EPAPER
Kirrak Couples Episode 1

Shanta Sinha | బాలల బంధువు శాంత.. నిరుపేదల విద్యకు అలుపెరగని కృషి

Shanta Sinha | బాలల బంధువు శాంత.. నిరుపేదల విద్యకు అలుపెరగని కృషి


శాంతా సిన్హా పుట్టినరోజు… జనవరి 7

Shanta Sinha | ఆధునిక కాలంలో బాలల హక్కుల కోసం విశేష కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా అగ్రగణ్యులు. బడి మొహం ఎరుగని నిరుపేద పిల్లల చేత పలకా బలపం పట్టించిన శాంత.. ఇటుక బట్టీల్లో, బీడీ పరిశ్రమల్లో వెట్టి చాకిరి చేస్తూ కట్టుబానిసలుగా మారిన వేలాది బాలబాలికలకు విముక్తి ప్రసాదించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బాలల హక్కులకై ఆమె చేసిన మూడున్నర దశాబ్దాల కృషికి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందిన అరుదైన సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు.


1950 జనవరి 7వ తేదీన విద్యావంతుల కుటుంబంలో శాంతాసిన్హా జన్మించారు. తండ్రిదండ్రుల పేర్లు.. మామిడిపూడి ఆనందం, సీతాలక్ష్మి. నెల్లూరు జిల్లాలో జన్మించిన శాంత.. బాల్యంలో సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌, కీస్ హైస్కూల్లోనూ విద్యాభ్యాసం చేశారు. 1972లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేసి, 1976లో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు.

పీజీలో అజోయ్ కుమార్ సిన్హాతో ఏర్పడిన పరిచయం.. పి.హెచ్.డి నాటికి ప్రేమగా మారటంతో వారిద్దరూ 1972 డిసెంబరు 3న వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఈ వివాహం విషయంలో మొదట పెద్దలు అభ్యంతర పెట్టినప్పటికీ తర్వాత వారు దీనికి సమ్మతించారు. ఈ దంపతులకు సుధ, దీప అనే ఇద్దరు కుమార్తెలు. అయితే.. 1979లో అజొయ్ అకాల మరణంతో.. శాంత కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చింది. అనంతరం ఆమె హైదరాబాద్ చేరి.. ఇక్కడి సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా చేరారు.

వీరి కుటుంబ నేపథ్యం ఎవరికైనా సరే ఆశ్చర్యం కలిగించక మానదు. వీరి తాత మామిడిపూడి వెంకటరంగయ్య. ఈయన గొప్ప విద్యావేత్త, సమాజవాది, చరిత్ర ఆచార్యుడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో వినూత్న విద్యావిధానానికి కృషిచేసిన సంస్కర్త. వీరి తండ్రి ఆనందం.. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. వీరి మామగారు (భర్త తండ్రి) బిజొయ్ కుమార్ సిన్హా.. భగస్ సింగ్ అనుయాయి. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, బ్రిటిష్ అధికారిపై బాంబు విసిరాడనే అభియోగాన్ని ఎదుర్కొని దశాబ్దాల కారాగార శిక్షను అనుభవించారు. వీరి అత్తగారు.. రాజ్యం సిన్హా కాంగ్రెస్ నాయకురాలిగా స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె మద్రాసు నుంచి ‘మాతృభూమి’ వారపత్రికను నడిపారు. ఈమె కాంగ్రెస్ నాయకులు అన్నే అంజయ్య అన్న కుమార్తె. శాంతినికేతన్‌లో చదువుకుని, విప్లవకారుడైన బిజొయ్ కుమార్ సిన్హాను వివాహమాడారు. 1951లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసి, వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ చేతిలో ఓడిపోయారు. ఇక.. శాంతా సిన్హా సోదరుడైన మామిడిపూడి నాగార్జున నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన తన 47వ ఏట కన్నుమూశారు.

శాంతా సిన్హా.. ఆంధ్రప్రదేశ్‌లోని 1981లో ఆమె తన తండ్రి పేరిట ఎంవీ ఫౌండేషన్‌ (మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌) స్థాపించారు. మొదట్లో సామాజిక మార్పుకోసం, పేదలకు విద్యనందించిన ఈ ఫౌండేషన్‌ 1991 తర్వాత బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వీధిబాలలకు విద్యాబుద్ధులు చెప్పించారు. శాంత సేవలను గుర్తించి 1999లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2003లో ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసేసే అవార్డును, అంతర్జాతీయ విద్యాసంస్థ ఆల్బర్ట్ శంకర్ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌కు చైర్‌ పర్సన్‌గానూ పనిచేశారు.

నేటి సమాజ అవసరాలకు తగిన విద్యను దేశంలోని బాలబాలికలందికీ అందించి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మన సమాజానిదేనని శాంతా సిన్హా తరచూ చెబుతుంటారు. మనందరికీ గర్వకారణమైన బాలల బంధువు.. శాంతా సిన్హాకు హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Tags

Related News

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

Big Stories

×