EPAPER

TN Seshan : ఎన్నికలకు కొత్త అర్థం చెప్పిన శేషన్..!

TN Seshan : ఎన్నికలకు కొత్త అర్థం చెప్పిన శేషన్..!

TN Seshan : అది న్యూఢిల్లీలోని పండారా రోడ్. 1990 డిసెంబర్‌ చివరి వారంలో ఒకరోజు రాత్రి ఒంటి గంటకు ఆ శీతాకాలపు మంచు తెరలను చీల్చుకుంటూ ఓ తెల్లని అంబాసిడర్ కారు ఆ రోడ్‌లోని ఓ గవర్నమెంటు క్వార్టర్ట్స్‌లోకి దూసుకొచ్చింది. అందులోంచి నాటి చంద్రశేఖర్ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న సుబ్రమణ్య స్వామి దిగి.. చొరవగా ఆ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంటిలో కాపురముంటున్న ఉన్నతాధికారి పేరు.. టీ ఎన్ శేషన్. అప్పట్లో ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడు. 1960ల్లో వీరిద్దరూ కలిసి హార్వర్డ్ యూనివర్సిటీలో కలిసి చదువుకోవటం, వాళ్లిద్దరూ తమిళులే కావటం ఈ చనువుకు కారణం. అయితే వయసులో స్వామి కంటే శేషన్ కాస్త పెద్దవారు. హార్వర్డ్‌లో ఉన్నరోజుల్లో స్వామికి ఎప్పుడు ఇంటి భోజనం తినాలని అనిపించినా.. శేషన్ ఫ్లాట్‌కు వెళ్లి పెరుగన్నంలో రసం వేసుకుని తినే అలవాటుండేది. కానీ ఆ రోజు శేషన్ ఇంటికి పెరుగన్నం కోసం రాలేదు. నాటి ప్రధాని చంద్రశేఖర్ దూతగా అక్కడికి వచ్చారు. లోపలికి రాగానే ఏ సంకోచమూ లేకుండా ‘కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా వెళ్లటం ఓకేనా..?’ అంటూ ఉత్సాహంగా అడిగారు.


సుబ్రమణ్య స్వామి ప్రతిపాదన విన్న శేషన్ చాలా కాజువల్‌గా ‘నిన్న క్యాబినెట్ సెక్రటరీ వినోద్ పాండే కూడా ఇదే అడిగాడు. ఎవడూ పట్టించుకోని ఆ నిర్వాచన్ సదన్‌కు నేను వెళ్లనని చెప్పేశా’ అన్నాడు. కానీ స్వామి రెండు గంటల పాటు అక్కడే కూర్చొని ఆ బాధ్యత తీసుకోవాలంటూ తన మిత్రుడిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘సరే.. ఆలోచించి చెప్తాలే’ అన్న తర్వాత గానీ స్వామీ అక్కడి నుంచి కదలలేదు. స్వామి కారు బయలుదేరగానే శేషన్.. సుమారు ఉదయం 3.30 గంటలకు నాటి విపక్షనేత రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి ‘ అర్జెంటుగా మీతో ఓ 5 నిమిషాలు పర్సనల్‌గా మాట్లాడాలి. ఇంటికిరావచ్చా’ అని అడిగ్గా అటునుంచి రమ్మని జవాబొచ్చింది.

శేషన్.. అక్కడికి వెళ్లే సరికి రాజీవ్ డ్రాయింగ్ రూంలో కాస్త ఆతృతగా వేచి చూస్తున్నారు. ఐదు నిమిషాల్లోపే వారి భేటీ ముగిసింది. ఇక బయలుదేరతా అంటూ శేషన్ సోఫాలోంచి లేవబోతుండగా, రాజీవ్ గాంధీ గట్టిగా ‘ఫ్యాట్‌ మాన్ ఈజ్ హియర్.. ప్లీజ్ సెండ్ సమ్ చాక్లెట్స్ ప్లీజ్’ అని ఉత్సాహంగా అరిచారు. ‘మీరు ఆ భాధ్యతలు తీసుకోవటం నాకూ ఇష్టమే’ అని రాజీవ్ తన అభిప్రాయం చెప్పటంతో తెచ్చిన చాక్లెట్లు చేత బుచ్చుకున్న శేషన్ బయటికి కదిలాడు. ఆయన వెంటే గుమ్మం వరకూ వచ్చిన రాజీవ్ ఆయన్ను ఉడికిస్తూ ‘నిన్ను ఆ కుర్చీలో కూర్చొబెట్టినందుకు ఆ గడ్డం మనిషి జీవితాంతం బాధపడతాడులే’ అని వీడ్కోలు పలికాడు. ఆ రోజు గడ్డం మనిషి అంటే.. ఆయన భాషలో నాటి ప్రధాని చంద్రశేఖర్.


