EPAPER

Kaloji Narayana Rao: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!

Kaloji Narayana Rao: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!

Special Story on Kaloji Narayana Rao: పల్లె జనం నోట పలికే భాషను, అక్కడి పంటపొలాలపై వీచే పైరగాలి సౌరభాన్ని సాహిత్య భాషగా మార్చిన కవి, భూస్వామ్య, బూర్జువా పెత్తందారులపై, అప్రజాస్వామ్యవాదులపై జీవితాంతం యుద్ధం చేసిన యోధుడు కాళోజీ. తన కవితావేశంతో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన నవయుగ వైతాళికుడిగా, తెలంగాణ భాష, యాస, సంస్కృతీ సాహిత్యాలకు గొంతుకనిచ్చి, అందరి మనిషిగా నిలిచిన వాడు.. కాళన్న. పదవులు, హోదాలను ఆశించక, నిజానికే తప్ప.. ఏ ఇజానికీ కట్టుబడక చివరి నిమిషం వరకు ప్రజల పక్షాన నిలిచిన వాస్తవికవాది కాళోజీ. తన పద్మవిభూషణ్ బిరుదు కంటే జనంలో ఒకడిని అనిపించుకోవటమే తనకు దక్కిన గొప్ప బిరుదని తెగేసి చెప్పిన ప్రజాహితుడాయన. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి పోరాడిన రూసో, మాంటెస్యూ, వాల్టేర్‌ల మార్గంలో నడిచిన విశ్వమానవుడు. జన రాజకీయంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని బలంగా నమ్మిన నేతగా, తెలంగాణలో దగా పడిన బడుగుజీవుల వేదననే తన గొడవగా చేసుకున్న కాళోజీ జయంతి నేడు. ఆ మహనీయుని జయంతిని మనం తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాం.


కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టహళ్లి గ్రామంలో1914 సెప్టెంబర్ 9న రంగారావు రమాబాయమ్మ దంపతులకు కాళోజీ జన్మించాడు. పెద్దలు పెట్టిన పేరు.. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రావు రామ్ రాజు. కాళోజీ అనేది వీరి ఇంటిపేరు. వీరి కుటుంబం రట్టహళ్లి నుంచి వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామానికి వలస వచ్చి స్థిరపడింది. కాళోజీ తండ్రి మహారాష్ట్రకు చెందినవారు కాగా తల్లిది కర్ణాటక. కాళోజీ పుట్టిన ఆరు నెలలకే తల్లిని కోల్పోవటంతో అన్న రామేశ్వరరావు అన్నీ తానై పెంచారు. ప్రాథమిక విద్య మడికొండలోను, హైస్కూలు చదువు హనుమకొండలోని యెట్ హైస్కూల్‌లో సాగింది. తర్వాతి చదువు హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా కాలేజీలో, తర్వాత ఉస్మానియాలో బీఎల్ చేసి,1940లో వకీలు వృత్తిని చేపట్టారు. అదే ఏడాది రుక్మిణీబాయిని వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు రవి కుమార్. నిరంతరం ప్రజా ఉద్యమాల్లో భాగస్వామిగా ఉండటంతో లాయరు వృత్తిని కొనసాగించలేకపోయారు.

తెలంగాణ గడ్డపై జరిగిన అనేక పోరాటాల్లో కాళోజీ చురుకైన పాత్ర పోషించాడు. వరంగల్లో కాజీపేట్ స్కూల్‌లో చదివేటప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలకు నాటి నిజాం ప్రభుత్వం సెలవు నిరాకరించిన సందర్భంలో 1200 మంది విద్యార్థులతో సెలవుచీటీలు రాయించి తరగతులను బహిష్కరించి, వరంగల్లులో ఘనంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలంటూ 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో హయగ్రీవాచారితో కలిసి వరంగల్ చౌరస్తాలో సత్యాగ్రహం చేసి అరెస్టయ్యాడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు హన్మకొండలోని బ్రాహ్మణవాడలో త్రివర్ణ పతాకం ఎగురవేసి నగర బహిష్కరణకు గురయ్యాడు.


Also Read: సంక్షేమ రథంతోనే అభివృద్ధి పథం..!

సాహిత్యం మనిషిని ముందుకు నడిపించగలదని నమ్మి.. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తన కంటే ఐదేళ్లు చిన్నవాడైన మిత్రుడు పీవీ నరసింహారావుతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో, ఉస్మానియాలో జరిగిన విద్యార్థుల వందేమాతర ఉద్యమం, సత్యాగ్రహ ఉద్యమం, ఆర్యసమాజ్‌, గ్రంథాలయ ఉద్యమం, కాంగ్రెస్‌ పోరాటాలు, రజాకార్ల ఉద్యమాలలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు పీవీతో సహా వందలమంది ఉస్మానియా విద్యార్థులను రాష్ట్రం నుంచి బహిష్కరించగా, వారందరికీ నాగపూర్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇప్పించారు. నిజాం వ్యతిరేక పోరాటం మూలంగా 1938లో 4 రోజులు, 1943 లో రెండున్నర ఏండ్లు, 1947 సెప్టెంబర్ 3 నుంచి 13 నెలలు జైల్లో ఉన్నాడు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత కూడా అందరిముందే పీవీని ‘ఒరే’ అనే పిలవగలిగిన విశిష్ట వ్యక్తిత్వం కాళోజీది.

