EPAPER

Adani Cement vs Birla: అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్.. ఎవరిది పై చెయ్యి ?

Adani Cement vs Birla: అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్.. ఎవరిది పై చెయ్యి ?

UltraTech Cement To Buy Majority Stake In India Cements: ఇద్దరు అగ్ర వ్యాపారవేత్తల మధ్య యుద్ధం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ప్రయత్నంలో జాగ్రత్తలు కూడా అంతే అవసరం. అందుకే, అదానీ ఆచీ తూచీ అడుగేస్తున్నారు. మరోవైపు, బిర్లా గ్రూపు తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో వెనక్కి తగ్గట్లేదు. ఇక, నిపుణులు కూడా ఈ పోటీకి సంబంధించి ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. మార్కెట్ ఆటుపోట్లను బట్టి పోటీ ఉండాలని సూచిస్తున్నారు. ప్రధాని మోడీ 3.0 పాలన.. భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధిపై దృష్టి పెట్టడంతో కీలకమైన నిర్మాణ సామగ్రి సరఫరాపై ఆధిపత్యం చెలాయించడానికి ఈ వ్యాపారవేత్తలు ఇద్దరూ ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారు. అందులోనూ ఏదైన ఒక రంగంలోకి ప్రవేశించినప్పుడల్లా ఆ రంగంలో ఆధిపత్యం సాధించడం, పోటీదారులను వేగంగా ఎదుర్కోవడంలో అదానీ దూకుడు కొత్తేమీ కాదు. అందుకే, అదానీ అడుగుపెట్టిన తర్వాత, సిమెంట్ రంగంలో తాజాగా తీవ్రమైన పోటీ కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.


అదానీ దూకుడు కారణంగానే అల్ట్రాటెక్‌ కూడా విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2022లో అదానీ గ్రూప్.. అంబుజా సిమెంట్స్, ACC లిమిటెడ్‌లను కొనుగోలు చేయడంతో రాత్రికి రాత్రే నెంబర్-2 సిమెంట్ మేకర్‌గా మారింది. అయితే, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక తర్వాత.. అదానీ 2023లో ఎక్కువ భాగం తనపై ఉన్న ఆరోపణలను ఆర్పుకునే పనిలోనే గడిపారు. పోర్ట్స్-టు-పవర్ అంటూ ఈ ఏడాది పూర్తిగా సంస్థ విస్తరణ మార్గాల కోసం పనిచేశారు. ఈ గ్యాప్‌లో బిర్లా గ్రూప్ సిమెంట్ రంగంలో తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాలు చేసింది.

సిమెంట్ రంగంలోకి అదానీ ప్రవేశించినప్పటి నుండి ఇప్పటికే నాలుగు కొనుగోళ్ల నుండి వెనక్కి తగ్గింది. ప్రత్యామ్నాయంగా.. 2028 నాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు రెట్టింపు చేయాలని చూస్తోంది. అదానీ గ్రూప్ తన పరిధిని విస్తరించడానికి, కీలకమైన ముడిసరుకు, సున్నపురాయి నిల్వలను సేకరించడానికి మరిన్ని సిమెంట్ అసెట్‌ల కోసం వెదుకుతోంది. ఇక, రాబోయే రెండేళ్లలో కొనుగోళ్ల కోసం సుమారు $4.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉంది. అయితే, భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ పోర్ట్ ఆపరేటర్‌ను నియంత్రిస్తున్న అదానీ గ్రూప్.. చైనా సిమెంట్ తయారీదారుల వ్యయ సామర్థ్యానికి సరిపోలేకపోయినా.. ఖర్చులను గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక, సముద్రం లేదంటే, లోతట్టు నీటి రవాణాకు ట్రక్కుల ద్వారా రవాణాలో కొంత భాగం ఖర్చవుతుంది. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ నెట్‌వర్క్ అక్కడ సహాయపడుతుంది.


Also Read: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్, 60 మందికి గాయాలు..

అలాగే, అదానీ పోర్ట్స్ ఇప్పటికే కేరళలోని ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్‌లో 2 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను ప్లాన్ చేస్తోంది. కాబట్టి, ఈ గ్రూప్ సంస్థల నుండి గ్రీన్ ఎనర్జీ ఇంధన ఖర్చులను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం.. విమానాశ్రయాలు, విద్యుత్ సౌకర్యాల నుండి రోడ్లు, వంతెనలు, సొరంగాల వరకు అన్నింటినీ భారీగా నిర్మించాలనే ప్రధాని మోడీ లక్ష్యం.. భారతదేశ మౌలిక సదుపాయాల పెట్టుబడిని మార్చి 2026 నాటికి 15 ట్రిలియన్ రూపాయలకు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం సిమెంట్‌కు భారీ డిమాండ్‌ను పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇక, రాబోయే సంవత్సరాల్లో ఇది ప్రస్తుత సరఫరాకు మరింత అధికంగా ఉండబోతోంది. దీనితో, అదానీ బిర్లాల మధ్య అడ్డుకోలేని పోటీ అవకాశాలు పెరిగాయి.

గత నెలలో పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసిన అదానీ, ఇటీవలి కాలంలో జేపీ గ్రూప్‌తో పాటు ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్‌ను హస్తగతం చేసుకునే ఆలోచన చేయగా… ఓరియంట్ సిమెంట్ ఇప్పుడు అల్ట్రాటెక్‌ను కూడా ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్, మంగళం సిమెంట్ లిమిటెడ్, వాద్రాజ్ సిమెంట్ లిమిటెడ్, బాగల్‌కోట్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి ఇతర సంస్థలు కూడా వీరి పోటీలో లక్ష్యాలుగా ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా, దక్షిణ భారతదేశంలో సిమెంట్‌కు భారీ మార్కెట్ ఉంది. అత్యధిక నిర్మాణ సామర్థ్యం, అనేక సంవత్సరాలుగా సామర్థ్యాన్ని విస్తరించని పెద్ద సంఖ్యలో సంస్థలు ఇక్కడ మార్కెట్‌కు మరింత సహకరిస్తున్నాయి.