ప్రధానిగా రాజీవ్ ఉన్న రోజుల్లో అప్పటికే మంచి పేరు తెచ్చుకున్న అధికారిగా గుర్తింపు పొందిన శేషన్‌ను హోం శాఖలో భద్రతా సెక్రటరీగా నియమించారు. శేషన్ అక్కడ కూడా తన విధి నిర్వహణలో రాజీ పడేవాడు కాదు. ‘నేను పరీక్షలు చేయకుండా మీరు ఏ ఆహార పదార్థమూ ముట్టుకోవటానికే వీల్లేదు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేవారు. ఒకసారి రాజీవ్ గాంధీ అది మరిచిపోయి.. ఎక్కడో తిందామని నోట్లో పెట్టుకుంటున్న బిస్కెట్‌నూ శేషన్ లాగి పారేశారు.

ఒకసారి ఆగస్టు 15న ప్రధాని రాజీవ్ గాంధీ యువకులతో కలిసి.. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకూ రన్నింగ్ చేసే కార్యక్రమం పెట్టుకుని ట్రాక్ సూట్ కూడా వేసుకుని రెడీ అయ్యారు. కొద్ది దూరంలోనే టీఎన్ శేషన్ సూట్ వేసుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాజీవ్ చొరవగా ఆయన దగ్గరకు పోయి.. ‘ఏంటి సూటూబూటులో వచ్చారు. నాలాగా ట్రాక్ సూట్ వేసుకుని మాతో పరిగెత్తండి. కాస్త ఒళ్లు తగ్గుతుంది’ అని సరదాగా అన్నారు. దానికి శేషన్ తడుముకోకుండా.. ‘నా ప్రధాని జనంలో పడి పరిగెత్తాలంటే.. నాలాంటివాడు గట్టిగా నిలబడాలిగా’ అన్నారు. ఆయన మాటలోని మర్మం అర్థం కాని రాజీవ్ నవ్వుకుంటూ యువకులతో కలిసి పరుగుపెట్టటం ప్రారంభించాక.. రెండు నిమిషాలు కాగానే సెక్యూరిటీ సిబ్బంది ప్రధానిని చుట్టుముట్టి నాలుగడుగుల దూరంలో అప్పటికే స్టార్ట్ చేసిన ఓ కారులో ఎక్కించి నిమిషం వ్యవధిలో మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. ప్రధాని భద్రత దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు పనికిరావని శేషన్ ఇచ్చిన ఆదేశం వల్ల జరిగిన ఘటన ఇది. ఇలా శేషన్ నైజం, నిజాయితీ వల్ల రాజీవ్ గాంధీ ఆయనతో ఓ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండేవాడు.

