EPAPER

Deccan Cements Lands : అడవుల్లో అడ్డగోలు దందా! డెక్కన్ సిమెంట్స్‌కు రూల్స్ పట్టవా?

Deccan Cements Lands : అడవుల్లో అడ్డగోలు దందా! డెక్కన్ సిమెంట్స్‌కు రూల్స్ పట్టవా?

– ఫారెస్ట్ ఏరియాలో డెక్కన్ సిమెంట్స్ లీలలు
– సీఏ స్కీం పూర్తి కాకుండానే అడ్డగోలు వ్యవహారాలు
– టైటిల్ లేని భూములు కొనుగోలు చేసి అడ్డదారులు
– మామూళ్లతో వత్తాసు పలుకుతున్న అధికారులు
– ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అధికారుల తీరుపై అనుమానాలు
– చర్యలు తీసుకుంటే రూ.1,500 కోట్ల పరికరాలు ఖతమే
– కంపెనీ ప్లేస్ ఖాళీ చేయాల్సి వస్తుందని వందల కోట్ల లంచాలు
– కేసు ఎన్జీటీకి చేరడంతో బయటపడుతున్న దందాలు
– 600 ఏండ్ల చరిత్ర ఉన్న జాన్ పహాడ్ సైదులు దర్గానీ మింగేశారు
– 3 మైనింగ్ ఏరియాలతో ఫారెస్ట్ భూములను కొట్టేసిన తీరుపై స్వేచ్ఛ-బిగ్ టీవీ స్పెషల్


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం


Special Story on Deccan Cements Land Issues : బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. 2020లో దీన్ని అమల్లోకి తెచ్చారు. ఆనాడు అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టిన నాడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వివాదాస్పదమైన సూర్యాపేట జిల్లా గుర్రంబోడు సర్వే నెంబర్ 540లోని భూముల గురించి ప్రస్తావించారు. అందుకే ధరణి అవసరమని తేల్చారు. ఒకప్పుడు ఫారెస్ట్ ల్యాండ్‌ని డీ1 పట్టా భూములుగా మార్చి నాగార్జున సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చారు. దాదాపు 6,500 ఎకరాల భూమిని కేటాయిస్తే 14 వేల ఎకరాలకు దొంగ డీ1 పట్టాలు పుట్టుకొచ్చాయి. అయితే, దాదాపు 7 వేల ఎకరాల దాకా మైనింగ్ మాఫియా కన్నుతో లిటిగేషన్స్‌లోకి వెళ్లాయి. వాటిలో డెక్కన్ సిమెంట్స్ దందా వెరీ వెరీ స్పెషల్. దేశంలో ఫారెస్ట్ ల్యాండ్స్‌ రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు వందల కోట్లు తీసుకుని భూముల్ని అప్పనంగా కట్టబెట్టారు.

ఫారెస్ట్‌లోనే మైనింగ్

1986లో రోజుకు 350 టన్నుల కెపాసిటీతో ఏర్పాటైంది డెక్కన్ సిమెంట్స్ కంపెనీ. కానీ, ఇప్పుడు ఫారెస్ట్ భూములను కబ్జా చేసి 11 వేల టన్నులకు విస్తరించింది. ఫారెస్ట్ చట్టాలను పార్లమెంట్ కఠినంగా మార్చుతూ వస్తున్నా డెక్కన్ సిమెంట్స్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలను మేనేజ్ చేస్తూ 700 ఎకరాలకు విస్తరించి కేంద్ర ప్రభుత్వ చట్టాలను తుంగలోకి తొక్కుతోంది. ఎన్ని వందల కోట్లు పెట్టినా, తయారు చేసుకోలేని ఫారెస్ట్ భూములను బొందల గడ్డల్లా మార్చేసింది. పాత మైనింగ్‌ తవ్వకాలను పూడ్చాకే, కొత్త మైనింగ్ తీసుకుంటామని హామీ ఇచ్చి మాయ చేయడం డెక్కన్‌కు వెన్నతో పెట్టిన విద్య. సూర్యాపేట జిల్లా మహంకాళి గూడెంలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ తర్వాత సైదుల్ నామా ఫారెస్ట్ ఏరియా కంపార్ట్మెంట్ జోన్ 26, 27లో సున్నం రాయి తవ్వకాలతో కొనసాగిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

