Big Stories

DK Shivakumar: ఎవరీ డీకే శివకుమార్?.. ఏంటి బ్యాక్‌గ్రౌండ్? ఫుల్ డీటైల్స్..

dk shivakumar

DK Shivakumar: డీకే శివకుమార్. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. కర్నాటక సీఎం సీటు జస్ట్ మిస్. పార్టీ కోసం సీఎం పదవి త్యాగం చేశారు. డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు. పీసీసీ చీఫ్ తనదగ్గరే ఉంచుకున్నారు. ఇంతకీ డీకే బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్‌కు ఆయన చేసిన సేవలు ఏంటి? ప్రణబ్ ముఖర్జీ తర్వాత.. ఆ స్థాయిలో పార్టీకి ట్రబుల్ షూటర్‌గా ఎలా మారారు? కర్నాటకలో కింగ్ మేకర్‌ ఎలా అయ్యారు? ఇవన్నీ ఆసక్తికర విషయాలు.

- Advertisement -

వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు డీకే శివకుమార్. 1980ల్లో బెంగళూరులోని ఆర్‌సీ కాలేజీలో చదువుతున్నప్పుడే.. యువజన కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. 1983-85లో కర్ణాటక స్టేట్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా చేశారు. 1989లో 27 ఏళ్ల వయసులో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండేళ్లు తిరిగేసరికే.. కేవలం 30 ఏళ్ల వయస్సులోనే మంత్రి అయ్యారు. 1991 నుంచి 92 వరకు ముఖ్యమంత్రి బంగారప్ప కేబినెట్‌లో మంత్రిగా చేశారు డీకే శివకుమార్. సతనూర్ నుంచి నాలుగు సార్లు, కనకపుర నుంచి నాలుగుసార్లు.. మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన శివకుమార్.. జలవనరుల శాఖ, జైళ్లు మరియు హోంగార్డులు, పట్టణాభివృద్ధి, ఇంధనం మరియు వైద్య విద్య తదితర శాఖలను నిర్వహించారు. ఈసారి డిప్యూటీ సీఎం అవుతున్నారు.

- Advertisement -

ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఏకష్టం వచ్చినా నేనున్నానంటూ రంగంలోకి దిగేవారు ప్రణబ్ ముఖర్జీ. అందుకే ఆయన్ను ట్రబుల్ షూటర్ అనేవారు. ఆ తర్వాత అంతటి పేరు డీకే శివకుమార్‌కే వచ్చింది. కర్నాటక కాంగ్రెస్‌కు ఏ కష్టమొచ్చినా.. ఆయనే చూసుకునేవారు. అలాగని ఆయన చాణక్యం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆపదొచ్చినా.. డీకేనే ముందుండేవారు. 2002లో అప్పటి మహారాష్ట్ర సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా.. వాళ్లను బెంగళూరు తీసుకొచ్చి.. తన రిసార్ట్‌లో ఆతిథ్యం ఇచ్చి.. సరిగ్గా తీర్మానం సమయానికి మహారాష్ట్ర అసెంబ్లీకి చేర్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలికూలిపోకుండా కాపాడారు డీకే శివకుమార్. అప్పటినుంచి డీకే పేరు జాతీయ కాంగ్రెస్‌లో మారుమోగిపోయింది.

అలాంటిదే ఇంకో ఘటన. 2017 రాజ్యసభ ఎన్నికలు. గుజరాత్ నుంచి కాంగ్రెస్ కీలకనేత అహ్మద్ పటేల్ బరిలో ఉన్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుజరాత్ నుంచి బెంగళూరుకు తరలించి.. తన రిసార్ట్‌లో ఉంచారు. కాంగ్రెస్ అభ్యర్థిని రాజ్యసభకు పంపించడంలో సక్సెస్ అయ్యారు.

ఇక, లాస్ట్ టర్మ్.. 2018లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌.. మేజిక్ ఫిగర్‌కు దూరంగానే నిలిచిపోయింది. వెంటనే లీడ్ తీసుకున్న డీకే శివకుమార్.. జనతాదళ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇందుకే ఆయన ట్రబుల్ షూటర్ అయ్యారు.

