EPAPER

Defence: ఉగ్రమూకల ‘స్మార్ట్’ వ్యూహాలు..!

Defence: ఉగ్రమూకల ‘స్మార్ట్’ వ్యూహాలు..!

India: నేడు ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. భారత్‌తో సహా అనేక దేశాలు దీని కారణంగా సతమతమవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన పాక్‌ ప్రేరేపిత కశ్మీర్‌ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతున్నది. రోజు విడిచి రోజు అన్నట్టుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భద్రతాదళ జవాన్లు తరచుగా ఈ దాడుల్లో అమరులవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. సాయుధ బలగాలే కాకుండా సామాన్య పౌరులనూ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 990-2000 సంధికాలంలో కశ్మీర్‌లో టెర్రరిజం పెట్రేగిపోయిన సంగతి తెలిసిందే. 2003లో ఆపరేషన్‌ సర్ప వినాశ్‌తో దాన్ని అణచివేశారు. దాదాపుగా అణగిపోయిందనుకున్న ఉగ్రవాదం మళ్లీ ఇటీవలి కాలంలో ఎలా, ఎందుకు విజృంభిస్తున్నదనే ప్రశ్న దేశ ప్రజలను వేధిస్తున్నది. అయితే, సైన్యంతో పోటీపడి మరీ.. ఉగ్రవాదులు టెక్నాలజీని వాడుకోవటంతో ఆరితేరటమే ఈ ఊహించిన దాడులకు కారణమని తెలుస్తోంది.


మరోవైపు, కాలంతో బాటు ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాలను మార్చుకుంటూ మరింత పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే వారు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటూ స్మార్ట్‌గా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌, సిరియా (ఐసిస్‌) తన కార్యకలాపాల విస్తరణకు సామాజిక మాధ్యమాలను ఎలా దుర్వినియోగం చేసిందో మనం చూశాం. శ్రీలంక ఈస్టర్‌ బాంబుపేలుళ్లలో కీలక సూత్రధారి జహ్రాన్‌ హషీం సామాజిక మాధ్యమాల ద్వారానే యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించాడు. గతంలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన కశ్మీర్‌ ఉగ్రవాది బుర్హన్‌వాని సామాజిక మాధ్యమాల ద్వారానే యువతను హింసామార్గంలోకి ఆహ్వానించాడనే సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలను ఐసిస్ వాడటం మొదలు పెట్టిన అనతి కాలంలోనే సంస్థ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇప్పుడిప్పుడే టెక్నాలజీ వైపు అడగులు వేస్తున్న మారుమూల దేశాల నుంచి ఐసిస్ సోషల్ మీడియా సందేశాలను పంపుతూ, వాటిని రీట్వీట్‌, షేరింగ్‌ చేస్తూ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. పలు కారణాలతో ఈ సంస్థ వలలో పడి సిరియా చేరి అక్కడి పోరాటంలో వేల సంఖ్యలో విదేశీ యువత ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, బ్రిటన్‌లో పాక్‌ ప్రేరిత ఉగ్రవాద మూకలు, ఖలిస్థాన్‌ అనుకూల గ్రూపులు భారత వ్యతిరేక పోరుకు వ్యూహాలు రచిస్తున్నాయని, బ్రిటన్ కౌంటర్‌ టెర్రరిజం సంస్థ ‘ప్రివెంట్‌’ పదేపదే ఢిల్లీకి హెచ్చరికలు జారీ చేస్తోంది. కశ్మీరు విషయంలో బ్రిటిష్‌ ముస్లింలను ఉగ్రవాద సానుభూతిపరులుగా మార్చేందుకు బ్రిటన్ కేంద్రంగా కుట్ర జరుగుతుండగా, కెనడాలో ఇది ఏకంగా ఉద్యమం స్థాయికి చేరింది. కెనడాలో ఈ పోరుకు అక్కడి ప్రభుత్వ పరోక్ష మద్దతూ లభిస్తోంది.

ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు భారత్ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. 2022 అక్టోబరులో ఢిల్లీలో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక చర్యల కమిటీతో భారత ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా, వీడియో గేమ్స్‌, గేమింట్‌ ప్లాట్‌ఫామ్‌లను వాడుకుంటూ, ఉగ్రవాద భావజాల విస్తరణకు, రిక్రూట్‌మెంట్లకు తెగబడటం, సరికొత్త, అభివృద్ధిపరిచిన సాంకేతికతల వినియోగం ఉగ్రవాద సంస్థల్లో పెరగడంపై ఆ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక స్థావరాలు, సరిహద్దులపై నిఘాకు డ్రోన్లను, నిధుల సమీకరణకు డిజిటల్‌ పద్ధతులను వాడే స్థాయికి చేరిపోయారని ఈ సందర్భంగా నిర్ధారించింది. అధునాతనమైన సాంకేతిక, పోరాట పద్ధతుల్లో ఉగ్రవాద సంస్థలను అదుపు చేయాలని పిలుపునిచ్చింది. గత వారంలో ఢిల్లీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాన్ని చర్చించారు. ఉగ్రవాదాన్ని సమగ్రంగా, స్థిరమైన పద్ధతిలో ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఈ భేటీలో ఇరు దేశాలు నిర్ణయించాయి. దేశీయ, ప్రాంతీయ, ప్రపంచ ఉగ్రవాద ముప్పు అంచనాపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకోవటమే గాక ఇంటర్నెట్ దుర్వినియోగం, రాడికలైజేషన్, టెర్రర్ ఫైనాన్సింగ్, వ్యవస్థీకృత నేరాలు, ఇతర ఉగ్ర వ్యూహాల కట్టడికి కలిసి పోరాడాలని ఒక ఒప్పందానికి వచ్చాయి.


