EPAPER

Domestic Violence Act: గృహహింస చట్టానికి తూట్లు..

Domestic Violence Act: గృహహింస చట్టానికి తూట్లు..

Domestic Violence Act: మన సమాజంలో కుటుంబవ్యవస్థకు చాలా గౌరవప్రదమైన స్థానం ఉంది. అయితే, కాలంతో బాటు వచ్చిన మార్పులతో ఉమ్మడి కుటుంబాల స్థానంలో న్యూక్లియర్‌ కుటుంబాలు పెరిగిపోయాయి. వాస్తవానికి ఉమ్మడి కుటుంబాలలో మహిళలు అనేక రకాల ఆంక్షలను, అడ్డంకులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎదుర్కొనేవారు. కుటుంబ పెద్దల మాట చెల్లుబాటయ్యే ఈ కుటుంబాలలో మహిళల అభిప్రాయాలకు విలువ లేకపోగా, కనీస స్వేచ్ఛకూ అవకాశం ఉండేది కాదు. పైగా, వారి మీద వివిధ స్థాయిల్లో హింస అమలవుతుండేది. పెళ్ళయి, పుట్టింటి నుంచి అత్తింటికి అడుగుపెట్టిన కోడలికి ఆరళ్ళు స్వాగతం చెప్పేవి. ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ, ఇంటి గుట్టు బయట పెట్టకూడదనే తీవ్రమైన ఒత్తిడి మహిళల మీద ఉండేది.


కోడళ్లు తమ బాధను మౌనంగా భరించాలనే వాతావరణం, ఇంట్లో జరిగేవన్నీ వ్యక్తిగతమైనవని, భార్యని దండించే హక్కు భర్తకున్నదనే ధోరణులు సర్వసామాన్యమైన విషయాలు. ఇదే మాటలను అటు పుట్టింటి వారూ ఆడపిల్ల అత్తింటికి వెళ్ళేముందు చెప్పటం ఒక సంప్రదాయంగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చి, కుటుంబ హింసను నేరంగా గుర్తించాలని, దీనికోసం ఒక చట్టం అవసరమని దేశవ్యాప్తంగా పలు మహిళా సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి గృహహింసని నేరంగా గుర్తించి గృహ హింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. పద్దెనిమిదేళ్ళలోపు పిల్లలు, మహిళలు తమకు ఇబ్బందులు ఎదురైతే, ఈ చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం 2006, అక్టోబరు 26 నుంచి అమల్లోకి వచ్చింది. గత పద్దెనిమిదేళ్లుగా ఈ చట్టం అమల్లో ఉన్నప్పటకీ దేశంలోని కుటుంబాలలో మహిళలపై హింస తగ్గకపోవటం విచారకరం.

వాస్తవానికి ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వారిని దండించటం గాక బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక మహిళ కుటుంబంలోని పురుషులు (భర్త/బావ/మరిది/అన్నదమ్ములు/మామ/కొడుకు/అల్లుడు/తండ్రి) జరిపే ఎటువంటి హింసనుంచైనా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. పేరుకు ఇది ఒక సివిల్‌ చట్టమైనా, దీని అమలు బాధ్యత నేర న్యాయవ్యవస్థకు అప్పగించటం జరిగింది. వైవాహిక బంధంలోని సున్నితత్వాన్ని అర్థం చేసుకుని, పోలీస్‌ పాత్ర పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్‌ కుటుంబ పెద్దగా ఆ భర్తకు / మగవారికి సంబంధించిన తప్పును ఎత్తిచూపి సరిదిద్దుకోమని సూచించి, భార్యా పిల్లల్ని, తల్లిని / స్త్రీని సరిగ్గా చూసుకోమని ఆజ్ఞాపించటం, ఒకవేళ ఆ ఉత్తర్వులు అమలు జరగని పక్షంలో ఆ ధిక్కారాన్ని మాత్రమూ నేరంగా పరిగణించి శిక్షించే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది.


మహిళలకు రక్షణ కల్పించే ఈ చట్టం-2005 ఒక పౌరస్మృతి వంటిదని, దీనికి మతంతోగానీ, సామాజిక నేపథ్యంతో గానీ సంబంధం లేకుండా దేశంలోని మహిళందరికీ ఇది వర్తిసుందని గత సెప్టెంబరు 27న సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ మహిళ భరణం, పరిహారానికి సంబంధించిన కేసులో తీర్పునిస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘గృహహింసకు గురయ్యే మహిళాబాధితులను రక్షించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈ చట్టం రక్షిస్తోంది. మతంతో, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా పౌరస్మృతిలో భాగమైన ఈ చట్టం దేశంలోని మహిళలందరికీ వర్తిస్తుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి అతని వల్ల హింసకు గురికావటాన్ని కుటుంబహింసగా ఈ చట్టం నిర్వచించింది. శారీరక హింస (శరీరానికి నొప్పి, హాని, గాయం చెయ్యడం, ప్రాణాలకు హాని తలపెట్టడం, కొట్టడం, తన్నడం, నెట్టడం), లైంగిక హింస (బలవంతంగా సంభోగానికి ప్రయత్నించడం, ఆమెకు ఇష్టం లేకుండా లైంగిక సంబంధానికి బలవంతపెట్టడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్యలు), ఆర్థిక హింస (కుటుంబ నిర్వహణకు భర్త డబ్బు ఇవ్వకపోవటం, చట్టప్రకారం హక్కుగా మహిళకున్న ఆర్థిక వనరులను లాక్కోవటం, స్త్రీ ధనం దక్కకుండా చెయ్యడం, ఇంటి అద్దె చెల్లించకపోవడం, ఇంట్లోనుంచి గెంటేయటం, అదనపు కట్నం కోసం హింసించటం), మానసిక హింస (అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయడం, చిన్న బుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగపిల్లాడిని కనలేదని వేధించడం, బాధితురాలి కుటుంబంలోని వారికి కీడు తలపెడతామని బెదిరించటం) వంటివాటన్నింటికీ ఈ చట్టం ఒక పరిష్కారంగా సూచించారు.