మైనింగ్ లీజ్ మాఫియా

38 ఏండ్ల క్రితం అడవుల్లో సహజ సంపదలను కొల్లగొట్టేందుకు ఇలాంటి ఇండస్ట్రీలు దేశ వ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. అప్పుడే సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో సున్నపు గనులను తవ్వేందుకు ఫారెస్ట్ ఏరియాలో 22 హెక్టార్స్‌లో రోజుకు 350 టన్నుల సుద్దను తీసేందుకు మైనింగ్‌ని లీజుకు తీసుకున్నారు. 2000లో 73.93 హెక్టార్స్ కంపార్ట్మెంట్ నెంబర్ 27లో సైదుల్ నామా రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. సుమారు 4 వేల ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇందులో మూడు దశలుగా 700 ఎకరాల పైనే డెక్కన్ సిమెంట్స్‌కి కేటాయించారు. సీఏ ల్యాండ్(కాంపన్సేటరీ ఎఫారిస్టేషన్) ప్రకారం ఎంత ల్యాండ్ తీసుకుంటే అంత ఫారెస్ట్‌కి ఇవ్వాలి. ఇది పూర్తి కాకుండానే ఫారెస్ట్ ల్యాండ్ కేటాయిస్తే అది చెల్లదని చట్టం (ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్స్)లో స్పష్టంగా ఉంది. అయితే, గుర్రంబోడు సర్వే నెంబర్ 540లో 43 హెక్టార్స్ డెక్కన్ సిమెంట్స్‌కి ఉన్నట్లు ఫేక్ జీపీఏ పేపర్స్ సృష్టించారు. ల్యాండ్ ఉందా లేదా అని చూడకుండానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేపర్స్ పైనే మ్యూటేషన్ చేసుకుంది. నాగార్జున సాగర్ ముంపు బాధితులకి ఫారెస్ట్ ల్యాండ్స్‌ని డీ1 పట్టాల భూములుగా చేర్చుతూ కొత్త సర్వే నెంబర్ 540ని క్రియేట్ చేసింది. దానిని నాన్ ఫారెస్ట్‌గా ఇచ్చారు. ఈ సర్వే నెంబర్‌పై మొత్తం 6 వేల 500 ఎకరాలు ఇస్తే, ప్రస్తుతం 14వేల ఎకరాలకు పైగా దొంగ పట్టాలు ఉన్నాయి. అందుకే, కేసీఆర్ ధరణి పుట్టిన రోజున అసెంబ్లీ సాక్షిగా ఇదే ప్రస్తవించి, దాని అవసరం ఏంటో చెప్పారు. కావాలని దొంగ పేపర్స్‌తో ఫారెస్ట్ భూములను కొట్టేయాలని చూసిన స్కాంని ముందే గుర్తించి, డీఎఫ్ఓ 2000లో మైనింగ్ అపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు పెట్టాలని ఫిర్యాదు కూడా అందింది. 2002లో డెక్కన్ సిమెంట్స్ వాళ్లు డీఎఫ్ఓని అండర్ టేకింగ్ లా లెటర్ రూపంలో వేడుకున్నారు. ఇప్పటికిప్పుడు అంటే అపలేం. కుటుంబరావు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేశాశాడు. మళ్లీ మరో ల్యాండ్ కొనుగోలు చేసి ఇచ్చేంత వరకు సమయం ఇవ్వాలని ఆనాటి జీఎం కోటేశ్వరావు కోరారు. అదే లెటర్ అధారంగా ఒక అవకాశం ఇచ్చింది ఆనాటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్. 2002 తర్వాత స్టేట్ ఫారెస్ట్ అధికారులు 10 సార్లు రిమైండ్స్ నోటీసులు ఇచ్చారు. ఈ విషయాలన్నింటినీ 2014లో కాగ్ దుయ్యబట్టింది.

20 ఏండ్ల తర్వాత మళ్లీ!

