EPAPER

Telangana: కుండపోతతో తెలంగాణ తల్లి గుండెకోత ..!

Telangana: కుండపోతతో తెలంగాణ తల్లి గుండెకోత ..!

Telangana Floods: రాష్ట్రంలో ఊహించిన రీతిలో కురిసిన భారీ వర్షాలు మునుపెన్నడూ లేనంత నష్టాన్ని మిగిల్చాయి. గత ఆరు దశాబ్దాల్లో చూడని జలప్రళయానికి, ప్రకృతి దాడికి తెలంగాణ అల్లాడి పోయింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలోని అనేక ప్రాంతాలు విలవిలలాడాయి. అటవీ ప్రాంతం, మైదాన ప్రాంతం అనే బేధం లేకుండా 4 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వానలకు ఆయా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ధాటికి తెలంగాణలోని పలు జిల్లాలకు పొరుగు రాష్ట్రాలతో, సరిహద్దు జిల్లాలతో అనుసంధానమై ఉన్న రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. వరద ధాటికి ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లోని రైతన్నల పాడిపంట, గూడు, నీడ చెల్లాచెదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరదలు 26 మందిని బలి తీసుకోగా, వందలాది మూగజీవాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో బురద, ఇసుకమేట వేసింది. ఈ విపత్తు కారణంగా సుమారు రూ. 6000 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనావేశారు. అన్ని వివరాలతో కూడిన నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్రానికి పంపారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, వరద బీభత్సాన్ని పరిశీలించేందుకు ప్రధాని రావాలని సీఎం కోరారు. తక్షణ సాయం కింద రూ. 2000 కోట్లు ఇచ్చి తెలంగాణను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.


గత పాలకుల నిర్లక్ష్యం, ముందుచూపు లేనితనం, మితిమీరిన కబ్జాలతో ఖమ్మం పట్టణంలో మెజార్టీ ప్రాంతం ముంపుకు గురైంది. అనేక కాలనీల ప్రజలకు కట్టుబట్టలూ మిగల్లేదు. ఇంతటి విషాదానికి కబ్జాలే కారణమని స్థానికులు వాపోతున్నారు. ఖమ్మం మంపునకు రెండు ప్రధాన కారణాలున్నాయి. బల్లేపల్లి నుంచి న్యూ విజన్ స్కూల్ మీదుగా లకారం చెరువు అలుగు నుండి వరద నీరు దిగువకు వెళ్లాల్సి ఉండగా, లకారం చెరువు సుందరీకరణ పేరుతో ఎగువ నుంచి వచ్చే నీరు చెరువులోకి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. దీంతో ఆ నీరు వెనక్కి తన్ని కవిరాజ్ నగర్ కాలనీలు, పాత కలెక్టర్ ఆఫీస్ వెనక ఉన్న ప్రాంతాలు, చెరువు బజార్, చైతన్య నగర్, మైసమ్మగుడి ప్రాంతాలు మునిగిపోయాయి. ఒకనాడు 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న లకారం చెరువు నేడు కబ్జాలతో 40 ఎకరాలకు కుదించుకు పోవటాన్ని బట్టి ఏ స్ధాయిలో కబ్జాలు జరిగాయో అర్థమవుతోంది. ఇంతే కాకుండా లకారం చెరువు వద్ద మూడు కోట్లతో డ్రైనేజ్ నిర్మాణాలు ముందు చూపు లేకుండా నిర్మించడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. రెండో కారణం.. మున్నేరుపై రెండేళ్ల నాడు ప్రకాశ్ నగర్ వద్ద మరీ ఎత్తుగా బ్రిడ్జి నిర్మించటంతో వరద నీరు వెనక్కి వచ్చి.. బ్రిడ్జికి రెండు వైపులా వరదనీరు పెద్ద ఎత్తున వెనక్కు వచ్చింది. చెక్ డాం ఎత్తు తగ్గించాలని ప్రజలు వేడుకున్నా కూడా గత పాలకులు పట్టించుకోలేదు. పాలకుల తప్పిదానికి ఖమ్మం ప్రజలు తీవ్ర ఆవేదనకు గురికావాల్సి వచ్చింది.

