EPAPER

War in Asia 2023 : ఆసియాలో ప్రపంచయుద్ధం.. మనం ఎవరి పక్షం?

War in Asia 2023 : ఆసియాలో ప్రపంచయుద్ధం.. మనం ఎవరి పక్షం?
War in Asia 2023

War in Asia 2023 : అదో చిన్న ద్వీప దేశం. పేరు తైవాన్. అయితే.. దానిని తనలో విలీనం చేసుకునేందుకు పొరుగునే ఉన్న చైనా దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ దేశమే కాదనీ, అది చైనాలోని భాగమని చైనా వాదన. అయితే.. తాము సర్వస్వతంత్రులమని, చైనాలో విలీనం ప్రశ్నే ఉత్పన్నం కాదని తైవాన్ స్పష్టం చేస్తోంది. ఈ వివాదంలో తలదూర్చిన మరో అగ్రదేశమైన అమెరికా మాత్రం.. తైవాన్ వాదనే సరైందనే పాట పాడుతోంది. యుద్ధం చేసైనా తైవాన్‌ను కలుపుకోవాలని చైనా ప్రయత్నిస్తుండగా, అదే జరిగితే.. నీకు అండగా నిలిచి, చైనాకు బుద్ధిచెబుతానని అమెరికా గర్జిస్తోంది. ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే ఈ ఘర్షణ.. పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందేమోనని అంతర్జాతీయ సమాజం కంగారుపడుతోంది.


ఇదీ చరిత్ర
తైవాన్ ప్రస్తుతం స్వయంపాలనలో ఉంది. బయటినుంచి చూసేందుకు అది స్వతంత్రదేశంలా కనిపించినా.. నిజానికి దానికి అధికారికంగా చైనా నుంచి నేటికీ స్వతంత్రం లభించలేదు. దీంతో చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది. తైవాన్‌ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా.. దీనికి తైవాన్ ప్రజలు, ప్రభుత్వం గానీ అందుకు అంగీకరించడం లేదు.

దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. అక్కడ మొదట చైనా నుంచి వలస వెళ్లిన ‘ఆస్ట్రోనేసియన్’ గిరిజన ప్రజలు స్థిరపడినట్లు భావిస్తున్నారు. చైనా రికార్డుల ప్రకారం క్రీ.శ.239లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించారు. ఆ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుంది.


1624-1661 మధ్యకాలంలో డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తరువాత 200 ఏళ్లకు పైగా(1683-1895) చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది.

17వ శతాబ్దం ఆరంభంలో చైనాలోని కఠిన పరిస్థితులను తాళలేక ప్రధానంగా ఫూజియన్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులకు చెందిన ప్రజలు నేటి తైవాన్‌కు భారీ సంఖ్యలో వలస వెళ్లారు. నేడు తైవాన్ వాసులంతా దాదాపు నాటి వలసదారుల వారసులే.

1895లో మొదటి సైనో-జాపనీస్ యుద్ధంలో చైనాలోని క్వింగ్‌ ప్రభుత్వం ఓడిపోవటంతో తైవాన్.. జపాన్ దానిని ఆక్రమించుకుంది. 1945 నాటి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తైవాన్‌‌ను జపాన్ వదులుకోగా, అమెరికా, బ్రిటన్‌ల అనుమతితో చైనా.. తైవాన్‌ను పాలించటం మొదలుపెట్టింది.

అయితే.. అనుకోకుండా చైనాలో అంతర్యుద్ధం ప్రారంభం కావటం, మావో నాయకత్వంలోని సేనలు.. నాటి చైనా పాలకుడైన షియాంగ్ కై-షెక్ బలగాలను ఓడించటంతో, 1949లో ఆయన, ఆయనకు మద్దతుగా నిలిచిన 15 లక్షలమంది జనం.. తైవాన్ వెళ్లిపోయారు.

నిజానికి తైవాన్ మొత్తం జనాభాలో షియాంగ్ అనుచరుల వాటా కేవలం.. 14శాతమే అయినా నాటి నుంచి ఇటీవలి వరకు అక్కడి రాజకీయాన్ని వారే శాసించారు. తైవాన్ వచ్చాక.. షియాంగ్, ఆయన తర్వాత ఆయన కుమారుడు షియాంగ్ చింగ్-కో తైవాన్ పాలకులుగా ఉండగా, తైవాన్‌లో వచ్చిన ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా.. షియాంగ్ చింగ్-కో 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతినివ్వటంతో షియాంగ్ వంశీకుల కుటుంబ పాలన అంతమైంది.

