EPAPER

Vikram Sarabhai : అంతరిక్షాన్ని అరచేతిలోకి తెచ్చిన సారాభాయ్..!

Vikram Sarabhai : అంతరిక్షాన్ని అరచేతిలోకి తెచ్చిన సారాభాయ్..!
Vikram Sarabhai

Vikram Sarabhai : భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ అని చాలామందికి తెలుసు. కానీ.. దాని వెనక ఉన్న విక్రమ్ సారాభాయ్‌ జీవితం గురించి బహుకొద్దిమందికే తెలుసు. అంతేకాదు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వ్యవస్థాపకుడిగా, రోదసిలో భారత కీర్తి పతాకను నిలిపిన వ్యక్తిగా, డా. ఏపీజీ అబ్దుల్ కలాం వంటి ఎందరికో గురువుగా నిలిచిన విక్రమ్ సారాభాయ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని జీవన విశేషాలను ఓసారి గుర్తుచేసుకుందాం.


అహ్మదాబాద్‌లో 1919, ఆగస్టు 12న ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో విక్రమ్ సారాభాయ్ జన్మించారు. తండ్రి అంబాలాల్ సారాభాయ్ అహ్మదాబాద్‌లో పెద్ద వ్యాపారి మాత్రమే గాక స్వాతంత్ర్య సమరయోధుడు. తండ్రి ప్రారంభించిన రిట్రీట్ స్కూల్లోనే చదివిన విక్రమ్.. తర్వాత అహ్మదాబాద్ కళాశాలలో ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ పుచ్చుకున్నారు. ఫిజిక్స్, మాథ్స్‌పై ఉన్న ఆసక్తితో 1937 లో ఇంగ్లండ్‌లోని సెయింట్ జోన్స్ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. 24 ఏళ్లకే కేంబ్రిడ్జి నుండి డాక్టరేట్ పొంది తిరిగి భారత్ చేరుకున్నారు. భారత్ తిరిగి రాగానే.. కశ్మీర్‌లో హిమాలయాల మీదికి వెళ్లి ఒక ల్యాబ్ పెట్టి సూర్యకిరణాల మీద పరిశోధన చేయాలని భావించారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావటంతో ఆయన.. సీవీ రామన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బెంగళూరు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో చేశారు. రామన్ సాహచర్యంలో విక్రమ్ సారాభాయ్ అనేక విషయాలు నేర్చుకున్నారు. కాస్మిక్ కిరణాలపై విక్రమ్ పరిశోధనలకు.. అక్కడే ఉన్న హోమి జె బాబా కూడా ఆ సమయంలో తన సహాయ సహకారాలు అందించారు.

ఎత్తయిన ప్రదేశాలలో కాస్మిక్ కిరణాల ప్రభావాన్ని పరిశోధించాలనే సంకల్పంతో ఒక ల్యాబ్ పెట్టాలని భావించారు. దీనికోసం 1943లో హిమాలయాల్లోని కశ్మీర్ వంటి ప్రాంతాలను పరిశీలించారు. చివరకు అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసర్చ్ లేబొరేటరీని ప్రారంభించి.. దేశంలో తొలిసారిగా అంతరిక్షానికి, కాస్మిక్ కిరణాలపై పరిశోధనకు పునాది వేశారు. 1955లో కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఆ సంస్థకు సంబంధించిన మరో శాఖను ప్రారంభించి దాని ప్రారంభోత్సవానికి నాటి ప్రధాని నెహ్రూని ఆహ్వానించారు. ఆ వెంటనే కొడైకెనాల్, తిరువనంతపురాలలో కూడా సారాభాయ్ శాఖలు ప్రారంభించారు.


1957 అక్టోబరు 4 న సోవియట్ యూనియన్ బీచ్ బాల్ సైజ్ ఉపగ్రహం స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి పంపింది. దీంతో భారత దేశం కూడా అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించాలని విక్రమ్ సారాభాయ్ నడుం బిగించారు. వెంటనే భారత ప్రభుత్వానికి తన ప్రణాళికలు చెప్పి, ఒప్పించి 1962 లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసర్చ్‌కి రూపకల్పన చేసి, దాని చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఏడేళ్ళ తర్వాత 1969లో అదే..ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)గా మారింది.

