EPAPER
Kirrak Couples Episode 1

Story Behind Rasgulla : రసగుల్లా చరిత్ర తెలుసా?

Story Behind Rasgulla : రసగుల్లా చరిత్ర తెలుసా?
Story Behind Rasgulla

Story Behind Rasgulla : మనదేశంలోకి యూరోపియన్లు రావటం మొదలయ్యాక.. వారి ప్రభావం ఎక్కువగా పడిన ప్రాంతాల్లో బెంగాల్ ఒకటి. ఒకప్పుడు కలకత్తా దేశ రాజధాని కావటం దీనికి గల ఒక కారణం కాగా.. బెంగాల్ తీరప్రాంతం గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉండటం దీనికి గల మరోకారణం.


క్రీ.శ.1650 నాటికి ఒక్క హుగ్లీ రేవు సమీపంలో 20 వేల పోర్చుగీసు కుటుంబాలు నివాసం ఉండేవి. మిఠాయిల తయారీలో ప్రపంచంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన పోర్చుగీసుల ఇళ్లలో స్థానిక బెంగాలీలు పనికి కుదిరారు. ఈ క్రమంలో పోర్చుగీసు దొరసానులు చేసే పలు మిఠాయీల తయారీ కూడా నేర్చేసుకున్నారు. దానికి తమ స్థానిక బెంగాలీ ఫ్లేవర్లు జోడించి బెల్లం, తేనె, పంచదార, పాలవిరుగుడుతో కొత్త స్వీట్లు చేసేవారు.

పోర్చుగీసు వారి నుంచి మన తెలుగువారు పొగాకు, మిరపకాయలు, బత్తాయిలు, బొప్పాయిలను స్వంతం చేసుకోగా.. బెంగాల్ వాసులు మాత్రం మరో అడుగు ముందుకేసి.. వారి మిఠాయిల తయారీ గుట్టుమట్లను రాబట్టి.. నేడు ప్రపంచమంతా వ్యాపారం చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. నాటి బెంగాలీల చొరవ వల్ల పోర్చుగీసుల వంటింటి నుంచి మనకు చేరినదే.. మనం ఎంతో ఇష్టంగా తినే.. రసగుల్లా.


1868లో నోబిన్ చంద్రదాస్ అనే 22 ఏళ్ళ కుర్రాడు కలకత్తాకు రసగుల్లాలను పరిచయం చేసి.. ‘రసగుల్లా పిత’గా రికార్డుకెక్కాడు. ఆపై.. అతని కుమారుడు కృష్ణ చంద్రదాస్ ‘రసమలై’ని తయారుచేయటంతో బాటు కె.సి.దాస్ అండ్ కంపెనీ పేరుతో స్వీట్ల తయారీ మొదలుపెట్టి.. మోయిరా, ఖీర్ మోహన, చమ్ చ్‌మ్, గులాబ్‌జామ్, వౌచక్, సీతాభోగ్, లాల్‌మోహన్, తోటాపూరి లాంటి స్వీట్లను తయారు చేసి వాటికి బెంగాలీ స్వీట్లుగా పాపులర్ చేశాడు.

కేసీ దాస్.. ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ భార్య పేరుతో ‘లేడీ కానింగ్’ అనే స్వీట్ తయారుచేశారు. జనం నోరు తిరగక.. దీనిని ‘లేడీకేనీ’ అనేవారు. నేటికీ దాని పేరు అలాగే ఉంది. ఇక.. శనగపిండితో నూనెలో చక్రాలు వండి.. వాటిని బెల్లం పాకంలో ముంచి.. దానిని చనా జిలిపి అనే పేరు పెట్టిందీ ఈయనే. ఇదే.. కొన్నాళ్లకు జిలేబీ అయింది.

ఇక.. మన రసగుల్లా సంగతి కొస్తే.. మన దేశంలో తయారైన, పంచదార పాకంలో తేలే తొలి స్వీట్ రసగుల్లాగా ఆహార చరిత్రకారులు నమోదుచేశారు. తొలినాళ్లలో దీనిని జనం రసగోళకం అనేవారట. అదే కాలక్రమంలో రసగోళ్ళ, రొసోగోల, రోషోగోల్ల పేర్లతో దేశమంతా వ్యాపించింది. 600 ఏళ్ళ నాటి పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా.. లక్ష్మీదేవి ప్రసాదంగా ఇది ప్రసాదాల జాబితాలో చేరిపోయింది. అప్పట్లో దీనిని ‘ఖీరామోహన’ అని పిలిచారు.