పట్టువదలని చైనా
దశాబ్దాల వైరం, యుద్ధం పేరుతో హెచ్చరికల తర్వాత 1980 నాటికి చైనా, తైవాన్ మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ‘ఒక దేశం- రెండు వ్యవస్థల’ సూత్రాన్ని చైనా ప్రతిపాదించింది. తమతో కలిసిపోతే.. తైవాన్‌కు స్వతంత్రతను కల్పిస్తామని ఆ సందర్భంగా చైనా అభయమిచ్చింది. అయితే.. దీనిని తైవాన్ ససేమిరా అన్నది. ఈ క్రమంలో తాము చైనాతో యుద్ధానికైనా సిద్ధపడతాం తప్ప చైనాలో విలీనం కాబోమని 1991లో తైవాన్ ప్రకటించింది.

2000, 2004లో జరిగిన ఎన్నికల్లో తైవాన్ ప్రజలు ‘స్వతంత్ర తైవాన్’ అనుకూలుడైన షెన్ షుయ్-బియాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవేళ.. తైవాన్ తమను కాదని మరోదేశంలో కలిసే ప్రయత్నం చేస్తే.. నేరుగా ఆ దేశంపై యుద్ధం చేయొచ్చనే కొత్త చట్టాన్ని 2005లో చైనా తీసుకొచ్చింది.

అయితే.. 2008లో కొత్త అధ్యక్షుడైన మా ఇంగ్-యూ వాణిజ్య ఒప్పందాల ద్వారా చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. తర్వాత 2016లో స్వతంత్ర తైవాన్ ఆకాంక్షలు గల ట్సాయ్ ఇంగ్-వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2016లో డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, ట్సాయ్ ఇంగ్-వెన్ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. అలా 1979లో అమెరికా-తైవాన్ మధ్య తెగిపోయిన సంబంధాలు మళ్లీ చిగురించాయి.

అమెరికాతో తైవాన్ స్నేహం చైనాకు మరోమారు చిరాకు తెప్పించింది. ఈ క్రమంలోనే ప్రపంచదేశాలన్నీ.. తమ తమ వెబ్‌సైట్లలో తైవాన్‌ను చైనాలో భాగంగా గుర్తించాలని, లేకుంటే తమ దేశంలో అలాంటి దేశాల వ్యాపారాలను అడ్డుకుంటామని హెచ్చరించింది.

నేటికీ గందరగోళమే..

తైవాన్‌ను ఎలాంటి దేశంగా గుర్తించాలనే దానిపై అంతర్జాతీయ సమాజం నేటికీ గందరగోళంలోనే ఉంది. 1949లో తైవాన్‌కు వలసపోయిన షియాంగ్ కై-షెక్, తమ ప్రభుత్వమే మొత్తం చైనాకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస భద్రతా మండలిలోనూ 1971 వరకు చైనాకు ఆ ఆ పార్టీనే ప్రాతినిధ్యం వహించింది. అనేక పాశ్చాత్య దేశాలు షియాంగ్ ప్రభుత్వాన్నే, అధికారిక చైనా ప్రభుత్వంగా గుర్తించాయి. కానీ, 1971లో బీజింగ్‌లోని ప్రభుత్వాన్నే ఐరాస గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత.. తైవాన్‌లోని ఆర్‌వోసీ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) ప్రభుత్వాన్ని గుర్తించే దేశాల సంఖ్య 20కి పడిపోయింది.

సొంత రాజ్యాంగంతో పాటు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే తైవాన్‌కు 3లక్షల సైనిక బలం కూడా ఉంది. 10 లక్షలమంది తైవాన్ ప్రజలు.. నేటికీ చైనాలో జీవిస్తుండగా, తైవాన్ వాసులు 60 బిలియన్ డాలర్లను చైనాలో పెట్టుబడి పెట్టారు. రాజకీయ సంబంధాలు పెద్దగా లేనప్పటికీ.. తైవాన్, చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. తమ ఆర్థికవ్యవస్థ చైనాపై ఆధారపడిందని కొందరు తైవాన్ వాసులు కంగారు పడుతుంటే.. అదీ మంచిదేననీ, తమ పెట్టుబడి చైనాలో ఉన్నంత వరకు ఆ దేశం తమమీద దండయాత్ర చేయబోదని మరికొందరు తైవాన్ వాసులు నమ్ముతున్నారు.