మొత్తానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిని శేషన్ స్వీకరించారు. తొలిరోజు బాధ్యతలు తీసుకునేందుకు నిర్వాచన్ సదన్‌( భారత ఎన్నికల సంఘం కార్యాలయం)కు వెళ్లారు. వెళ్లగానే.. తనకంటే ముందు ఆ సీఈసీ పదవిలో ఉన్న పేరి శాస్త్రి ఆ గదిలో పెట్టుకున్న దేవుడు బొమ్మలు, దేవతల బొమ్మలున్న క్యాలండర్లు అన్నీ తీసి వేయించాడు. గొప్ప భక్తుడైన శేషన్ ఆఫీసులో వాటిని అనుమతించేది లేదని తొలరోజే తేల్చిచెప్పారు. అయితే.. అనుకోకుండా ఆ సమయంలోనే రాజీవ్ గాంధీ హత్య జరగటంతో లోక్‌సభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు శేషన్ ప్రకటించారు. అంతేకాదు.. అప్పట్లో ఎన్నికల సంఘం కార్యాలయం ఆఫీసు చిరునామాలో ‘ఎన్నికల కమిషన్, భారత ప్రభుత్వం’ అని ఉండటం చూసి చిరాకుపడిన శేషన్.. ఎన్నికల సంఘం అనేది ప్రభుత్వంలో కాదనీ, దాని చిరునామాలో భారత ప్రభుత్వం అనే మాటను తీసేయాలనీ ఆర్డరిచ్చారు.

సీఈసీగా రాకముందు నుంచే.. శేషన్ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని అభిప్రాయపడేవారు. శేషన్ క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నరోజుల్లో నాటి ప్రధాని ఆయనను పిలిచి.. ‘నేను ఫలానా రోజుల్లో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను. ఈ మాటే వెళ్లి ఎన్నికల కమిషన్‌కు చెప్పండి’ అన్నారు. దీనికి శేషన్ బదులిస్తూ.. ‘నేను అలా చెప్పటం కుదరదు. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉందని మాత్రమే నేను ఈసీకి చెప్పగలను’ అన్నారు.

1992 ప్రారంభం నుంచే శేషన్ విధుల్లో నిర్లక్షం వహించే పెద్ద పెద్ద అధికారులను టార్గెట్ చేశారు. వీరిలో కేంద్ర సెక్రటరీలు, రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూడా ఉన్నారు. ఆ సమయంలో శేషన్.. పట్టణ వికాస మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ధర్మరాజన్‌ను త్రిపురలో ఎన్నికల పర్యవేక్షకులుగా నియమించారు. కానీ.. ఆయన అగర్తలా వెళ్లడానికి బదులు ఒక ప్రభుత్వ పని మీద థాయ్‌లాండ్ వెళ్లిపోయారు. శేషన్ వెంటనే ‘ధర్మరాజన్ లాంటి అధికారులు ఈసీ కోసం పనిచేయదలచుకుంటే.. ఇలాంటి ప్రభుత్వ పనులు మానుకోవాలి.’ అని గట్టిగా హెచ్చరించారు. అంతేకాదు.. కాన్ఫిడెన్షియల్ రిపోర్టులో ఆయన రిమార్కుగా దీన్ని రాయించారు.

తర్వాతి రోజుల్లో ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రమైన సంస్థ అనీ, అది ప్రభుత్వాదేశాలను పట్టించుకోదని ప్రకటించారు. దీని విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకు దేశంలో ఏ ఎన్నికా జరగదని 1993 ఆగస్టు 2న శేషన్ 17 పేజీల ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో రాజ్యసభ ఎన్నికలు, అనేక అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే కేంద్రమంత్రిగా ఉంటూ రాజ్యసభ ఎంపీగా ఎన్నికవుతానని భావించిన ప్రణబ్ ముఖర్జీ.. దీంతో రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు.. శేషన్‌ను ‘పిచ్చి కుక్క’ అన్నారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ ‘ఇప్పటివరకూ పరిశ్రమల్లో లాక్-అవుట్ గురించి విన్నారు. కానీ శేషన్ ప్రజాస్వామ్యాన్నే లాక్-అవుట్ చేశారు” అన్నారు.

శేషన్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం.. జీవీజీ కృష్ణమూర్తి, ఎంఎస్ గిల్‌లను ఎన్నికల కమిషన్‌లో సభ్యులుగా నియమించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న శేషన్‌తో బాటు వీరిద్దరూ కలిస్తే.. ముగ్గురవుతారు గనుక ఇకపై తీసుకునే నిర్ణయాల్లో తాము నియమించిన ఇద్దరి మాటే చెల్లుబాటవుతుందని ప్రభుత్వం భావించింది. వారిద్దరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు శేషన్‌కు సహకరించకపోవటంతో ఆయన కూడా వారితోనే అలాగే వ్యవహరిస్తూనే సీఈసీగా తన ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేశారు.