అడవులను కాపాడేందుకు అనేక చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఫారెస్ట్ ఏరియాలో అత్యంత విలువైన సంపదనను కొల్లగొట్టుతున్న వ్యవహారంపై ఎన్జీటీలో 2016లో ఓఏ నెంబర్ 33/2016 కౌంటర్ అదనంగా ఫారెస్ట్ ల్యాండ్‌ని కబ్జా చేశారని కౌంటర్ వేశారు. 2021లో ఫైన్ వేయాలని తీర్పు వచ్చింది. 90 ఎకరాల్లో 1500 కోట్ల సామాగ్రి ఉండే సిమెంట్ ఫ్యాక్టరీ, ఫవర్ ప్లాంట్‌ని నిర్మించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొలేదు. వాళ్లు ఇవ్వలేదు. ప్లైయింగ్ స్క్వాడ్ 33 హెక్టార్స్ అక్రమించారని తేల్చగా, డీఎఫ్ఓ మాత్రం 8 హెక్టార్స్ ఉందని ఒప్పుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు 2015, 2016 మధ్య కాలంలో ఇచ్చామని, 2020 జూలై 1న ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. 10 నెలల వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. దీని వెనుక, 200 కోట్ల వ్యవహారం నడించిందని, ఆనాటి జిల్లా మంత్రి నుంచి చేతులు మారాయని వినికిడి. 2021లో ఫ్రెష్‌గా రైల్వే స్టైడింగ్ కావాలని అందుకు ల్యాండ్‌ని రెగ్యులరైజ్ చేయాలని అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ ప్రపోజల్ 4 రోజుల్లోనే ఆటవీ శాఖ, మిగితా అధికారులు అందరూ కలిసి అప్రూవల్ ఇచ్చేశారు. కబ్జా చేసిన ప్రాంతంలో చెట్లు లేవు. అటవీ భూమికి ఎలాంటి ఇబ్బందులు లేవని సెంట్రల్‌కి రికమండేషన్ ఇచ్చారు. ఆనాడు ఎన్విరాన్మెంట్ అధికారి అయిన ఆర్ శోభకు రిటైర్డ్ అయిన తర్వాత ఫారెస్ట్ అడ్వయిజరీ కమిటీలో ఛైర్మన్‌ పోస్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2023 మార్చిలో అక్రమంగా అక్రమించిన ఫారెస్ట్ భూమికి మొట్టమొదటి సారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనుమతులు తెచ్చుకున్నారు. ఈ అప్రూవల్ ఇన్ వాల్యుడ్ అని కొంతమంది మళ్లీ ఎన్జీటీలో కేసులు వేశారు. దీనిపై ఈ నెల 8న విచారణ జరగనుంది.

చట్టాలు ఏం చెబుతున్నాయి

ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ 1980 ప్రకారం సెంట్రల్ భూమికి రాష్ట్రం కస్టోడియల్ మాత్రమే అని 1990లోనే పార్లమెంట్ చట్టం చేసింది. 1980 కంటే ముందే 75 సంవత్సరాలు కబ్జాలో ఉంటే వారికి భూమి ఇవ్వాలి. లేదంటే ల్యాండ్‌ని ఖాళీ చేయాల్సిందేనని రిజర్వ్డ్ ఫారెస్ట్ చట్టం కఠినంగా చెబుతోంది. అయితే, 2011లో కబ్జా చేసిన వారికి భూమి ఇవ్వడం ఏంటని సుప్రీంకోర్టు గతంలోనే వేరే కేసుల్లో తీర్పులు ఇచ్చింది. ఢిల్లీ ఎన్జీటీ ప్రిన్సిపాల్ జడ్జిమెంట్ ప్రకారం 10 వేల మంది నివాసం ఉండే ఢిల్లీలోని ఓ ఏరియాను మొత్తం ఖాళీ చేయించారు. రెగ్యులరైజేషన్ పూర్తి అయితే కేసులు వేయాలి. గతంలో కేసులు ఉండటంతో మళ్లీ ఎన్జీటీలో అప్పీల్ (27/2023) వేశారు. 26 సంవత్సరాలుగా మైన్ 2 కి చెందిన సీఏ పూర్తి చేయలేదు. ఇల్లీగల్‌గా 2 కోట్ల 60 లక్షల టన్నుల మైనింగ్‌ని తీశారు. నంబాపూర్ విలేజ్‌లో 1998 కంపార్ట్మెంట్ ప్రకారం అక్రమాలను కాగ్ ఎండగట్టింది.

కమిటీలు వేయాలి.. కమీషన్స్ మింగాలి

2016లో 600 ఏండ్ల చరిత్ర కలిగిన జాన్ పహాడ్ సైదులు దర్గా అన్యాకాంత్రం అయిందని కేసు విచారణలో అక్రమాలపై 2019లో కమిటీ వేశారు. దీనికి హెడ్‌గా జిల్లా కలెక్టర్, అందులో మెంబర్స్‌గా ఫారెస్ట్ అఫీసర్ (ముకుందా రెడ్డి ) పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రాజేంద్ర. డిస్ట్రిక్ మైనింగ్ హెడ్, ఏడీఎంజీ, పీసీఎం ఆర్ శోభ, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లయిమేట్ ఛేంజ్ (ఐఆర్ఓకి ఐజీ) ఉన్నారు. ఫీల్డ్‌కి వెళ్లి చూడాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. కానీ, కలెక్టర్ వినయ్ రెడ్డి చెప్పడంతో అంతా బాగానే ఉందని రిపోర్ట్ ఇచ్చారు. డెక్కన్ సిమెంట్ ఎలాంటి తప్పు చేయలేదని జాన్ పహాడ్ సైదులు దర్గా పురాతన కట్టడం కాదని పురావస్తు శాఖ నుంచి సర్టిఫికేట్ ఇచ్చేశారు. నిజానికి ఈ దర్గా వక్ఫ్ బోర్డ్ కంట్రోల్‌లో ఉంది. సర్టిఫికేట్ వక్ఫ్ బోర్డ్ నుంచి రావాల్సి ఉంది. కానీ, మేనేజ్ చేసి తప్పుదోవ పట్టించారు.

