EPAPER

Vaikunta Ekadasi : ముక్కోటి శోభ.. వైకుంఠ ఏకాదశి..

Vaikunta Ekadasi : ముక్కోటి శోభ.. వైకుంఠ ఏకాదశి..

Vaikunta Ekadasi : ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనమే మార్గమన్నది హిందువుల విశ్వాసం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. భక్తులందరూ పెద్ద ఎత్తున ఇదే రోజు శ్రీమహావిష్ణువును దర్శించుకోవడానికి చాలా వైశిష్ట్యం ఉంది. చాలా ప్రత్యేకమైంది. ఈ ఏకాదశి తిథి మహా విష్ణువులు చాలా ప్రీతకరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.


హిందూ ఆచారంలో ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత ఎంతో ఉంది. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పురాణాలు చెబుతున్న మాట. ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి.., ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు. స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం ద్వారా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.

వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శించుకుంటే.. పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అయితే వైకుంఠ ద్వార దర్శనంతో అన్నీ సమస్యలు పోతాయా.. అంటే అశాశ్వతమైన శరీరం గురించి ఆందోళన వీడాలి. మోక్షానికి అర్హత సాధించాలి. ఆతృత, ఆవేదనలకు దూరంగా ఉండాలి. లోటును విడవాలి. భగవత్ సంబంధాన్ని తిరిగి పొందాలి. అప్పుడే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. భౌతిక ప్రపంచానికి దూరమైనప్పుడు ప్రతీదీ శాశ్వతమై దివ్య ఆనందం పొందుతారన్నది శాస్త్రోక్తి.


ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడన్నది నమ్మకం. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైనది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26 సార్లు వస్తుంది. అయితే.. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది.

డిసెంబరు 22 శుక్రవారం ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాలకు పూర్తవుతుంది. అయితే.. సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్నరోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి.. 23వ తేదీనే ఏకాదశి పర్వదినంగా నిర్ధారించారు. పురాణాల ప్రకారం.. ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడాని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీనివాసుని దివ్య సన్నిధి దర్శనం సకల పాప హరణంగా భక్తులు నమ్ముతుంటారు. అందుకే సరిగ్గా అదే రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం చాలా మంది ఆరాట పడుతుంటారు.

ఏకాదశి అంటే పదకొండు. అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున స్వర్గానికి ద్వారం తెరచుకుంటుందని చాలా మంది విశ్వాసం. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలొస్తాయని హైందవుల నమ్మకం.

తాత్కాలికమైన లేదా మారుతున్న వాటిపై బుద్ధిని కేంద్రీకరిస్తే అది ఆందోళనను సృష్టిస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ తమ అశాశ్వతమైన ఈ దేహంపైనే దృష్టి పెడతారని, దాంతో ఈ దేహం మారుతున్న కొద్దీ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి ఆందోళనలకు దూరంగా ఉండటానికి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉపవాసం, ఉత్తర ద్వార దర్శనంతో మనసు స్థిమిత పడుతుందంటారు.

వైకుంఠ లోకాలు కూడా అనేకం. నృసింహ భగవానుని పట్ల ఆకర్షితులైతే ఆ నృసింహ వైకుంఠాన్ని చేరుకుంటారన్నది నమ్మకం. అలాగే కేశ, మాధవ, గోవింద, మధుసూదన, శ్రీరామ మొదలైన రూపాల పట్ల ఆకర్షితులైన వారు వారి వారి వైకుంఠ లోకాలను చేరుకుంటారు. అందుకే ఈ శుభతిథి నాడు వైకుంఠ ద్వారంలోనికి ప్రవేశించి, ఉత్తర ద్వారం వద్ద ఆసీనుడై ఉన్న ఆ పరమాత్మున్ని దర్శనం చేసుకున్న వారు కచ్చితంగా మోక్షానికి అర్హతను పొంది ప్రస్తుత దేహాన్ని త్యజించిన తర్వాత వైకుంఠాన్ని చేరుకుంటారన్న శాస్త్రోక్తి.

వైకుంఠం అనేది పరిపూర్ణత సాధించిన జీవులు దేవాదిదేవుని దివ్య లీలల్లో పాల్గొని నిత్యం సేవించే పరమోన్నత దివ్య ధామంగా చెబుతారు. వైకుంఠంలో.. అత్యంత సర్వోన్నతమైన బృందావనంలో ప్రతి అడుగూ నృత్యమే. ప్రతి పలుకూ గానమే అన్నట్లుగా ఉంటుంది. అక్కడ అంతా శాశ్వతం. సమస్తం ఆనందమయం. ఉల్లాసభరితం. అంతేగానీ… ఆర్తనాదాలు, ఆతృత, ఆందోళన, దుఖాలు, వ్యామోహాలు, క్రోధాలూ ఇవేవీ ఉండవు. అందుకే అది వైకుంఠం. మనం మరచిన ఆ భగవత్సంబంధాన్ని తిరిగి పొందటమే జీవన్ముక్తి. అది ఈ ఏకాదశి పర్వదినం నుంచే మొదలైతే అంతకు మించిందేమిటి? అదే జరిగితే ప్రతి రోజూ పరమాత్ముడు కాపాడుతాడన్నది విశ్వాసం. ప్రతి ఇంటిని వైకుంఠంగా తీర్చిదిద్దుకుంటేనే తదుపరి జన్మలో దివ్య వైకుంఠ లోకానికి ప్రవేశద్వారాలు తెరుచుకుంటాయన్నది ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన విషయం.

.

.

Tags

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×