తైవాన్‌లోని డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ.. స్వతంత్ర తైవాన్‌కు మద్దతిస్తుండగా, అక్కడి కేఎంటీ పార్టీ చైనాతో కలవాలని కోరుకుంటోంది. మిగిలిన పార్టీలన్నీ.. ప్రస్తుత పరిస్థితిని కొనసాగిస్తేనే మేలని భావిస్తున్నాయి.

అమెరికా స్నేహం..కొంపముంచేనా?
చైనాను ఆసియాలో బలమైన శక్తిగా ఎదగనీయకుండా ఆపేందుకు, గత పదేళ్లుగా అమెరికా.. తైవాన్ ఆర్థిక సాయం అందిస్తోంది. అక్కడి అమెరికన్ కాంగ్రెస్.. ‘తైవాన్ రిలేషన్స్ యాక్ట్’‌ను ఆమోదించి, అందులో భాగంగా తైవాన్‌కు రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తోంది. అంతేకాదు.. తైవాన్‌పై చైనా ఎలాంటి దాడి చేసినా అది తమను ‘తీవ్రమైన ఆందోళన’కు గురిచేస్తుందని అమెరికా ప్రకటించింది.

అలాగే.. 1996లో తైవాన్ మొదటి అధ్యక్ష ఎన్నిక వేళ.. దాన్ని ప్రభావితం చేసేందుకు చైనా మిసైల్ పరీక్ష చేసింది. అయితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. తమ యుద్ధనౌకలను తైవాన్‌కు పంపటం సంచలనంగా మారింది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ జిన్ పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా తైవాన్ అంశం చర్చకు వచ్చింది. నిప్పుతో చెలగాటమాడితే మీకే నష్టమని జిన్‌పింగ్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. తైవాన్ పై ఆధిపత్యం కోసం యుద్ధానికైనా సిద్ధమన్నట్లుగా చైనా మాట్లాడుతోంది. అప్పుడప్పుడు చైనా విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించి ఆ దేశాన్ని రెచ్చగొడుతున్నాయి.

తైవాన్ నుంచి భారీగా చైనాకు వస్తున్న పెట్టుబడులు, ప్రపంచంలో తయారయ్యే సగం సెమీ కండెక్టర్లు తైవాన్‌లోనే తయారుకావటంతో… దానిని కలుపుకుంటే సమీప భవిష్యత్తులో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగేందుకు పనికొస్తాయనేది చైనా ఆశ. అయితే.. కూతవేటు దూరంలోని తైవాన్.. తన ప్రత్యర్థి అమెరికాతో రాసుకుపూసుకు తిరగటాన్ని మాత్రం చైనా జీర్ణించుకోలేకపోతోంది. మరో రెండేళ్లలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినట్లుగా.. దాడి చేసేందుకు చైనా ఇప్పటినే సన్నాహాలు చేస్తోందనే వార్తలూ వస్తున్నాయి.

మరో పక్క చైనాకు కూడా యుద్ధం ఇష్టం లేదన్నది బహుకొద్ది మంది వాదన. దానివల్ల వచ్చే ఆర్థిక, ఇతరత్రా నష్టాలను చైనా బేరీజు వేసుకుంటోంది. కాకపోతే టిబెట్ ను కలిపేసుకున్నట్లుగా తైవాన్ ను కూడా కలిపేసుకోవాలన్న ఆశ మాత్రం ఉంది.

ఏది ఏమైనా.. చైనా దూకుడు, అమెరికా పోకడ చూస్తుంటే.. ఆసియా మరో ప్రపంచ యుద్ధానికి రణభూమిగా మారబోతోందనే వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే నిజమైతే.. దీని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీదా పడకతప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్, గాజా విషయాల్లో తటస్థ వైఖరిని అవలంబిస్తున్న మనదేశం.. ఇక్కడే గనక యుద్ధం వస్తే.. ఎలాంటి వైఖరి తీసుకోనుందనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×