ఈ సంస్థల్లో కొన్ని తమకు అనుకూలమైన ధరను అందిస్తే సిమెంట్ పరిశ్రమ నుండి నిష్క్రమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాన్నే అటు అదానీ, ఇటు బిర్లా గ్రూప్‌లు అవకాశంగా తీసుకుంటున్నాయి. అనువుగా ఉన్న ప్రతి కంపెనీనీ తమలో విలీనం చేసుకోడానికి పావులు కదుపుతున్నాయి. అందుకే, దక్షిణ భారతదేశం రెండు గ్రూపులకు హంటింగ్ గ్రౌండ్‌గా మారిందనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆధారిత పెన్నా సిమెంట్, గుజరాత్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సౌరాష్ట్ర సిమెంట్, జైప్రకాష్ అసోసియేట్స్‌తో పాటు ABG షిప్‌యార్డ్ యాజమాన్యంలోని వడరాజ్ సిమెంట్ కంపెనీలపై అదానీ కన్నేశారు. ఈ సిమెంట్ కంపెనీల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ 3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయించిందని నివేదికలు చెబుతున్నాయి.

జూన్‌లో అదానీకి చెందిన పెన్నా సిమెంట్ కొనుగోలు దక్షిణ భారతదేశంలో దాని పాదముద్రను పెంచడం కోసం తీసుకున్న స్టెప్ అనేది అర్థమవుతోంది. కొన్ని రోజుల తర్వాత, అల్ట్రాటెక్ కంపెనీ ఇండియా సిమెంట్స్‌ను టార్గెట్ చేసింది. దీనితో, అల్ట్రాటెక్.. 200 మిలియన్ టన్నుల లక్ష్యానికి మార్గాన్ని వేగవంతం చేసింది. ఇక, దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణం.. గృహా నిర్మాణాల్లో ప్రభుత్వ వ్యయం కారణంగా సిమెంట్ పరిశ్రమలో కొనుగోళ్లు వేగం పుంజుకుంటున్నాయి. ఇది, సిమెంట్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ను కూడా అధికం చేసింది. మిత్రా సంస్థ నివేదికల ప్రకారం భారతదేశంలో దాదాపు 100 మంది సిమెంట్ తయారీదారులు ఉన్నారు. ఇందులో, చాలా మంది చిన్న మార్కెట్ షేర్లను కలిగి ఉన్నారు. వీరంతా, 28 మిలియన్ టన్నుల అసెట్ బ్లాక్ సముపార్జనకు రెడీగా ఉన్నారు. ఇక, అదానీ, బిర్లాలు తమ మార్కెట్ వాటాను కొనసాగించాలని అనుకుంటున్న తరుణంలో M&A ఒప్పందాలు కొనసాగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: పశ్చిమ బెంగాల్ జోలికొస్తే తాట తీస్తాం: మమతా బెనర్జీ

అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి, అదానీ ఎంత దూకుడు ప్రదర్శించినా అల్ట్రాటెక్‌ను పడగొట్టడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య అంతరం కాస్త ఎక్కువగానే ఉంది. మరోవైపు, ఈ పోటీ తాత్కాలిక ప్రయోజనాలను ఇస్తుంది తప్ప, రాను రానూ పరిస్థితుల్లో వచ్చే మార్పులతో సిమెంట్ డిమాండ్ కూడా తగ్గే అవకాశముందనీ… దీనితో, ఇప్పుడు పోటీ పడుతున్న ఈ రెండు కంపెనీలు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, అదానీ, బిర్లా గ్రూపులు అధిక మార్కెట్ వాటా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొనుగోళ్లను జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని సూచిస్తున్నారు. సిమెంట్ డిమాండ్ ఇప్పుడు బలంగా ఉన్నప్పటికీ.. మరో నాలుగైదు సంవత్సరాల్లో అది తగ్గుతుందని ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పరిశోధకులు చెబుతున్నారు.

దీనికి తోడు, దాల్మియా భారత్ లిమిటెడ్, శ్రీ సిమెంట్ లిమిటెడ్, JSW సిమెంట్ లిమిటెడ్ వంటి చిన్న కంపెనీలు కూడా పెరుగుతున్నాయనీ మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గినప్పుడు, నివాస ప్రాపర్టీలు పుష్కలంగా ఉన్నప్పుడు, ఈ అదనపు సిమెంట్‌ను ఉపయోగించుకోడానికి తగినంత డిమాండ్ ఉంటుందా? అనే ప్రశ్న కూడా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ, వ్యాపారంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించాలనే పోటీ ఎప్పుడూ ఉంటుంది. ఇందులో భాగంగా దిగ్గజ వ్యాపారవేత్తలు తీసుకునే నిర్ణయాలు కూడా పరిస్థితులకు తగ్గట్లే ప్లాన్డ్‌గా ఉంటాయి. ఇక, ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో ఇరు గ్రూపులు మధ్య సిమెంట్ యుద్ధం దాదాపు తారా స్థాయికి చేరుకుంది. అయితే, ఇందులో ఎవరు ఎక్కడ తగ్గుతారో.. ఎవరు నెగ్గుతారో చూడాల్సి ఉంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×