శేషన్ దెబ్బ రుచి చూసిన వారిలో కశ్మీర్ నాటి అగ్రనేత షేక్ అబ్దుల్లా (ఫారుక్ అబ్దుల్లా తండ్రి) కూడా ఒకరు. 60వ దశకంలో నెహ్రూ ప్రభుత్వం.. అబ్దుల్లాను కొడైకెనాల్ ‘హోటల్ లాఫింగ్ వాటర్స్‌’లో గృహనిర్బంధంలో ఉంచింది. శేషన్ అప్పట్లో ఆ జిల్లా కలెక్టర్‌ హోదాలో అబ్దుల్లా రాసే ప్రతి లెటర్‌ను చదివి పంపాల్సి వచ్చేది. ఇది నచ్చని అబ్దుల్లా ఒకరోజు రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కి లేఖ రాసి.. దాని మీది అడ్రస్ చూపిస్తూ.. ‘ఏం కలెక్టరు గారూ.. దీన్ని కూడా చింపి చదువుతారా?’ అనగా.. ‘ఏం.. డౌటా?’ అంటూ శేషన్ అక్కడే దాన్ని చించి చదివారట. దీంతో మండిపడ్డ షేక్ అబ్దుల్లా ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని బెదిరించగా.. ‘సరే.. మీముందుకు ఎవరూ మంచినీళ్ల గ్లాసు కూడా తేకుండా చూసుకుంటాలే’ అనటంతో అబ్దుల్లా బెట్టువీడారట.

శేషన్ చెన్నై ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా ఉండగా.. ఒకసారి ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెచేశారు. ఆ సమయంలో వారు ఆయనతో ‘మీకు డ్రైవింగ్, ఇంజన్ గురించే తెలీదు. ఇక మా డ్రైవర్ల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు’ అన్నారట. దీంతో శేషన్ వారం రోజుల్లో తిరిగొచ్చి.. ఆ డ్రైవర్లను బస్సులో ఎక్కించుకుని 80 కి.మీ డ్రైవ్ చేసి వావ్ అనిపించారు. దేశంలోని నాయకులు అటు దేవుడికి, ఇటు శేషన్‌కి మాత్రమే భయపడతారని ఆ రోజుల్లో జోక్స్ చలామణిలోకి వచ్చాయి. ఒకసారి తనను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు అల్పాహారంలో మీరేం తీసుకుంటారు అని అడగ్గా.. శేషన్ నవ్వుతూ.. ‘ఐ ఈట్ పొలిటీషియన్స్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్’ అన్నారు.

కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టపడే శేషన్‌కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సేకరించే అలవాటుండేది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ కొని.. అవి ఎలా పనిచేస్తాయని తెలుసుకుని, వాటిని పక్కన పారేసేవారు. ఆయన దగ్గర 4 టీవీలు, ఇంట్లో టేబుళ్లపై, అల్మారాల్లో స్టీరియో రికార్డర్స్ పెట్టేవారు. చాలా ఫౌంటెన్ పెన్స్ కొని ఇంట్లో పెట్టి.. ఇంటికొచ్చిన పిల్లలకు వాటిని బహుమతిగా ఇచ్చేవారు. తాను మాత్రం బాల్‌ పెన్‌తో రాసుకునేవారు. ఇంటి అల్మారాల్లో అనేక విదేశీ వాచ్‌లు పడి ఉన్నా.. సాదాసీదా వాచ్ పెట్టుకు తిరిగేవారు.

1955 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన శేషన్ భారత ఎన్నికల సంఘానికి 10వ సీఈసీగా 1990 డిసెంబర్ 12న బాధ్యతలు స్వీకరించి, దేశంలోని ప్రతి ఓటరు నిర్భయంగా తనకు నచ్చే వారికి ఓటు వేసే వాతావరణాన్ని కల్పించారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా నేటికీ ఆయన పేరు తలచుకుంటారంటే ఆయన ఎంత సమర్ధవంతంగా సేవలందించారనేది అర్థమవుతుంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×