EPAPER
Kirrak Couples Episode 1

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

Russia Vs Ukraine War: ఇంతకీ, రష్యాను అంత కోపానికి గురిచేసిన ఉక్రెయిన్ చర్యలేంటీ..? పాశ్చాత్య దేశాల పర్మిషన్ తీసుకొని రష్యాపై దాడికి వాడాలనుకుంటున్న ఆ మిస్సైల్ కెపాసిటీ ఏంటీ..? అసలు, రష్యా అణ్వాయుధ వినియోగానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఒప్పుకుంటాయా..? ఒకవేళ రష్యా అణుయుద్ధానికి దిగితే.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ముందున్న కర్తవ్యం ఏంటీ..?


అణు దాడి దిశగా రష్యా అడుగులు

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి గల దేశంగా ఉంది. నిజానికి, ప్రపంచంలోని 88% అణ్వాయుధాల రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. అయితే, ప్రతి దేశానికీ దాని సొంత అణు సిద్ధాంతాలు ఉన్నాయి. అలాగే, అంతర్జాతీయ అణు సిద్ధాంతాలకు లోబడి కూడా వాటి వాటి అణు సిద్ధాంతాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ఆయా దేశాల మధ్య కూడా అణ్వాయుధ అమలకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధానికి నాలుగేళ్ల ముందు పుతిన్ ఆధ్వర్యంలో రష్యా తన అణు సిద్ధాంతాన్ని రూపొందించింది. ఈ ప్రస్తుత సిద్ధాంతం ప్రకారం, రష్యా ఏ దేశం నుండి అయినా అణుదాడికి గురైనప్పుడు, లేదంటే, సాంప్రదాయిక దాడి వల్ల రష్యా ఉనికికి ముప్పు ఏర్పడినప్పుడు రష్యా తన అణ్వాయుధాలను ఉపయోగించవచ్చు. కానీ, ఈ భారీ అణు ఆయుధాగారంపై ప్రాథమిక నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం రష్యా అధ్యక్షుడు, అంటే వ్లాదిమర్ పుతిన్‌కు మాత్రమే ఉంటుంది. ఇక, ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా అణుసిద్ధాతంలో కీలక సవరణ ఒకటి చేర్చారు. అణుశక్తి లేని ఏదైనా దేశం, అణ్వాయుధాలు గల దేశ సహకారంతో రష్యాపై దాడి చేసినా.. దాన్ని రెండు దేశాలు కలసి రష్యాపై దాడి చేసినట్లే పరిగణిస్తారు. అంటే, ఈ రెండు దేశాలపై కూడా రష్యా అణుదాడి చేయొచ్చనే కొత్త సవరణలు తీసుకొచ్చారు.


రష్యా అత్యున్నత అధికారులతో పుతిన్ సీక్రేట్ సమావేశం

నిజానికి, యునైటెడ్ స్టేట్స్, రష్యాలు యుఎస్-రష్యా న్యూ స్టార్ట్ ట్రీటీ అని పిలిచే అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఇది 2011 ఫిబ్రవరి 5 నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, యునైటెడ్ స్టేట్స్, రష్యన్ ఫెడరేషన్ వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాలపై చేసుకున్న ఒడంబడిక పరిమితులు 2018, ఫిబ్రవరి 5తో ముగిసింది. ఈ ఒప్పందం అమలులో ఉన్నంత కాలం ఆ పరిమితులను రష్యా, అమెరికాలు కొనసాగించాయి. తర్వాత, ఈ ఒప్పందాన్ని 2026 ఫిబ్రవరి 4 వరకూ పొడిగించడానికి రెండు దేశాలూ అంగీకరించాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఈ ఒప్పందం రష్యా గతంలో మోహరించిన అన్ని ఖండాంతర-శ్రేణి అణ్వాయుధాలపై పరిమితులను ఉంచింది. అయితే, 2026లో గడువు ముగిసే లోపు, అమెరికా-రష్యా కొత్త START ట్రీటీకి ప్రత్యామ్నాయం గురించి చర్చలు జరగాల్సి ఉంది. కానీ, యూరోపియన్ అణు సామర్థ్యాన్ని, అంటే.. బ్రిటన్, ఫ్రాన్స్‌ల దగ్గరున్న ఆయుధాలను కూడా పరిగణనలోకి తీసుకోని తర్వాత ఒప్పందం చేసుకోవాలని రష్యా మెలిక పెట్టింది. అయితే, దీనికి సంబంధించి అమెరికా నుండి రష్యాకు ఎలాంటి స్పందనా రాలేదు. కాగా, పుతిన్ తాజా రహస్య మీటింగ్‌లో చేసిన సవరణతో భవిష్యత్ START ట్రీటీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది.