Also Read: Group-1 Mains Exam: గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు

మరోవైపు, సామాజిక మాధ్యమాలూ ఈ సవాలుకు తమదైన శైలిలో పరిష్కారాలతో ముందుకు వచ్చి ఒక సంయుక్త కార్యాచరణను ప్రకటించి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ సంస్థలు సంయుక్తంగా ‘ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ అంతర్జాల వేదిక’ (గ్లోబల్‌ ఇంటర్నెట్‌ ఫోరం టు కౌంటర్‌ టెర్రరిజం- జీఐఎఫ్‌సీటీ)ని నెలకొల్పాయి. ఇది పౌరసమాజంతో ‘ఆన్‌లైన్‌’ చర్చావేదికలు, ఉగ్రవాదుల కార్యకలాపాలను ముందుగానే తెలుసుకొని ఆన్‌లైన్‌లో హెచ్చరికలు చేయడం, వీలైనంత ఎక్కువమంది నెటిజన్లను ఉగ్రవాద వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేట్లు చేయడం అనే నాలుగు ప్రధాన అంశాలను ప్రాదిపదికగా తీసుకుని పనిచేస్తోంది. దీంతో ఉగ్రవాద సంస్థలు పోస్టు చేసే హింసాత్మక చర్యల సమాచారం, చిత్రాలు, వీడియోలను ప్రసారం చేయకుండా అడ్డుకట్ట వేయటం కొంత మేర సాధ్యమవుతోంది. ఈ వేదిక ఐక్యరాజ్య సమితి.. భద్రతామండలిలోని ఉగ్రవాద వ్యతిరేక విభాగంతో కలిసి పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్‌ కంపెనీలను ఈ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలోకి తీసుకొచ్చే దిశగానూ ఈ వేదిక కృషిచేస్తోంది. దీనికి అమెజాన్‌, లింక్డ్‌ఇన్‌, వాట్సాప్‌… తదితర సంస్థలూ చేయూతనిస్తున్నాయి. ‘హేష్‌ట్యాగ్‌’లపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయటంలో ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుండటంతో.. ఉగ్రసంస్థల కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

సంయుక్త నూతన ఆవిష్కరణలు, సమాచారాన్ని పంచుకోవడం, పరిశోధనలు చేసి, వాటి ఫలితాలను భాగస్వామ్య సంస్థలకు బదిలీ చేయటం, వీడియోలు, చిత్రాలు అభ్యంతకరంగా ఉంటే వెంటనే నిరోధించే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ద్వారా ఇంటర్‌నెట్‌లో ఉగ్రవాద వ్యాప్తిని నిరోధించేందుకు జీఐఎఫ్‌సీటీ కృషి చేస్తోంది. అలాగే ఉగ్ర గ్రూపుల సమాచారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ కాకముందే నిరోధించేందుకు వీలుగా ఒక డేటాబేస్‌నూ రూపొందించింది. గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసేవారు. కాగా, జీఐఎఫ్‌సీటీ తయారుచేసిన పలు సాఫ్ట్‌వేర్‌లతో అనుచిత ఉగ్రవాద సమాచార బదిలీని ముందుగానే పసిగట్టి అడ్డుకోవడం సాధ్యమవుతోంది. మరోవైపు.. గ్లోబల్‌ టెర్రర్‌ డేటాబేస్‌(జీటీడీ) గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులను పరిశీలించినట్లయితే ఎక్కువ దాడులు జరిగిన ప్రాంతాల్లో దక్షిణాసియా రెండో స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి, ఇంటర్‌ పోల్, సీఐఏ, ఎఫ్‌బీఐ, రా లాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ తీవ్రవాద మూలాలు ఇప్పటికీ దేశంలో ఎందుకు నిర్వీర్యం కావడం లేదో పాలకులు సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. ఇరాన్ – ఇజ్రాయెల్ ఘర్షణ ముదురుతున్న వేళ, అతిపెద్ద జనాభా గల ప్రజాస్వామ్య దేశంగా భారత్ స్మార్ట్ మార్గాల ద్వారా యువతను ఆకర్షిస్తున్న ఉగ్ర ముఠాల పీచమణిచేందుకు అత్యాధునిక వ్యవస్థలను నిర్మించుకోవటం మీదా ప్రభుత్వం దృష్టి సారించాలి.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×