EPAPER

Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో.. బాహుబలి వ్యూహం?

Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో.. బాహుబలి వ్యూహం?

Russia VS Ukraine War Strategy:  ప్రస్తుతం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో స్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదు. అయితే, ఇది ముగింపుకు వచ్చే ముందు మరిన్ని ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా నియమ నిబంధనల మధ్య ఉక్రెయిన్ దూకుడుగా వ్యవహరించలేదు, అలాగని రష్యాను అడ్డుకోకుండా ఉండలేదు. ఇలాంటి వాతావరణంలో యుద్ధం తన రూపం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రహస్య వ్యూహాలతో రెండు దేశాలూ కొత్త ఆయుధాలను తయారుచేసుకుంటున్నారు. ఏది ఏమైనా గెలుపు తమదే అనే ధీమాలో ఇరు వర్గాలూ విశ్వాసంతో ఉన్నారు.


రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రెండు దేశాలూ యుద్ధ వ్యూహాలను పర్ఫెక్ట్‌గా అమలు చేస్తున్నాయి. అందుకే, ఈ యుద్ధం ఇంత కాలం సాగిందని చెప్పొచ్చు. అయితే, రష్యాకున్న సామర్థ్యాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. రష్యా పదేపదే ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటూ పోరాటం సాగిస్తోంది. ఉక్రెయిన్ పౌరులను చీకటిలోకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. గడ్డకట్టే శీతాకాలంలో హీటర్లు లేకుండా చేయడాన్ని రష్యా యుద్ధ ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. అందులో భాగంగానే, ఆగస్ట్ 26 తర్వాత, రష్యా ఉక్రెయిన్ పవర్ గ్రిడ్, రైలు మార్గాలు లక్ష్యంగా లాంగ్-రేంజ్ ఎయిర్, సీ-బేస్డ్ ఆయుధాలతో భారీ స్ట్రైక్స్ ప్రారంభించింది. ఇలాచేస్తూ, ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్‌లకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాకు అంతరాయం కలిగిస్తోంది. ప్రస్తుతం, రష్యా లక్ష్యాలు అన్నీ చేధించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది.

రష్యా ఒక్క రాత్రిలో ఉక్రెయిన్ అంతటా పవర్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకుని భారీ క్షిపణి, డ్రోన్ దాడులను మొదలుపెట్టిన తర్వాత… జెలెన్స్కీ తన పాశ్చాత్య భాగస్వాముల సహాయాన్ని త్వరగా అందివ్వాలని కోరారు. మిత్రదేశాల నిర్ణయాత్మక చర్యకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రష్యా డ్రోన్లు, క్షిపణులను నాశనం చేయడానికి ఉక్రెయిన్‌కు సహాయం చేయాలని యూరోపియన్ ఎయిర్ ఫోర్స్‌కు పిలుపునిచ్చారు. యూరోపియన్ ఎయిర్ ఫోర్స్ ఉక్రెయిన్ F-16లతో పాటు ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలతో కలిసి పనిచేస్తే ప్రజల ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉంటుందని జెలెన్స్కీ తెలిపారు. అయితే, ఈ ఐక్యత ముందుగా మిడిల్ ఈస్ట్‌లో నిరూపించబడితే, అది ఐరోపాలో కూడా పని చేయాల్సి ఉంటుంది. అందుకే, ఈ గ్యాప్‌లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర భాగస్వాములకు రష్యాను అరికట్టడంలో సహాయం చేయమని జెలెన్స్కీ పదపదే విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.


ఇక, ఎంతో కొంత రష్యాదే పైచేయిగా ఉన్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. తమకు మిత్రులుగా ఉన్న పాశ్చాత్య మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు భారీ మొత్తంలో సైనిక సామగ్రిని అందించినప్పటికీ.. వాటిని ఉపయోగించడానికి కఠినమైన షరతులు విధించారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తే… రష్యా మరింత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆందోళన వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. అందుకే, పాశ్చాత్య దేశాలు రష్యాలోని క్షిపణి, డ్రోన్ లాంచ్ సైట్‌లపై దాడి చేయడానికి ఉక్రెయిన్‌కు ఇచ్చిన ఆయుధాలను ఉపయోగించకూడదని నిషేధించాయి. అంటే, రష్యా దాడులను నిరోధించడానికి ఉక్రెయిన్ తన సొంత వైమానిక రక్షణపైనే ఎక్కువగా ఆధారపడవలసి ఉంది. అందుకే, ఆగస్ట్ 26 రష్యా స్ట్రైక్స్ తర్వాత, ఉక్రేనియన్ అధికారులు… రష్యా లోపలికి వెళ్లి దాడి చేయడానికి మిత్రదేశాలు అనుమతించాలని మరోసారి కోరారు.

ఇక, యుద్ధ భూమిలో ప్రస్తుత పరిస్థితిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తాజాగా ఉక్రేనియన్ నగరాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులను “దౌర్జన్యం” అని అభివర్ణించారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, అమెరికా అధ్యక్షుడు దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా ఎప్పటికీ విజయం సాధించదని… ఉక్రేనియన్ ప్రజల ఆత్మ ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు అని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా 50కి పైగా దేశాల కూటమికి అమెరికా నాయకత్వం వహిస్తుందని జో బైడెన్ తెలిపారు.”ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెప్పినట్లు, ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు తిరుగులేనిదిగా ఉంటుందని” బైడెన్ హామీ ఇచ్చారు. ఇక, నాటో కూటమి సభ్య దేశమైన పోలాండ్ భూభాగంలో రష్యా డ్రోన్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందనే వార్త వచ్చిన తర్వాత… రష్యా బాధ్యతారాహిత్య దాడులను నాటో ఖండిస్తుదంటూ ప్రకటన విడుదలయ్యింది. నాటో మిత్రదేశాలపై రష్యా ఉద్దేశపూర్వక దాడిని సూచించే సమాచారం లేనప్పటికీ, ఈ చర్యలు ప్రమాదకరమైనవంటూ నాటో సున్నితంగా హెచ్చరించింది.