రష్యాపై దాడి కోసం ఉక్రెయిన్ ‘స్టార్మ్ షాడో’ వినియోగం

ఉక్రెయిన్ రష్యాపై దాడి చేయడానికి స్టార్మ్ షాడో క్రూయిజ్ మిస్సైల్‌ను వాడాలనుకోవడమే పుతిన్ కఠిన నిర్ణయానికి కారణం అయ్యిందా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి అవుననే చెప్పాలి. ఎందుకంటే, ఈ మిస్సైల్ సామర్థ్యం అలాంటిది. ఈ స్టోర్మ్ షాడో ఆయుధం నిఘాకు అంత తేలికగా అందేది కాదు. ఇది లో-అబ్జర్వ్‌బుల్, లాంగ్-రేంజ్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్ మిస్సైల్. దీన్ని యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దాదాపు 250 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల సత్తా ఉన్నా ఆయుధం. ఇది ఇప్పటికే ఉక్రేనియన్ యుద్ధ విమానంలో సెటప్ చేశారు. ఇక, 1994లో మాత్రా, బ్రిటిష్ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన స్టోర్మ్ షాడో క్షిపణిని MBDA సిస్టమ్స్ తయారు చేసింది. ఉక్రెయిన్ రష్యాపై చేయాలనుకునే దాడుల్లో ఇది బలమైన ప్రభావాన్ని చూపించే ఆయుధం. 500 కిలోల పేలోడ్ సామర్థ్యంతో పరిమితికి మించిన పరిధిని ఛేదించగల సత్తా ఉన్న క్షిపణి. నిజానికి, ఇది MTCR నిబంధనలను ఉల్లంఘిస్తుంది. అయినప్పటికీ, ఉక్రెయిన్ రష్యాపై దీన్ని ప్రయోగించడానికి సిద్ధపడింది. ఈ ఆయుధంతో రష్యాపై దాడికి దిగితే అది రష్యాలో తీవ్రమైన నష్టానికి కారణం అవుతుంది. అందుకే, ఇప్పుడు రష్యా కఠినమైన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వార్ ఫ్లైట్ నుండి ప్రయోగించే ఈ స్టోర్మ్ షోడో క్షిపణి, ధ్వని వేగానికి దాదాపు సమానమైన వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని అధిక పేలుడు వార్‌హెడ్‌ తీవ్రమైన నష్టాన్ని కలుగుజేస్తుంది. యుద్ధంలో రష్యా ఉపయోగించే బలమైన బంకర్‌లు, ఆయుధగారాల్లోకి చొచ్చుకుపోవడానికి తుఫాను కంటే వేగంగా ఈ షాడో మిస్సైల్ వెళుతుంది. అందుకే, ఉక్రెయిన్ దీన్ని కీలక ఆయుధంగా పరిగణిస్తుంది. అయితే, ఒక్క స్టోర్మ్ షాడో ధర దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఉంటుంది. శత్రువుల వాయు రక్షణను అయోమయానికి గురిచేయడానికి, నిర్వీర్యం చేయడానికి ప్రయోగించే తక్కువ ఖర్చు డ్రోన్‌లతో పాటు స్టోర్మ్ షోడో రష్యాలోని కీలక స్థావరాలపై దాడి చేయడానికి ఉపయోగించాలని అనుకుంటుంది. అయితే, ఇది మొత్తం రష్యా నౌకాదళానికి పెద్ద ప్రమాదంగానే చెప్పాలి. ఇంత ప్రమాదకరమైన ఆయుధం కాబట్టే కొన్నాళ్లుగా దీన్ని వినియోగించడానికి ఉక్రెయిన్ తీవ్రంగా లాబీయింగ్ చేస్తోంది.

పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అనుమతి ఇస్తే…

అయితే, ఉక్రెయిన్ కోరికను తీర్చడంతో పాటు ఉక్రెయిన్‌కు మొదటి నుండీ అండగా ఉంటున్న అమెరికా, నాటోలు ఇప్పుడు వెనకడుగు వేయలేని పరిస్థితి ఉంది. ఇది గెలుపోటముల మధ్య ఉన్న పెద్ద అగాధాన్ని దాటాల్సిన సమయం కూడా. అందుకే, ఈ యుద్ధంలో రష్యా విజయం, గెలుపులు ఒక విషయంపై ఆధారపడి ఉంటాయి. ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి నాటో భాగస్వామ్య దేశాలు సిద్ధంగా ఉండి, ఏకతాటిపై వచ్చే నిర్ణయాలు తీసుకుంటే… ఉక్రెయిన్ మైదానంలో నాటో విజయంగా చెప్పుకునే అవకాశం ఉంది. అలా కాకుండా నాటో దేశాలు ఒకొక్కటిగా వెనకడుగు వేస్తే.. అది ఉక్రెయిన్‌ ఓటమి కాదు.. నాటో వైఫల్యం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే, తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా, నాటో కూటమి లోపల భయమున్న బయటకు పోరాట పటిమను చూపించాల్సి వస్తుంది. దాని కోసం, రష్యాను కూడా భయపెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే, రష్యా అణు దాడి చేయకముందే అమెరికా, నాటోలు కీలక నిర్ణయం ఏదో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఈ నిర్ణయం ఎంత త్వరగా జరిగితే ప్రపంచానికి అంత మంచి జరుగుతుందనేది నిజం. ఈ లోపు, ఉక్రెయిన్ స్టార్మ్ షాడో మిస్సైల్‌ను వాడకుండా బుజ్జగించాలి.

అమెరికా, నాటోల కట్టడికి రష్యా కఠిన వ్యూహాలు

అయితే, సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో చాలా నష్టపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ ఇప్పటికే సహనం కోల్పోయాడు. సెప్టెంబర్ 24న జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇదే విషయాన్ని కక్కేశాడు. ఉక్రెయిన్‌కు సహాయం చేయాలనుకునే ఏ దేశమైనా రష్యాను బలవంతంగా శాంతికి ఒప్పించాల్సిందేనని చెప్పాడు. ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకొని, తమ పవర్‌ను ప్రదర్శించాలని అనుకున్నా.. లేదంటే, నోబుల్ శాంతి బహుమతి తీసుకోవాలనుకున్నా దానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదనీ ఉక్రెయిన్ రష్యా ఆధీనంలోకి వెళ్లే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశాడు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించే శాంతి ఒప్పందం తప్ప ఇంకెలాంటి మధ్యవర్తిత్వం ఉపయోగపడది అన్నాడు. అయితే, దీనిపై రష్యా కూడా ఘాటుగానే స్పందించింది. బలవంతంగా రష్యాను శాంతి ఒప్పందానికి ఒప్పించే ధైర్యం ఎవ్వరూ చేయవద్దని హెచ్చరించింది. ఆ పరిస్థితే వస్తే.. పరిణామాలు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి, క్లిష్ట పరిస్థితుల మధ్య ఇప్పుడు రష్యా అణుదాడికి సంబంధించిన ప్లాన్ అందర్నీ భయానికి గురిచేస్తుంది. ఇక, పుతిన్ వేసే అడుగు అమెరికా నాటో దేశాలను భయపెట్టడం వరకూ ఓకే గానీ.. దానికి మించిన నిర్ణయం అయితే మాత్రం దానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధానికి అధికారిక సైరన్ మోగినట్లే అవుతుంది.

Related News

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

Big Stories

×