డీకే శివకుమార్ ఇంత చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూస్తూ కూర్చుంటుందా? ఐటీ, సీబీఐ, ఈడీలు డీకేను ఫుల్‌గా టార్గెట్ చేశాయి. 2017 ఆగస్ట్‌లో.. బెంగుళూరులోని శివకుమార్ ఇల్లు, కార్యాలయాల్లో.. ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. శివకుమార్‌కు చెందిన రిసార్ట్‌తో పాటు.. ఢిల్లీ, బెంగళూరు, మైసూరు, చెన్నై, శివకుమార్ స్వస్థలం కనకపుర.. ఇలా మొత్తం 67 ప్రాంతాల్లో.. 300 మంది అధికారులు.. 80 గంటల పాటు తనిఖీలు చేశారు. శివకుమార్ ఢిల్లీ నివాసంలో 8 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 300 కోట్ల లెక్కల్లోకి రాని ఆదాయం గుర్తించినట్టు ప్రకటించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించినందుకు కేంద్రం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అది. గుజరాత్ ఎమ్మెల్యేలను ఏ రిసార్ట్‌లో అయితే ఉంచారో.. అదే రిసార్ట్‌పై ఐటీ రైడ్స్ జరగడం రాజకీయ ప్రతీకార చర్య కాకపోతే మరేంటంటూ.. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో గగ్గోలు పెట్టింది. ఆ కేసులో ముందస్తు బెయిల్ రావడంతో ఆయనకు కాస్త ఊరట లభించింది.

అయినా, ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి జాతీయ దర్యాప్తు సంస్థలు. 2019 సెప్టెంబర్‌లో మరోసారి డీకేను టార్గెట్ చేశారు. అక్రమ గ్రానైట్ మైనింగ్ కేసు, శాంతినగర్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, పన్ను ఎగవేత, మనీలాండరింగ్ తదితర కేసుల్లో శివకుమార్‌ను అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు. 104 రోజుల పాటు ఆయన తీహార్ జైల్లో మగ్గాల్సి వచ్చింది. ఆ సమయంలో సోనియాగాంధీ స్వయంగా జైలుకు వెళ్లి మరీ శివకుమార్‌ను పరామర్శించారంటే.. ఆయనకు పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రాధాన్యం ఎంటో అర్థమవుతుంది. ఆ కేసుల్లో ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. 2020 జూలై 2న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యమంత్రి రేసులో నిలిచి.. డిప్యూటీ సీఎంగా అడ్జెస్ట్ అవుతున్నారు.

మరి, దర్యాప్తు సంస్థలు డీకేను టార్గెట్ చేశాయంటే.. ఆయన బిగ్ బిజినెస్‌మేన్ అన్నట్టేగా. అవును, డీకే శివకుమార్ మామూలోడు కాదు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నేతల్లో ఒకరు. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో 840 కోట్ల ఆస్తులు చూపించారాయన. అంతకుముందు 2013 ఎన్నికల అఫిడవిట్‌లో 251 కోట్ల సంపద ప్రకటించారు. అంటే, ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు 600 కోట్లకు పైగా పెరిగాయి.

ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లో ఏకంగా 1400 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించి మరింత సంచలనంగా నిలిచారు. ఆయన పేరు మీద 1214 కోట్ల ఆస్తి ఉండగా, భార్య ఉషా సంపద 153 కోట్లు. ఇక కుటుంబ ఉమ్మడి ఆస్తి మరో 61 కోట్లు. డీకేకు 12 బ్యాంకు ఖాతాలు ఉండగా.. 225 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఇక, శివకుమార్ దగ్గర 2 కిలోల బంగారం, 12 కిలోల వెండి, కేజీ బంగారు ఆభరణాలు, 324 గ్రాముల వజ్రాలు, 24 గ్రాముల కెంపులు, 195 గ్రాముల వజ్రం, 87 గ్రాముల రూబీ ఉన్నాయి.

డీకే శివకుమార్ పుట్టుక కూడా ఆసక్తికరం. తండ్రి కెంపెగౌడ, తల్లి గౌరమ్మ. వారికి పెళ్లైన మూడేళ్ల వరకు పిల్లలు కలగలేదు. శివల్దప్ప ఆలయానికి వెళ్లి బిడ్డ కోసం ఆ పరమ శివుడిని ప్రార్థించారు. ఆ తర్వాత వారికి 1962 మే 15న మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు దేవుడి పేరు మీద “శివకుమార్” అని పేరు పెట్టారు. పూర్తి పేరు.. దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఇప్పుడు కర్నాటక డిప్యూటీ సీఎం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బిగ్ టాస్క్‌ను ఆయన తన భుజాలమీదకు ఎత్తుకున్నారు. మళ్లీ పార్టీ సేవలో బిజీ అయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News