EPAPER
Kirrak Couples Episode 1

Subrata Roy : పడిలేచిన కెరటం.. రాయ్..!

Subrata Roy : పడిలేచిన కెరటం.. రాయ్..!

Subrata Roy : సహారా గ్రూప్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ సుబ్రతారాయ్‌(75) మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మెటాస్టాటిక్ కేన్సర్, హై బీపీ, డయాబెటీస్‌ వంటి వ్యాధులతో బాధపడుతూ పెరోల్ మీద బయటికొచ్చి చికిత్స పొందుతున్న రాయ్ మరణంతో.. ఆయన సంస్థ సెబీ వద్ద డిపాజిట్ చేసి, డిపాజిటర్లకు పంపిణీచేయని రూ. 25వేల కోట్ల మొత్తంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


పడిలేచిన రాయ్..
సుబ్రతారాయ్.. 1948, జూన్ 10న బీహార్‌లోని అరారియాలో(నేటి బంగ్లాదేశ్) సంపన్న హిందూ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. గోరఖ్‌పూర్‌లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూ‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. భార్య స్వప్నా రాయ్. ఆయనకు ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్.

కేవలం రూ. 2 వేల మూలధనంతో, స్నేహితుల నుంచి అప్పుగా తీసుకున్న మొత్తంతో సహారా ఫైనాన్స్‌ అనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిట్‌ఫండ్ సంస్థను 1976లో కొనుగోలు చేశారు.


ఊరూరూ తిరుగుతూ, పటిష్టమైన మార్కెట్ వ్యూహాలతో సాగిపోయారు. దేశ వ్యాప్తంగా ఏజెంట్లు ఏర్పడటం, జనం వరుసలో నిలబడి నెలవారీగా సహారా చిట్స్‌లో కిస్తీలు కట్టటం మొదలుపెట్టారు.

1978 నాటికి ఇది సహారా పరివార్‌గా మారింది. క్రమంగా ఈ సంస్థ ఫైనాన్స్, స్థిరాస్తి, మీడియా, ఆతిథ్య రంగాల్లో అడుగుపెట్టి అద్భుత విజయాలను అందుకుంది.

1992లో రాష్ట్రీయ సహారా పేరుతో ఓ వార్తా పత్రికను, సహారా టీవీ ఛానల్‌ కూడా మొదలయ్యాయి. కొన్నాళ్లకు ఆ టీవీ ఛానెల్.. సహారా వన్‌గా మారింది.

2000 నాటికి సహరా ఇండియా పరివార్‌లో 12 లక్షల ఉద్యోగులుండేవారు.

2010 నాటికి లండన్‌లోని గ్రోస్‌వెనర్ హౌస్ హోటల్‌ను, 2012లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌ను కొనుగోలు, భారత క్రికెట్ టీం స్పాన్సరర్‌గా ఇంటర్నేషనల్‌గా వార్తల్లో నిలిచారు.

మైలురాళ్లు..
2012లో అత్యంత ప్రతిభావంతులైన తొలి పదిమంది భారతీయ వ్యాపారవేత్తల్లో ఒకడని..ఇండియా టుడే పత్రిక కొనియాడింది.

2004లో, సహారా గ్రూపు.. భారతీయ రైల్వేల తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ఎంప్లాయర్ అని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది

9 కోట్ల మంది దేశీయ ఇన్వెస్టర్లతో సహారా కొత్త రికార్డును సృష్టించింది. ఒకదశలో ప్రతి 100 భారతీయ కుటుంబాల్లో 13 కుటుంబాల వారు సహారా పరివార్‌లో చేరారు.

సేవలోనూ ముందే..
2013 నాటి ఉత్తరాఖండ్‌ వరదల వేళ.. సహారా గ్రూపు వేగంగా స్పందించి ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం అందించింది. 10,000 ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చింది.
కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరవీరుల్లో 127 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారని నాటి ప్రధాని వాజ్‌పేయి.. సహారా గ్రూపును ప్రశంసించారు.