ఫైనల్ మైన్ మూడోది

400 ఎకరాల్లో అంతా 27 కంపార్ట్మెంట్ జోన్‌లోనే ఉంది. 2012లో ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ వన్. 2013లో స్టేజీ 2 ఫైనల్ క్లియరెన్స్, 2017లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నారు. గత మైన్స్ అన్నింటినీ పూడ్చి వేస్తామని అంగీకరించారు. లీజ్‌లు అన్నింటినీ పూడ్చి, ఫారెస్ట్ ఢిపార్ట్మెంట్‌కి అప్పగించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది. ఈ విషయాన్ని సూపర్ వైజింగ్ చేసి రీఫిల్‌కి కావాల్సిన అన్ని నియమాలు పాటిస్తున్నారో లేదా చూడాలని రాష్ట్ర అధికారులను కోరింది. ప్రతి మూడు నెలలకోసారి మానటరింగ్ రిపోర్ట్‌ని సెంట్రల్‌కి ఇవ్వాలని రూల్ ఉంది. ఇప్పటి వరకు ఒక్క మానిటరింగ్ రిపోర్ట్ కూడా సెంట్రల్‌కి ఇవ్వలేదు. మైన్ 2 , మైన్ 3 కలిసి ఆపరేషన్ నడుస్తోంది. 50 ఏండ్ల లీజ్ పేరుతోనే అంతా నెట్టుకొస్తున్నారు. ఫైనల్‌గా 2023 జూన్ 19న 23 లక్షల టన్నులుకు గాను 48 లక్షలకు ప్రొడెక్షన్ పెంచుకుంటూ ఈసీ క్లియరెన్స్ తెచ్చుకున్నారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఎన్జీటీలో కేసు ఫైల్ అయింది. 30 రోజుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌పై అభ్యంతరం చెప్పవచ్చు. కోర్టులో కేసు వేయవచ్చు. అయితే మినరల్ తీసుకుని గోతులు వదిలేస్తే ఊరుకునేది లేదని 2020లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2000 సంవత్సరంలో మైన్ 1 పూర్తి అయింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వర్తించవని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. డబ్బులు ఖర్చు అవుతాయని చేపల చెరువుగా లేదా టూరిజం స్పాట్ లాగా మార్చుకోవాలని మాముళ్ల మత్తులో మూలుగుతున్న అధికారులే కోరుతున్నారు. మైనింగ్ 2ని పూడ్చాలని అంటే, రన్నింగ్‌లో ఉంది, దాన్ని వాటర్ బాడీగా మారిస్తున్నామని చెబుతున్నారు. మామూలుగా అయితే మైనింగ్ ప్లానింగ్ ఫాలో కావాలి. కానీ డెక్కన్ సిమెంట్స్‌కు ఏదైనా సాధ్యమే.

మంచి ఏం జరుగుతోందంటే!

ఇలాంటి అక్రమాలతో మైనింగ్ చేస్తున్న వారంతా ఏదో ఒక తీరుగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులే లంచాలకు అలవాటు పడి భూములను కొల్లగొట్టేందుకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. 700 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ అందుబాటులోకి వస్తే, 3వేల కోట్లకు పైగా ఇల్లీగల్ మైనింగ్ చేశారని ఫైన్స్ విధించవచ్చు. గతంలో 48 కోట్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు. పూర్తి అయిన మైనింగ్‌ని పూడ్చివేసి మళ్లీ ఫారెస్ట్‌గా మార్చొచ్చు. కానీ, రూల్స్ బ్రేక్స్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు సాగిస్తున్నారు. ఇలాంటి వారిని వదిలేస్తే, రాబోయే రోజుల్లో అడవుల్లో సహజ సంపదను కొల్లగొట్టి బొందల గడ్డల్లాగా మార్చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. రేవంత్ సర్కార్ అయినా దీనిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

Related News

Nimmala Ramanaidu: నిమ్మల గ్రేట్ జాబ్.. చంద్రబాబు ప్రశంసలు

Kim Jong Un: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

Chakali Ailamma: తెలంగాణ హక్కుల బావుటా.. ఐలమ్మ..!

HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2

Nandigam Suresh: నందిగం సురేష్‌కి.. బిగిస్తున్న ఉచ్చు..

Mahesh Kumar Goud:హేమా హేమీలు పోటీలో ఉన్నా.. టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడే ఎందుకంటే?

Kaloji Narayana Rao: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!

Big Stories

×