EPAPER

Budda Vengal Reddy : రాయలసీమ దానకర్ణుడికి.. విక్టోరియా మహారాణి బంగారు పతకం..!

Budda Vengal Reddy : రాయలసీమ దానకర్ణుడికి.. విక్టోరియా మహారాణి బంగారు పతకం..!
Budda Vengal Reddy

Budda Vengal Reddy : అది 1866వ సంవత్సరం. రాయల సీమలో భయంకరమైన కరువొచ్చింది. అనంతపురం మండలంలో ప్రారంభమైన ఈ కరువు క్రమంగా రాయలసీమను చుట్టబెట్టింది. చుక్క వాన లేక పొలాలు నెర్రెలివ్వగా, చెరువులన్నీ ఎండిపోయాయి. గుప్పెడు గ్రాసం లేక జనం పశువులను కబేళాలకు అమ్ముకున్నారు. పిల్లాపాపలను తీసుకుని జనమంతా తలోదిక్కు పట్టిపోయారు.


అది ధాత నామ సంవత్సరం కావటంతో దానికి ‘ధాత కరవు’ అనే పేరొచ్చింది. జనానికి గుప్పెడు తిండి దొరక్క డొక్కలు మాడిన కారణంగా దీనిని డొక్కల కరువు అని కూడా అన్నారు.

అప్పట్లో కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకా, కర్నూలు జిల్లాలోని కోవిలకుంట్ల తాలూకాలను కలిపి ‘రేనాడు’ అనేవారు. దీనికే ‘రెడ్డినాడు’ అని కూడా పేరు. ఈ ప్రాంతంలోని కోయిలకుంట్లకు చెందిన బుడ్డా వెంగళ రెడ్డి అనే భూస్వామి ఈ కరువుకు జనం అల్లాడిపోవటంతో చలించిపోయాడు. తన వద్ద ఉన్న 12 పాతర్ల ధాన్యాన్ని (1 పాతర అంటే.. 120 బస్తాలు) బయటికి తీసి దానిని జనం కోసం వెచ్చించాడు.


తన వద్ద ఉన్న ధాన్యం అయిపోవటంతో స్నేహితులు, బంధువుల ఇంట ఉన్న ధాన్యాన్ని తెప్పించి, గంజి కాయించి, పూటకు 8 వేల మంది కడుపు నింపారు. ఈ సంగతి తెలిసి బళ్లారి, చిత్తూరు, కర్నూలు నుంచి పేదలు వచ్చి వీరి గ్రామంలో పిల్లాపాపలతో ఆశ్రయం పొందారు. ఇలా 3 నెలల పాటు ఈ అన్నదాన యజ్ఞం సాగింది. తన పొలాలను అమ్మి.. కరువు కారణంగా అప్పుల పాలైన రైతుల బాకీలు తీర్చి, వారిని రుణవిముక్తులను చేశారు.

ఈయన సేవలను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం విక్టోరియా బంగారు పతకాన్ని ప్రకటించింది. ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగిన సన్మాన సభలో ఆయనకు ఈ పతకాన్ని ఇచ్చి గౌరవించారు.

‘Presented to Buddha Vengala Reddy as a token of the high appreciation of Her Majesty’s Government of his munificent Liberality to his destitute countrymen in the famine of 1866’ ((1866 కరువు సమయంలో తన ఉదారగుణంతో, మహోన్నతమైన ఆశయంలో తన ప్రాంత ప్రజలను కాపాడుకున్న బుడ్డా వెంగళరెడ్డికి గౌరవనీయులైన విక్టోరియా మహారాణి వారి కానుక) అని రాసి ఉన్న పతకాన్ని ఆయనకు ప్రదానం చేశారు.

ఇది ఉయ్యలవాడలో వారి వంశస్థుల దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉంది. ఆచార్య తంగిరాల సుబ్బారావు విక్టోరియా రాణి పతకాన్ని తాను చూసినట్లు 17-4-1966న నమోదు చేశారు. మేలిమి బంగారంతో చేసిన 20 తులాల ఆ పతకం వడ్డాణం మాదిరి ఉంటుంది. లండన్‌లో తయారైన ఈ పతకంపై మన పూర్ణకుంభపు రూపం, మన రాజుల రాజముద్రలు చెక్కి ఉంటాయి.

అనంతర కాలంలో ఈయనను మద్రాసు బ్రిటిష్ ప్రభుత్వం…ప్రొవిన్సియల్ జ్యూరీ సభ్యునిగానూ, మద్రాసు గవర్నరు కౌన్సిల్ యొక్క గౌరవ సభ్యునిగానూ చేసి ఎంపికచేసి గౌరవించింది.

ఆ కాలంలో పగలూ రేయి అనే తేడా లేకుండా పనిచేసిన తన వంటమనిషి గంగన్న చేసిన సేవలకు మెచ్చిన రెడ్డిగారు.. ఆయనకు ఒక బంగారు కడియాన్ని బహూకరించటంతో బాటు స్వగ్రామంలో స్కూలు పెట్టి వందలమందికి విద్యాదానం చేశారు. ఏటా శివరాత్రి నాడు స్వగ్రామంలోని అగస్తేశ్వర దేవాలయంలో ఉత్సవాలు జరిపి, పండితులను సత్కరించి, అన్నదానాలు చేసేవారు.

మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి గారు డిసెంబరు 31, 1900 తేదీన శివసాయుజ్యాన్ని పొందారు. నేటికీ అక్కడి జానపదులు, కళాకారులు తమ ఆటపాటల్లో ఆ మహాదాతను గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

‘శతేషు జాయతేశూర సహస్రేషుచ పండితా.. వక్తా శత సహస్రేషు, దాతా భవతి వానవా’ (వందలమందిలో ఒక వీరుడు, వేల మందిలో ఓ పండితుడు, లక్షల మందిలో ఓ మంచి వక్త ఉంటారు గానీ.. లక్షలమందిలోనూ ఒక దాత ఉంటాడని చెప్పలేము) అంటారు. కానీ.. బుడ్డా వెంగళరెడ్డి కొన్ని లక్షలమందిలో ఒకడిగా నిలిచిన మహాదాతగా నేటికీ జనం మనసుల్లో నిలిచిపోయారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×