Also Read: కెనెడాలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు.. భయం గుప్పిట్లో 70 వేల విదేశీ విద్యార్థులు!

ఇలాంటి పరిస్థితుల మధ్య ఉక్రెయిన్‌‌లో రష్యాకు చెందిన ఆర్థోడాక్స్ చర్చి శాఖను నిషేధించారు. ఇలా చేసిన ఉక్రేనియన్ ఎత్తుగడలను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది క్రైస్తవ మతంపై దాడి అని, మత స్వేచ్ఛకు తీరని దెబ్బ అని రష్యా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ దాని నిజ స్వరూపాన్ని చూపిస్తుందంటూ రష్యా మతం మార్గంలో కొత్త వ్యూహానికి తెరలేపింది. ఆర్థోడాక్స్ చర్చిని నిషేధించడం మత స్వేచ్ఛపై బహిరంగ దాడిగా పేర్కొంది. మొత్తం ఆర్థోడాక్స్ చర్చిపైన దాడి అని, క్రైస్తవ మతంపై దాడి అని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రష్యాతో అనుసంధానించబడిన ఉక్రేనియన్ ఆర్థోడాక్స్ చర్చ్‌ని నిషేధించడానికి ఉక్రేనియన్ చట్టసభ సభ్యులు గత వారం ఓటు వేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

అయితే, చర్చిని నిషేధించే దిశగా పడిన ఓటును ఉక్రెయిన్ “ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం” బలోపేతం చేయడానికి ఒక అడుగు అని ప్రశంసించడంతో.. దీన్నిరష్యా అవకాశంగా మార్చుకుంది. ఇది క్రైస్తవ మతంపై జరుగుతున్న దాడిగా పేర్కొంది. అయితే, ఇలా ప్రచారం చేయడం, గూఢచారులకు ఆశ్రయం కల్పించడం ద్వారా రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇక, ఉక్రేనియన్లలో ఎక్కువ మంది ఆర్థడాక్స్ క్రైస్తవులు కాగా.. స్వతంత్రంగా నడిచే ఆర్థోడాక్స్ చర్చ్ ఆఫ్ ఉక్రెయిన్ మధ్య చీలిక ఎప్పటి నుండో ఉంది. దీనిని 2019లో ప్రపంచ ఆర్థోడాక్స్ ఇండెక్స్ కూడా గుర్తించింది. అయితే, రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఉక్రెయిన్ ఆర్థోడాక్స్ చర్చ్ రష్యా నుండి దూరం కావడం ప్రారంభించింది. ఈ సంస్థకు విదేశాల్లోని ఇతర ఆర్థోడాక్స్ చర్చ్ శాఖలతో సంబంధాలు లేవని తిరస్కరించింది. అటు, రష్యా కూడా తమ దేశంలోని ఆర్థోడాక్స్ చర్చ్ పెద్దలు కొందరిపై నేరారోపణ వేసి, దర్యాప్తు చేస్తోంది. ఈ వాతావరణంలో యుద్ధంలో వ్యూహాత్మక ఎత్తులు పైఎత్తులు అంతర్జాతీయంగా విభజన రాజకీయాలకు తావిస్తున్నట్లు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఎదుర్కోవడానికి అత్యంత రహస్య ఆయుధంగా ఒక వ్యవస్థ నడుస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం… ఉక్రేనియన్ పౌరులతో ఒక రహస్య నెట్‌వర్క్ రష్యా కేంద్రంగా రహస్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గ్రూపు రష్యన్ లైన్ల వెనుక జీవిస్తూ… పోరాటం చేస్తుందని అనుకుంటున్నారు. ఉక్రేనియన్ ప్రత్యేక దళాలచే నిర్వహించబడుతున్న ఈ ప్రతిఘటన ఉద్యమం నానాటికీ పెరుగుతోందని దానికి సంబంధిచిన ఓ కమాండర్ చెప్పినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇందులో పెద్దలు, యువకులు, మగ, ఆడ, ఉక్రెయిన్‌కు విధేయులుగా ఉన్న ఎవరైనా చేరవచ్చంటూ ఆహ్వానం అందుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే దిశగా వెళుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, ఈ ముగింపు ఎవరికి విజయం అందిస్తుంది అనేది ప్రస్తుతం ప్రశ్నగానే ఉంది. అయితే, రష్యా మాత్రం దీనిపై ఒక స్పష్టతను ఇప్పటికే ఇచ్చేసింది. రష్యాకు ఓటమంటూ ఖాయమైతే అది యూరప్, అమెరికాల విధ్వంసానికి పాదులు వేసినట్లేనని వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిస్థితుల మధ్య భవిష్యత్‌లో యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో అనే ఆందోళన మాత్రం అందిరిలోనూ ఉంది.

Related News

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

Kakani Vs Somireddy: కాకాణి VS సోమిరెడ్డి‌.. రూ.100 కోట్ల లొల్లి

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Big Stories

×