కాళోజీ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. కానీ తెలంగాణ గడ్డ మీద ఏ పెద్ద పోరాటం జరగాలన్నా.. కాళోజీ సలహా, ఆయన చేయి ఉండాల్సందే. ఇలా అనేక పోరాటాలకు ఆయన ఇల్లు కేంద్రంగా ఉండేది. పలు దృక్పథాలు గల వ్యక్తులతో పనిచేయటం వల్ల భిన్నధోరణులను ఆహ్వానించే విశిష్ట వ్యక్తిత్వం కాళోజీకి అలవడింది. ఒకసారి ఓ పోలీసు అధికారి కాళోజిని అరెస్టుచేసి ‘గుడిలో పోచమ్మ దగ్గరా ఉంటావు, వినాయక చవితి మండపాల్లోనూ కనిపిస్తావు. ఆర్యసమాజపు సభల్లోనూ మాట్లాడుతుంటావు. అటు..ఆంధ్ర మహాసభలోనూ పనిచేస్తావు. ఏంది నీ కథ’ అని ప్రశ్నించగా, ‘పౌర సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా, అమాయకులైన ప్రజలపై ఎక్కడ దౌర్జన్యం జరిగినా అక్కడ నేనుంటా. వారి తరపున పోరాడతా’ అని గట్టిగా బదులిచ్చారు.

కాళోజీ ఎజెండా కేవలం ప్రజలు. వారిని పీడించే వ్యక్తి ఎంత పెద్ద నాయకుడైనా, ధనవంతుడైనా వారిని ఎదిరించేవాడు. బయటకు ఎంత గంభీరంగా కనిపించే కాళోజీ హృదయం అంత సున్నితమైనది. చిన్న అన్యాయానికీ తీవ్రంగా చలించిపోయి కన్నీరు కార్చేవాడు. మిత్రులు, ఉద్యమ నేతలు, కవులు, కళాకారులతో రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించే కాళోజీ, ఒక్కడే ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకోవడం లేదంటే దీర్ఘాలోచనలో మునిగిపోయేవాడు. కాళోజీకి క్రికెట్ అంటే ప్రాణం. సచిన్ టెండూల్కర్‌కి పెద్ద ఫ్యాన్. ప్రజాస్వామిక లక్షణాలన్నీ నిలువెల్లా వంట పట్టించుకున్న కాళోజీ ఏది మాట్లాడినా అది ఎదుటివారిని నేరుగా తాకేది. వర్తమాన కాలపు అన్యాయాలను పురాణ గాథల్లోని ఘట్టాలతో పోల్చి చెప్పటం ఆయన మరో ప్రత్యేకత.

తెలంగాణ భాషకు.. కాళోజీ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ఉస్మానియా వర్సిటీ తెలుగుశాఖ తొలి అధ్యక్షుడు రాయప్రోలు సుబ్బారావు తెలంగాణ భాషను తరచూ కించపరుస్తుండటం, తెలంగాణ రైతాంగ పోరాటాన్ని వ్యతిరేకించి నిజాం రాజును సమర్థించేవారు. ఇది నచ్చని కాళోజీ ఉగాది సమ్మేళనంలో ‘లేమావి చివురులను లెస్సగా మేసేవు.. రుతురాజు వచ్చెనని అతి సంభ్రముతోడ.. మావి కొమ్మల మీద మైమరచి పాడేవు.. తిన్న తిండేవ్వానిదే కోకిలా, పాడు పాటెవ్వానిదే కోకిలా’ అని తెలంగాణ పక్షాన తన నిరసనను తెలిపారు. తెలుగు భాషను కాదని పరభాషల పట్ల మోజు చూపే వారిని ‘తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడిదవు సంగతేమిటిరా.. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా? అని ఎద్దేవా చేశాడు.

బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ సైరన్‌ మోగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ నిరంతరం పరితపించి మలిదశ ఉద్యమాలకు పెద్దదిక్కుగా నిలిచారు. 1992లో పద్మ విభూషణ్ పొందిన కాళోజీ.. 2002, నవంబర్ 13న వరంగల్‌లో కన్నుమూశారు. నిర్భీతికి ప్రతీకగా, దుర్మార్గాలపై ఓ ధిక్కార స్వరంగా నిలిచిన అసలు సిసలు తెలంగాణ బిడ్డ అయిన కాళోజీని స్మరించుకోవడమంటే.. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన విలువలను గౌరవించటమే. అయితే, ఆయన ఆలోచనలను చిత్తశుద్ధితో ఆచరించగలిగితేనే అది కాళోజీకి నిజమైన నివాళి కాగలదు.

Related News

Jani Master Case Updates: వాష్ రూమ్, డ్రెస్ ఛేంజ్.. జానీ కహానీ

Kejriwal Resign: కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్.. రాజీనామా ప్రకటన వెనుక అసలు సంగతి ఇదా ?

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Stories

×