EPAPER

Thyagaraja Swamy : తెలుగు నాదయోగి.. త్యాగయ్య..!

Thyagaraja Swamy : తెలుగు నాదయోగి.. త్యాగయ్య..!
Thyagarajaswamy

Thyagaraja Swamy : లోకంలో ఎక్కడైనా దేవీదేవతలకు ఉత్సవాలు జరుగుతాయి. కానీ మనదేశంలో ఆ వైభవం కేవలం శ్రీ త్యాగరాజస్వామి వారికే దక్కింది. కావేరీ నదీ తీరాన తిరువయ్యారు వేదికగా స్వామివారు సిద్ధి పొందిన పుష్య బహుళ పంచమినాడు ఏటా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వీనుల విందుగా కన్నుల పండువగా జరుగుతాయి. నేటి (జనవరి 30) నుంచి ఈ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆ అరుదైన వాగ్గేయకారుని జీవితాన్ని స్మరించుకుందాం.


సమాధి వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో దేశం నలుమూలలకు చెందిన సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని, త్యాగరాజ కీర్తనలను గానం చేస్తారు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను బృందగానం చేస్తారు.

త్యాగయ్య తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరులో 1767 మే 4వ తేదీన జన్మించారు. అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మం. అందరూ త్యాగరాజుగా, త్యాగయ్యగా పిలుచేవారు. వీరి పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలంలోని కాకర్ల గ్రామవాసులు. బాల్యంలో సొంఠి వెంకటరమణయ్య వద్ద సరిగమలు నేర్చుకున్న త్యాగరాజు అనతి కాలంలోనే వాగ్గేయకారుడిగా ఎదిగారు.


తన శిష్యుడి ప్రతిభను గుర్తించిన గురువు వెంకట రమణయ్య గారు తంజావూరు రాజుకు వీరి గురించి సిఫారసు చేయగా, రాజు ఆయనను ఆహ్వానించి, విలువైన కానుకలను సమర్పించి, ఆస్థాన పదవి స్వీకరించాలని కోరగా, ‘నిధి సుఖమా… రాముని సన్నిధి సుఖమా…’ అంటూ ఆ సంపదను తిరస్కరించి, రాముని సన్నిధినే పెన్నిధిగా ఎన్నుకున్నారు.

త్యాగరాజస్వామి తన జీవితకాలంలో 24 వేలకు పైగా కీర్తనలను రచించి, స్వరపరచగా, వాటిలో నేడు కేవలం 700 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జీవిత చరమాంకంలో సన్యాసం స్వీకరించిన తన శేషజీవితాన్ని తిరువయ్యారులోని చిన్న ఇంటిలో ఉంటూ పలు కీర్తనలను రచించి, స్వరబద్ధం చేశారు. 1847 జనవరి 6న ఆయన ఇక్కడే జీవసమాధిని పొందారు.

నాటినుంచి ఆ ప్రదేశం కర్ణాటక సంగీతకారులందరికీ పుణ్యస్థలిగా మారింది. స్వామి స్వర్గవాసులైన ఏడాదికి ఆయన శిష్యులు ఈ సమాధి వద్ద సంగీత ఆరాధన చేశారు. 1921 వరకు 2 బృందాలు ఈ కచేరీలు నిర్వహించేవి. అయితే ప్రఖ్యాత నర్తకి, గాయని బెంగుళూరు నాగరత్నమ్మ ఇక్కడ త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి, అప్పటివరకూ స్త్రీలకు ప్రవేశం లేని ఆ ఆరాధనోత్సవాలలో స్త్రీలు కూడా పాల్గొనేలా చేసింది.

అంతేకాదు.. ఆమె స్వయంగా ఒక వేదికను నిర్మించి కచేరీలు నిర్వహించింది. తన శేషజీవితాన్ని అక్కడే గడుపుతూ తన ఆస్తిపాస్తులను త్యాగరాజ స్వామికే అంకితం చేసింది. 1940లో అందరూ కలిసి సమూహిక ఆరాధన చేసే ఏర్పాటు జరిగింది. నాటి నుంచి ఏటా ఆ తిథిని బట్టి 5 రోజుల పాటు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.

తమిళంలో ‘తిరు’ అంటే పవిత్ర, ‘ఐ’ అంటే ఐదు, ‘ఆరు’ అంటే నది అని అర్థం. ఐదు పవిత్ర నదుల మధ్య ఉన్న ఊరు కావడం వల్ల తిరువయ్యారుకు ఆ పేరు వచ్చింది. ఆ నదులు.. అరిసిలారు, వెన్నారు, వెట్టారు, కుడమురుత్తియారు, కావేరియారు. తంజావూరు నుంచి తిరువయ్యారు చేరుకోవాలంటే ఈ 5 నదుల మీది వంతెనలు దాటుకుని రావాలి. కానీ వాస్తవానికి ఇక్కడ ఆరునదులు ఉన్నాయని చెప్పాలి. సంగీతం ఆ ఆరోనది. త్యాగరాజస్వామి ఆ నదీపురుషుడు.

కొన్ని సంస్కృత కీర్తనలు తప్ప త్యాగరాజ స్వామి రచనా సాహిత్యం మొత్తం అచ్చ తెలుగులోనే ఉండటం తెలుగువారంతా గర్వించదగ్గ విషయం. ఆయన సృజించిన అత్యద్భుతమైన సాహితీ రససిద్ధికి తెలుగు భాష పరిపూర్ణంగా తోడైంది. అటువంటి పంచరత్నాలని పాడుకుని లేదా విని త్యాగయ్యని స్మరించుకోవడం ఎంతో గొప్ప పూర్వ పుణ్యం ఉంటే తప్ప సాధ్య పడదు.

Related News

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Big Stories

×