EPAPER

History of Naxalism: మావోయిస్టుల అంతం.. ఎందుకీ పరిస్థితి వచ్చింది?

History of Naxalism: మావోయిస్టుల అంతం.. ఎందుకీ పరిస్థితి వచ్చింది?

నక్సలైట్లకు దూరమవుతున్న టెక్నాలజీ

దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన మావోయిస్ట్ ఉద్యమం ఇప్పుడు దాని చివరి దశను చేరుకుంటుంది. ఎన్‌కౌంటర్ ఘటనలు, లొంగిపోతున్న మావోయిస్ట్‌లు, అరెస్టవుతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నక్సలైట్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఎదురు కాల్పులు జరిగితే భద్రతా దళాలకు కూడా నష్టం వాటిల్లేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. పదులు సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు. భద్రతా దళాల దాడుల్లో ఆధునిక పరికరాలు వాడుతున్నారు. ఒకవైపు, నక్సలైట్లకు టెక్నాలజీ దూరమవుతుంటే.. భద్రతా బలగాలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అడువులు తగ్గుతున్న కొద్దీ మావోయిస్ట్‌లకు స్థావరాలు తగ్గుతూ వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం పేరుతో కారడువుల్లోనూ కాటేజ్‌లు వస్తున్నాయి. మరోవైపు, రాను రానూ నక్సలైట్ల సంఖ్య తగ్గుతుంటే ఉద్యమంలో 1990ల మధ్యకాలం నుండి కొత్త రిక్రూట్‌మెంట్లు జరగట్లేదు. మావోయిస్టు భావజాలానికి ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలోని విద్యార్థులలో ఎవరూ లేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 2004లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం తర్వాత రిక్రూట్‌మెంట్లపై పెద్ద దెబ్బ పడింది. ఒక విధంగా, ఉద్యమంలో చేరడానికి మనుషులే కరువయ్యారు.


2004లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం

ఒకప్పుడు బాగా చదువుకున్న మేథావులు కూడా ఉద్యమంలో భాగస్థులు అయ్యేవారు. పెత్తందారీ పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం వ్యూహాత్మకంగా బలంగా ఉండేది. అయితే, రాను రానూ ఉద్యమంలో సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఏ పెట్టుబడీదారి, గ్లోబలైజేషన్‌కు వ్యతిరేకంగా మావోయిస్ట్‌లు పోరాటం చేశారో.. అదే, గ్లోబలైజేషన్ అభివృద్ధి పేరుతో వచ్చి, పేదలకు సైతం వృత్తి ఉద్యోగావకాశాలను పెంచింది. అభివృద్ధి వెనుక ఎంత పెట్టుబడీదారి భావాలున్నప్పటికీ.. కూడు, గుడ్డ, గూడుకు కొదువ లేని పరిస్థితులు వచ్చాయి. దోపిడీ రాజ్యమనే నినాదాన్ని ఎవ్వరూ విని, అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఇంతటి బీజీ జీవితంలో పెట్టుబడీదారుల బిజినెస్ వ్యూహాలు సామాన్యులకు అవసరం లేకుండా పోయాయి. ఈ అత్యాధునిక ప్రపంచంలో మారు మూల ప్రాంతాల్లో కరెంట్ లేకపోయినా స్మార్ట్ ఫోనులు వచ్చేశాయి. కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సేవలు విస్తరించాయి. రానురానూ రోడ్డు రవాణా మెరుగువుతోంది. అసలు, ఏ అడవి బిడ్డల కోసం నక్సలైట్లు పోరాటం మొదలుపెట్టారో ఆ అడవుల్లో జీవించేవారే తక్కువయ్యారు.

పేదలకు సైతం వృత్తి ఉద్యోగావకాశాలు

చదువుకుంటున్న ఆదివాసీ యువతంతా వృత్తి విద్యల కోసం నగరాల బాట పట్టారు. నిరక్షరాస్యులు, అవకాశాలకు దూరమైన వారు తప్ప అడవుల్లో నివశించే వారే తక్కువయ్యారు. దీనితో, ఉద్యమంలో నుండి వెళ్లిపోయేవారే తప్ప కొత్తగా వచ్చేవారు లేరు. దీనితో, అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుండి బలవంతంగా యువతను లాక్కుంటున్న పరిస్థితి వచ్చింది. వారికి సరైన శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడంతో సంఖ్యా బలం తప్ప బుద్ధి బలం లోపించిన పరిస్థితులు వచ్చాయి. ఒకొక్కరిగా సీనియర్ లీడర్లంతా కనుమరుగవుతుంటే.. ఉన్నవారితోనే ఉద్యమాన్ని నడిపాల్సి అవసరం వచ్చింది. డాక్టర్లు, ఇంజినీర్లు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు కనుమరుగయ్యి.. గన్ను పట్టుకోవడం వచ్చినవారే ఎక్కువయ్యారు. ప్రభుత్వం పోలీసింగ్ పెరిగే కొద్దీ, అడవుల్లో మావోయిస్ట్ పొటన్సీ తగ్గుతూ వచ్చింది. వామపక్ష భావాలను మోస్తున్న సీటీ సిటిజన్స్ కారణంగా అర్బన్ నక్సల్స్ అనే పదం పుట్టింది. కానీ, అసలు నక్సలిజం మాత్రం అంతానికి అతి దగ్గరలో ఉంది.