తిరోగమనం
2011లో సహారా గ్రూపులోని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు కొన్ని స్కీంలతో నిబంధనలను అతిక్రమించాయని సెబీ ఆరోపించింది.

ఈ రెండు సంస్థలు బాండ్ల ద్వారా సుమారు 3 కోట్ల మంది నుంచి సేకరించిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని పేర్కొంది.

అయితే సెబీ ఆరోపణలు వ్యతిరేకిస్తూ.. ఆయన కోర్టుకెక్కారు. కానీ..2012లో సుప్రీంకోర్టు కూడా సెబీని సమర్థించటంతో సుబ్రాతాకు చిక్కులు మొదలయ్యాయి.

సహారాకు చెందిన 95 శాతానికి పైగా పెట్టుబడిదారులకు గ్రూపు ఆ మొత్తాన్ని రిఫండ్ చేసింది. మిగిలిన 5 శాతం డిపాజిటర్ల ఆధారాలు దొరక్క ఆ పేమెంట్ ఆగిపోయింది.

అయినా.. సెబీ అంతటితో వదిలిపెట్టలేదు. సహారా గ్రూపులోని ఇన్వెస్టర్ల భద్రత కోసం రూ. 24 వేల కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయగా.. సహారా గ్రూపు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసింది.

కానీ… పాత కస్టమర్ల వివరాలు లేని కారణంగా క్లెయించేయని కారణంగా 2022 -23లో సెబీ కేవలం రూ. 7 లక్షలు మాత్రమే రీఫండ్ చేయగలిగింది.

SEBI తాజా నివేదక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి దాదాపు రూ. 25,163 కోట్లు డిపాజిట్ అయ్యాయి.

ఇదీ పరిష్కారం..
మరోవైపు సహారా గ్రూపునకు చెందిన 4 సహకార సంఘాల్లో స్తంభింపజేసిన డిపాజిటర్ల రూ.5,000 కోట్ల సొమ్మును వాపసు చేసే ప్రక్రియను గత ఆగస్టులో కేంద్రం ప్రారంభించింది.

కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గత జూలైలో ‘CRSC- సహారా రీఫండ్ పోర్టల్’ను ప్రారంభించటంతో 18 లక్షల మంది డిపాజిటర్లు తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.

ఈ రీఫండ్ యథావిధిగా జరుగుతుందని, సుబ్రతారాయ్ మృతితో ఈ డిపాజిటర్లకు చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

ముగింపు…
తాను చేసే వ్యాపారానికి అండగా.. తగినన్ని స్థిరాస్తులున్నాయనీ, చివరి కస్టమర్ చివరి పైసానూ చెల్లించగలనని సుబ్రతా రాయ్ చివరి వరకు కోర్టుల్లో పదేపదే స్పష్టం చేశారు. సెబీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఆయా మొత్తాలనూ డిపాజిట్ కూడా చేశారు. మరో విచిత్రమైన అంశం ఏమిటంటే.. ఇంత పోరాటం చేస్తున్న రాయ్‌కు.. వర్తమాన భారతీయ కార్పొరేట్లు ఎవరూ చేయందించకపోవటం విషాదం. న్యాయస్థానాల్లో ఆయన వేదన.. చివరి వరకు అరణ్యరోదనే అయింది.

ఉత్సాహవంతుడైన వ్యాపారవేత్తగా సుమారు కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పించిన రాయ్.. తన మీద వచ్చిన ఆరోపణలను అత్యంత సహనంతో భరించి, న్యాయపోరాటం చేశారే.. తప్ప ఏ రోజూ ఏ వ్యవస్థనూ చివరి రోజు వరకు నోరెత్తి నిందించలేదు. మౌనంగా వ్యాపారంలోకి వచ్చిన రాయ్.. ఎవరూ ఊహించలేని విజయాలను సొంతం చేసుకుని అంతే మౌనంగా, హుందాగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×