వైజ్ఞానిక సృహ గల ప్రధాని నెహ్రూ ప్రోత్సాహం, హొమి జె. బాబా వంటి సైంటిస్టుల సహకారంతో దేశంలోనే మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తుంబా గ్రామంలో విక్రమ్ ఏర్పాటు చేశారు. బోలెడన్ని కొబ్బరి చెట్లతో ఉండే ఆ గ్రామం త్రివేండ్రం విమానాశ్రయానికి దగ్గరగా ఉండేది. అక్కడి సెయింట్ మేరీ మగడెలినేస్ చర్చ్‌ని తమ ఆఫీసుగా మార్చారు. దాని పక్కనే ఉన్న బిషప్ ఇంటిని వర్క్ షాపుగా మార్చి పనిముట్లు తయారుచేయించారు. ఆ ఇంటిపక్కనే ఉన్న పశువుల కొట్టాన్ని లేబొరేటరీగా వాడుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం వంటి యువ సైంటిస్టులతో కలిసి అక్కడే ఉంటూ విక్రమ్ పనిచేసేవారు.

తుంబా రాకెట్ ప్రయోగశాల నుంచి భారత తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ విజయవంతం కావటంతో విక్రమ్ మరింత దూకుడుగా పనిచేశారు. ఆయన చొరవ కారణంగానే దూరదర్శన్, తర్వాతి కాలంలో వందలాది టీవీ ఛానళ్లు మన దేశంలో రాగలిగాయి. ఓవైపు అంతరిక్ష రంగానికి పనిచేస్తూనే విక్రమ్ సారాభాయ్.. మరోవైపు కాస్మిక్ కిరణాలపై తన పరిశోధనను కొనసాగిస్తూనే వచ్చారు. నేషనల్ ఫిజికల్ రీసర్చ్ లాబొరేటరీ, ఇస్రోలతో బాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌లోని ఇసిఐఎల్, జార్ఖండ్‌లో యురేనియం కార్పొరేషన్ వంటి సంస్థలకూ విక్రమ్ రూపకల్పన చేశారు.

ఓ రోజు ఊటీలో టెన్నిస్ ఆడుతున్న విక్రమ్ సారాభాయ్‌కు, ఆయన కంటే ఏడాది పెద్దదైన మృణాళినితో పరిచయం ఏర్పడింది. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన మద్రాసు హైకోర్టు లాయరు సుబ్బరామ స్వామినాథన్ కుమార్తె అయిన.. మృణాళిని, విక్రమ్‌ల పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె మల్లికా సారాభాయ్ నర్తకిగా, నటిగా, సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకోగా.. కుమారుడైన కార్తికేయ సారాభాయ్ పర్యావరణ పరిరక్షణ శాఖలో శాస్త్రవేత్తగా పనిచేశారు.

1971 డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ త్రివేండ్రమ్ ‌దగ్గరున్న కోవళం బీచ్ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. ఉదయం నిద్రలేవకపోయేసరికి ఆయన పడుకున్న గది తలుపులు పగల కొట్టి చూడగా, లోపల దోమతెరలో ఆయన ప్రశాంతంగా పడుకుని కనిపించారు. ఆయన గుండెలపై ఒక పుస్తకం ఉంది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. 2 గంటల ముందే చనిపోయారని నిర్ధారించారు. అప్పటికి విక్రమ్ సారాభాయ్ వయసు కేవలం 52 ఏళ్లు.

సైన్సుకూ, సమాజానికీ ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ (1966), పద్మవిభూషణ్ (1972) లిచ్చి గౌరవించుకొంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ఆయన పేరు పెట్టుకొని గౌరవించింది. సైన్సు ఫలితాలను అనుభవించటమే గాక.. దాని వెనకున్న విక్రమ్ సారాభాయ్ వంటి వ్యక్తుల విశిష్ట సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×