ఆదివాసీ యువతంతా వృత్తి విద్యల కోసం నగరాల బాట

పట్టణాలకు దగ్గరగా ఉన్న మైదాన ప్రాంతాలలో, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, ఆంధ్ర ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక జోనల్ కమిటీ వంటి కీలకమైన గ్రూపులకు ఉద్యమం అత్యంత కష్టంగా మారింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి త్రి-రాష్ట్ర సరిహద్దు జంక్షన్‌లలో మావోయిస్టుల ఉనికి ఇప్పటికీ ఉన్నప్పటికీ అవి కూడా బలహీనంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2011లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ రూపొందించిన ఒక నివేదికలో.. ఈ ప్రాంతంలో ఉద్యమం స్తబ్దత స్థాయికి చేరుకుందని పేర్కొంది. దీనిని, 2013-14లో సెంట్రల్ కమిటీ కూడా ఆమోదించింది.

Also Read: నార్సింగిలో బంగారు గని..?

2014లో, అప్పటి సిపిఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి.. అన్ని రాష్ట్ర కమిటీలకు రాసిన లేఖలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నష్టాలను తగ్గించండనీ, బలమైన కోటలను రక్షించండని అందులో ఉత్తర్వు ఇచ్చారు. ఈ పరిణామం, మావోయిస్ట్ ఉద్యమ తిరోగమనాన్ని సూచిస్తుంది. అప్పటికే, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి చాలా రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వంటి నక్సల్ వ్యతిరేక పోరాట దళాలు వచ్చేశాయి. ఇది కీకారణ్యంలోకి కూడా చొరబడి, అగ్ర నాయకులను చంపేశాయి. అప్పటి నుంచి మావోయిస్టుల కార్యకలాపాల పరిధి తగ్గుతూ వస్తోంది.

‘వర్గ శత్రువు’ భావన బయటకు కనిపించే పరిస్థితులు లేవు

ఇక, సమస్యలు లేకపోవడం కూడా ఉద్యమంపై ప్రభావం చూపింది. మావోయిస్టులు ఇప్పటికీ ‘భూ సంస్కరణలు’, ‘వర్గ శత్రువు’ భావననే పట్టుకోని ఉన్నారు. అయితే, ప్రస్తుతం భూస్వాములు రైతుల భూమిని ఆక్రమించుకునే సమస్యలు తగ్గిపోయాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల మద్య దాదాపుగా ‘వర్గ శత్రువు’ భావన బయటకు కనిపించే పరిస్తితులు లేవు. ఇక, అడవిలో ఉండి పోరాడే కొత్త సమస్యలు కూడా పెద్దగా కనిపించట్లేదు. కొన్ని చోట్ల బాక్సైట్ తవ్వకాల సమస్య వంటి మైనింగ్ అంశాలు ఉద్యమానికి జీవం పోసే అవకాశం ఉంది. అయితే, అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఆ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇక, ప్రధాన స్రవంతిలో పోరాటం చేస్తున్న వారు కూడా చట్టరిత్యా చాలా సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సమస్యలను గుర్తించినా వాటిని ప్రజల్లోకి వచ్చి పరిష్కరించడం తప్ప అడవుల్లో ఉండి పోరాటం చేస్తే వచ్చే ఫలితాలు ఏవీ లేవు.

మైదాన ప్రాంతాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయిలో గిరిజనులు

ఇప్పటికీ ఏవైనా రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నా మావోయిస్టులు పూర్తిగా గిరిజన ప్రాంతాలపై ఆధారపడి ఉన్నారు. అది ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో, లేదంటే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్‌లలో ఉంటుంది. గతంలో ఈ ప్రాంతాల్లో మావోయిస్ట్‌లు మాత్రమే పరిష్కరించే సమస్యలను ఇప్పుడు తర్వాతి తరంలోని మధ్యతరగతి నాయకత్వంలో గిరిజన ప్రజలు బలంగా మారారు. మైదాన ప్రాంతాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒకప్పుడు పదులు సంఖ్యలో ఉన్న కేంద్ర కమిటీ బలం ఇప్పుడు వేళ్లపై లెక్కపెట్టే స్థాయికి వచ్చింది. ఇందులో కూడా దాదాపు 60 ఏళ్లు పైబడిన నాయకులే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. వారిలో కూడా దాదాపు 70% మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారు. వీరిలో చాలా మంది చనిపోయారు కూడా. మధ్య స్థాయి నాయకత్వం కూడా బలంగా లేదు. ఏది ఏమైనప్పటికీ, మావోయిస్ట్ ఉద్యమానికి కాలం చెల్లింది. నానాటికీ పెరుగుతున్న లొంగుబాట్లతో శాంతి చర్చలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇక, పోరాటం అంటారా.. దాని రూపం మార్చుకొని చాలా కాలం అయ్యింది. బూటకమైనా, నాటకమైనా అది ప్రజాస్వామ్య బద్దంగానే జరుగుతుందనే రాజకీయం పెరిగింది. అందులో నుండి సమస్యలను పరిష్కరించాలి తప్ప అడవుల్లో ఇక స్థానం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది.

Related News

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

×