EPAPER

Ratan Tata: తరతరాల నుంచి టాటా అంటే ఇదే…

Ratan Tata: తరతరాల నుంచి టాటా అంటే ఇదే…

Ratan Tata: ప్రపంచవ్యాప్తంగా పేరున్న టాటా సంస్థలను గతంలో ఎవరూ సాధించనంత గొప్ప విజయాలకు చేరువ చేసిన రతన్ టాటా బుధవారం 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అసాధారణ వ్యక్తిత్వం, పని పట్ల అంకితభావం, తెగువ, సమాజం పట్ల సంవేదనాశీలత గల వ్యక్తిగా రతన్ టాటా మూడు తరాల భారతీయుల మనసును గెలుచుకున్నారు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సూనూ టాటా దంపతులకు జన్మించారు. ముంబైలో పాఠశాల విద్య, అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చేరి అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు.


Also Read: కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

అనంతరం ఆయన జేఆర్‌డీ టాటా సలహా మేరకు 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో చేరారు. 1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా నియమితులై ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లోని 100 దేశాల్లో టాటా గ్రూపు కంపెనీలకు నేతృత్వం వహించారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో టాటా గ్రూపులో ఉన్న కంపెనీల సంఖ్యను వందకు పైగా పెంచారు. ఆయన హయాంలో గ్రూప్‌ ఆదాయం 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగింది. తన హయాంలోనే ఆంగ్లో-డచ్ స్టీల్‌ తయారీ సంస్థ కోరస్, బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీ టెట్లీ వంటి సంస్థలను టాటా గ్రూప్ టేకోవర్‌ చేసింది. ఉక్కు నుంచి ఉప్పు వరకు ఉన్న టాటా గ్రూపు కంపెనీలలో సుమారు 6,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2017 జనవరి 12న నటరాజన్‌ చంద్రశేఖరన్‌ను గ్రూప్‌ ప్రధాన సంస్థ టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి రతన్‌ టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా వ్యాపారంలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. వ్యక్తిగత హోదాలో 30 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. అందులో ఓలా ఎలక్ట్రిక్, పేటీఎం, స్నాప్‌డీల్, లెన్స్‌కార్ట్, జివామే వంటివి ఉన్నాయి.


ఒక విజయవంతమైన వ్యాపార వేత్తగా ఆయన పేరు పొందారో, అంతకంటే మనసున్న మనిషిగా ఎక్కువ గుర్తింపు పొందారు. అప్పటికే ఉన్న టాటా ట్రస్ట్ సేవలను మరింత విస్తరింపజేశారు. మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్‌లు అందించే ఏర్పాట్లు చేశారు. ముంబైలోని తమ తాజ్ హోటల్‌ మీద జరిగిన ఉగ్రదాడిలో గాయపడిన, చనిపోయిన వారి కుటుంబాలకు రతన్‌టాటా ప్రత్యేక సేవలు అందించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకు రూ.300 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్‌లో ఒక భవనానికి గౌరవంగా ‘టాటా హాల్’ అని పేరు పెట్టింది. ఒక ఏడాది దీపావళి రోజు.. కేన్సర్ రోగులచికిత్సకు ఏకంగా రూ.1000 కోట్లు దానం చేశారు. భారత్‌లో కొవిడ్ మహమ్మారి వ్యాపించినపుడు రతన్ టాటా అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి రూ.500 కోట్లు, టాటా కంపెనీల నుంచి రూ.1000 కోట్లు విరాళం ప్రకటించటమే గాక ఆ సమయంలో వైద్యం చేస్తున్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది తమ లగ్జరీ హోటళ్లను ఉచితంగా వాడుకోవచ్చని ప్రకటించారు.

కుక్కలు వంటి మూగ జీవాలపై రతన్ అమితమైన ప్రేమను చూపించేవారు. ఎంతగా అంటే.. 2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రతన్ టాటా దాతృత్వానికి సంబంధించిన ‘రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును ఇవ్వాల్సి ఉంది. అయితే, తన పెంపుడు కుక్క టీటోకు అనుకోకుండా జబ్బుచేసినందున తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానంటూ రతన్ టాటా ప్రిన్స్ ఛార్లెస్‌కు కబురుచేశారు. ఆ సమాచారం వినగానే చార్లెస్‌ ‘దట్స్ ఎ మ్యాన్. దట్ ఈజ్ ద మ్యాన్ రతన్ ఈజ్’ అని ప్రశంసించారట. టాటా హోటళ్ల ఆవరణలో వీధికుక్కలను కొట్టటం, తరమటం కుదరదని చెప్పటమే గాక వాటికి మెరుగైన తిండి, వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు.

Also Read: కాశ్మీర్‌లో ఓటమి.. బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. 2023లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో ఆ దేశం రతన్ టాటాను గౌరవించింది. 2011లో ఎకనమిస్ట్ మ్యాగజైన్ ఆయన జీవితంపై ప్రత్యేక కథనాన్ని వేయటమేగాక ఆయనను ‘టైటాన్‌’‌గా అభివర్ణించింది. ఒక కుటుంబ వ్యాపారాన్ని.. ప్రపంచపు ఆర్థిక శక్తిగా నిలిపారని కొనియాడింది. ఈ అవార్డులన్నింటి కంటే ఆయన సాధించిన మరో గొప్ప విజయం మరొకటి ఉంది. తరతరాల నుంచి టాటా అంటే ‘విలువలు పాటించే ఒక బ్రాండ్’ అనే నమ్మకాన్ని తన కాలంలో పదింతలు పెంచిన వ్యాపారవేత్తగా రతన్ టాటా గుర్తింపు పొందారు. సంపన్నుల జాబితాలో ఏనాడూ ఒకటో స్థానంలో లేని రతన్ టాటా మంచితనంలో తనను మించిన కుబేరుడు లేడని నిరూపించుకున్నారు. ఆయనకు ఇదే అశ్రునివాళి.

– నెక్కంటి అంత్రివేది

Related News

KCR – Kavitha: కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

Roja vs Syamala: రోజా ఏమయ్యారు? మీడియా ముందుకు రాలేక.. రికార్డెడ్ వీడియోలు, ఉనికి కోసం పాట్లు?

Jammu and Kashmir: కాశ్మీర్‌లో ఓటమి.. బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Discrimination: జైళ్లను కూడా వదలని కుల వివక్ష

world mental health day: ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలున్నవారిలో.. భారత్‌లోనే అధికమంటా!

Big Stories

×