ఎవరూ ఊహించని రీతిలో గత శనివారం అర్ధరాత్రి మానుకోటను వరద చుట్టుముట్టింది. తెల్లారేసరికి అది విశ్వరూపం చూపించింది. వాగులు ఏవీ లేని మహబూబాబాద్‌ పట్టణం జలదిగ్బంధం కావడానికి చెరువుల ప్రవాహమే కారణంగా కనిపిస్తోంది. పట్టణంలోని తొమ్మిది చెరువులు ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయికి మించి వరద పోటెత్తడంతో ఆ వరద నీటితో బస్తీలు నీటమునిగాయి. పట్టణం ఎగువన ఉన్న ఈదుల పూసపల్లి వద్ద ఉన్న రాళ్లవాగు ఉప్పొంగింది. పెద్ద చెరువు కట్ట తెగడంతో పట్టణంలోకి నీరు వచ్చింది. దీనికి తోడు ఏకధాటిగా కురిసిన వర్షంతో వరద ఎక్కడికీ వెళ్లలేక ఆవాసాల్లోకి చేరింది. అటు.. భారీ వర్షాల ధాటికి కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నీట మునగగా, కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలో దాదాపు 12 వేల ఎకరాల్లో పంటలకు నష్టం కలిగింది. అలాగే, అకాల వర్షాలతో మంచిర్యాల జిల్లావ్యాప్తంగా దాదాపు 805 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా వరద కారణంగా నీటి మునిగిన ప్రాంతాల్లో నేతలు, అధికారులు తక్షణం రంగంలోకి దిగి.. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం, మహబూబాబాద్, ములుగు ప్రాంతాల్లో నలుగురు మంత్రులు వారి అనుభవాన్ని రంగరించి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడం వల్ల భారీ ప్రాణనష్టాన్ని నివారించగలిగారు. జలవిలయానికి ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. మృతులకు 5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది,అన్నదాతలకు ఎకరాకు నష్ట పరిహారం చెల్లించేందుకు రేవంత్ ప్రభుత్వం అండగా నిలిచింది.


Also Read: AP Capital Amaravati: వరదల్లో మునిగిపోయిన అమరావతి.. ఇంకేం రాజధాని ?

మరోవైపు.. ఈ విపత్తు టైంలో జనానికి భరోసా కల్పించాల్సిన విపక్ష పార్టీలు తమ రాజకీయ ఉనికి కోసం దీనిని ఒక అవకాశంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా నేడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. పరిధి దాటి ప్రభుత్వం మీద విమర్శలకు దిగటాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. 2020లో గ్రేటర్ హైదరాబాద్ అతులాకుతలమైన వేళ.. అప్పట్లో అన్నీ తానై నడిపించిన కేటీఆర్‌కు ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయిన సంగతి గుర్తులేదా? 2022లో గోదావరి వరదలు వచ్చినప్పుడు ‘క్లౌడ్ బరస్ట్’ వల్లే వరదలు వచ్చాయని కేసీఆర్ ఆ ప్రస్తావనను మీడియా సమావేశంలో దాటవేయలేదా? 2023లో వరంగల్ పట్టణం 42 కాలనీల్లో ముంచెత్తిన వరద కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదా? ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకృతి కన్నెర్రజేస్తే ఒక పరిధికి మించి చేసేదేముండదని తెలిసీ, ఇలాంటి విపత్తు సమయంలో విపక్షాలు రాజకీయం చేయటం తగని పని. ఇకపై.. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను రంగంలోకి దించి కబ్జాలను తొలగించటంతో బాటు వరదల వంటి వైపరీత్యాలు భవిష్యత్తులో సంభవిస్తే.. వెంటనే ఆదుకునేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయించుకోవటం మీద ప్రభుత్వం దృష్టిసారించాలి. నష్టం అంచనాలో పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. చివరగా.. ఈ వరదల ధాటికి సర్వం కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం అందించి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకు వారికి పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి. వరద తర్వాత వచ్చే అంటురోగాలు, విషజ్యరాల బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వనరుల పరిరక్షణ చేస్తూనే తీరప్రాంతాలలో భవిష్యత్తులో వరదలు వచ్చినా.. వాటి మూలంగా కలిగే నష్టాన్ని వీలున్నంత తగ్గించేందుకు అవసరమైన కార్యాచరణ, వ్యవస్థల నిర్మాణంపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.

డా. సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×