ఎవరైనా భార్యను హింసించినా, వేధించినట్లు ఫిర్యాదు నమోదైతే, పోలీసులు 498/ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారు. ఈ అభియోగం రుజువైతే 6 నెలల నుంచి 3 ఏండ్ల జైలుశిక్ష పడుతుంది. ఇది బెయిలబుల్‌, కంపౌండబుల్‌ కేసు. తనను వేధించటంతో భర్తకు సహకరించిన అత్త, ఆడపడుచులందరికీ ఈ సెక్షన్ వర్తి్స్తుంది. అయితే దీనికి వరకట్నం వేధింపులు తోడైతే డౌరీ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ చాలా కఠినంగా ఉంటుంది. డౌరీ, ప్రొహిబిషన్‌ యాక్ట్‌ నమోదైతే అది నాన్‌ కంపౌండబుల్‌ కేసుగా పరిగణిస్తారు. ఈ కేసులో రాజీ కుదరదు. కోర్టు విచారణ జరగాల్సిందే.

దేశవ్యాప్తంగా నమోదైన గృహహింస కేసులు చూస్తే, అసోం 75 శాతం కేసులతో తొలిస్థానంలో ఉండగా, 50.4 శాతం కేసులతో తెలంగాణ రెండవ స్థానంలో, 48.9%తో ఢిల్లీ మూడవ స్థానంలో నిలిచాయి. ఇదిలా ఉండగా, ఐపిసి 498ఏ చట్టం దుర్వినియోగం గురించి మరోవైపు చర్చ జరుగుతోంది. కావాలనే భర్తల మీద తప్పుడు కేసులు వేస్తున్నారని, మనోవర్తి భారీగా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు, సెక్షన్ 498 ఏ పదేపదే దుర్వినియోగం అవుతోందని గతంలో 7 కేసుల్లో వివిధ హైకోర్టులు విచారం వ్యక్తం చేశాయి. 498 ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా మహిళలు ‘లీగల్ టెర్రర్’ సృష్టిస్తున్నారని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. మరోవైపు, దేశవ్యాప్తంగా పలు భార్యాబాధిత సంఘాలు దీనిపై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు.

ఇన్ని ఆరోపణల మధ్య ఈ చట్టం మూలంగా శిక్ష పడిన వారి సంఖ్యను చూస్తే, ఈ సెక్షను మీద వస్తున్న ఆరోపణల్లో చెబుతున్నంత తీవ్రత లేదని, ఐపిసి 498ఏ కోరలు పీకేందుకే ఈ వాదనను తెరమీదికి తెస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహిళలు దీనిని దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడేవారు, దేశంలోని మహిళలు గృహహింసను అనుభవించటం లేదని చెప్పగలరా? ఈ చట్టం దుర్వినియోగమవుతోందని వాపోయేవారు ప్రపంచంలో మనిషి దుర్వినియోగం చేయని ఒక్క చట్టం పేరైనా చెప్పగలరా? అంటే జవాబు రాదు. మరో విషాదమేమిటంటే జండర్‌ స్పృహ’తో అమలులోకి తెచ్చిన ఈ చట్టం ‘జండర్ సృహ’ లేని వ్యవస్థలు, వ్యక్తుల కారణంగానే ఈ చట్టం దారుణంగా నిర్వీర్యం కావటం. అందుకే కేవలం చట్టాలు చేయడం మూలంగానే సమాజంలో ఏ మార్పు రాదు. అందుకే, మన సమాజంలో మహిళల పట్ల పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రానంత వరకు ఈ చట్టం అవసరం ఎంతైనా ఉంది.

– ఇందు కిరణ్, జర్నలిస్ట్

Related News

US Election 2024: క్లైమాక్స్‌లో అమెరికా ఎన్నికలు.. ఆ పార్టీ గెలిస్తేనే భారత్‌కు మేలు..!

Nellore Politics: సై అంటే సై.. నెల్లూరు మంత్రుల మధ్య ఇసుక దుమారం

Mekathoti Sucharitha: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

YS Jagan: చిలకా ఏ తోడు లేకా బెంగళూరు వైపు ఒంటరి నడక..?

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Big Stories

×