కటక్ దగ్గర సాలేపూర్ పట్టణంలో బికలానంద కార్ సోదరులు ఈ ‘ఖీరామోహన’ తయారీలో నిష్ణాతులని ఒరియా ఆహార చరిత్ర చెప్తోంది. తొలినాళ్లలో తియ్యని శనగపిండి ఉండల మధ్యలో జీడిపప్పు పెట్టి వీటిని తయారు చేసేవారు. క్రమేణా వాటిని పంచదార పాకంలో వేయటం మొదలైంది. అందుకనే, దీన్ని ‘బికలీకార్ రసగుల్లా’ అంటారు. 1850 ప్రాంతాల్లో ఈ మిఠాయిని ‘హర్ ధాన్ మోయిరా’ అనే వ్యాపారి తీసుకు వెళ్ళి బెంగాల్‌కి పరిచయం చేశాడు. దాన్ని నోబిన్ చంద్రదాస్ మెరుగుపరిచి పాల విరుగుడుతో తయారుచేయటం ప్రారంభించాడు. అదే ఈనాటి ప్రసిద్ధ రసగుల్లా అయ్యింది.

విరిగిన పాలను ఒక మంచిగుడ్డలో లేదా సంచీలో వడగట్టి ద్రవాన్నంతా పిండేస్తారు. దాన్ని చన్నీళ్ళతో కడిగితే తెల్లని పాలగుజ్జు మిగులుతుంది. దానిలో తీపి కలిపి, ప్రత్యేకమైన మిషన్లమీద సన్నని బంతులుగా చేస్తారు. పలుచని పంచదార పాకంలో ఈ ఉండల్ని నిలవబెడతారు. ఇదే సంక్షిప్తంగా రసగుల్లా కథ. పంచదార పాకంలో కాకుండా ఇడ్లీ షేపులో చేసి తియ్యని పాలలో నిలవ ఉంచితే.. అదే రసమలై.

పాల విరుగుడు అంటే పాలలోని ప్రొటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, కొవ్వుల మిశ్రమం. పాలు విరిగినప్పడు.. ఆ ప్రొటీన్ గట్టిపడుతుంది. అది మరింత ముద్దగా అయ్యేలా కొవ్వు తోడ్పడుతుంది. మరోమాటలో చెప్పాలంటే.. చిక్కనిపాలలో ఉండే పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పాలను విరగకొట్టడానికీ, నిలవ ఉంచడానికీ వాడే యాసిడ్ల వినియోగం పరిమితంగా ఉన్నంత వరకు రసగుల్లా, రసమలై లాంటి స్వీట్లు తినటం మంచిదే.

నిజం చెప్పాలంటే.. మనకంటే యూరోపియన్లు… గ్రీకు నాగరికత కన్నా ముందునుంచే పాల విరుగుడు, చీజ్‌ లను వాడుతున్నారు. అయితే.. మనకు ముందునుంచి విరిగిన పాలను వాడే సంప్రదాయం లేకపోవటం, అది ఆరోగ్యానికి మంచిది కాదనే ఆయుర్వేద నియమాల వల్ల మన దగ్గర ఈ తరహా స్వీట్లకు కాస్త ఆలస్యంగానే ఆదరణ మొదలైంది.

చివరగా.. పాలు విరగ్గొట్టి చేసే ఈ రసగుల్లా వంటి స్వీట్లు మేలు చేస్తాయా లేదా హాని చేస్తాయా అనే అంశాలను తాత్కాలికంగా పక్కనబెడితే.. అవి మన భారతీయ మిఠాయిలుగా ప్రపంచవ్యాప్తంగా పేరు మాత్రం మనకు వచ్చింది. అంతేకాదు.. కేవలం 150 ఏళ్లలో ప్రపంచ స్వీట్ల వ్యాపారంలో మనకంటూ ఘనమైన వాటా దక్కటంలో రసగుల్లా వంటి స్వీట్లే కారణం.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

Big Stories

×