్రజాతంత్ర ఆలోచనా వేదిక

ఇంకా ఎంతకాలం ముంపు గండం
గడిచిన ఐదు సంవత్సరాలుగా మునుపెన్నడూ లేని విధంగా, వర్షాకాలం వస్తే చాలు వరద భయం వేధిస్తోంది. వర్షాకాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ఆక్రమణలతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా ఎంతకాలం భరించాలి. ప్రభుత్వం వెంటనే వాడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించాలి.
వరంగల్ ముంపు భాధితుడు

Also Read: Anitha: జగన్.. ఇంతకు నువ్వు ఒక్క పులిహోర ప్యాకెటైనా పంపిణీ చేశావా..?: అనిత

వర్షాకాలం వస్తే ఇండ్లు వదిలి వెళ్లాల్సిందేనా?
పేరుకే వరంగల్ మహా నగరం. వర్షాకాలం వస్తే ఏజెన్సీ ఏరియాలో కంటే అధ్వాన్నం. నాలాలు ఉప్పొంగి మురుగు నీరు, వరద నీరు కలిసిపోతుంది. ప్రాణాపాయ పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. విధి లేక వరదల సమయంలో కొందరు ఇండ్లు విడిచి వెళ్లాల్సిన దుస్థితి. నాలాల ఆక్రమణలకు అధికారుల సహకారంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హైడ్రా తరహాలో వరంగల్‌లో వాడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించి ముంపు బారి నుంచి నగరాన్ని కాపాడాలి.
వరంగల్ ముంపు బాధితుడు

కబ్జాకు గురైన చెరువుల లిస్ట్ (ఇంకా ఉన్నాయి)

ములుగు రోడ్డులోని కోట చెరువు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. 30 ఎకరాలకు పైన ప్రైవేట్ వ్యక్తుల చెరలో ఉంది
భద్రకాళీ చెరువు సుమారు 497 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. 100 ఎకరాలకు పైబడి ఆక్రమించుకున్నారు
హనుమకొండ వడ్డేపల్లి చెరువు 336 ఎకరాలు ఉండేది. 30 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది
ములుగు రోడ్డు కోట చెరువు 120 ఎకరాల వరకు ఉండేది. దాదాపు 40 ఎకరాలు లెక్కలేకుండా పోయింది
కాజీపేట బంధం చెరువు 57 ఎకరాలు ఉండేది. 35 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి
న్యూశాయంపేట చెరువు 150 ఎకరాలు ఉండేది. 20 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది
గొర్రెకుంట కట్టమల్లన్న చెరువు 21 ఎకరాల్లో 9 ఎకరాలు ఆక్రమించుకున్నారు
అమ్మవారిపేట దామెర చెరువు 134 ఎకరాల్లో ఉండేది. 25 ఎకరాల వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది
ఉర్సు రంగసముద్రం చెరువు 120 ఎకరాలకు, 30 ఎకరాలు ఆక్రమించుకున్నారు

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×