Big Stories

TDP Janasena: పొత్తు సరే.. మరి, సీట్లు? సీఎం పోస్టు?

TDP Janasena: ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి చీలనీయబోనంటూ పదే పదే చెబుతున్నారు జనసేనాని. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యారు. కానీ, పొత్తల గురించి మాత్రం చర్చించలేదని చెబుతున్నారు. వాళ్లిద్దరూ కలిసిన ఆ రెండు సందర్భాలు దాదాపు ఒకలాంటివే కావడంతో.. నిజంగానే పొత్తుల గురించి చర్చ జరిగుండే అవకాశం తక్కువే అంటున్నారు. చర్చలు జరగకున్నా.. పొత్తు మాత్రం పక్కా.. అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరుగుతోంది. పవన్ మాటలే ఆ ప్రచారానికి మూలం. మరి, ఇప్పటికే జనసేనతో జట్టు కట్టిన బీజేపీ సంగతి ఏంటనేదే కీలకాంశం. బీజేపీ వల్లే ఇంకా పొత్తు పొద్దు పొడవడం లేదనే అనుమానం. ఇలా.. కొంతకాలంగా ఏపీ రాజకీయం టీడీపీ-జనసేనల పొత్తు చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ నేతలు మాటలతో ఎంత కవ్విస్తున్నా.. పవన్ మాత్రం ఆ మాటమీదే నిలబడుతున్నారు.

- Advertisement -

అయితే, అంతా అనుకుంటున్నట్టు టీడీపీ, జనసేనల సంధికి ప్రధాన ఆటంకం బీజేపీ నుంచి కాదని తెలుస్తోంది. సీట్ల పంపకాల్లో ఇరువురికీ క్లారిటీ లేకపోవడమే ఆలస్యానికి కారణం అని చెబుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. పవన్ కల్యాణే టీడీపీతో పొత్తు దిశగా పదే పదే సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి మాత్రం ఆ మాటే రావట్లే.

- Advertisement -

పవన్ కారణాలు పవన్ కు ఉండొచ్చు. ఎలాగైనా జగన్ ను గద్దె దింపాలనేదే ఆయన టార్గెట్. అందుకే, చంద్రబాబుకు స్నేహహస్తం చాస్తున్నారు. కానీ, ఆ చేతిని అందుకోవడానికి టీడీపీ అధినేత సంసయిస్తున్నారని తెలుస్తోంది. అందుకు కారణం.. సీట్ల పంపకాలే.

జనసేన లేకుండా టీడీపీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. సేమ్ టు సేమ్, టీడీపీ లేకుండా జనసేన సైతం అధికారంలోకి రాలేదు. మరి, బలమైన వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ రెండు పార్టీలు జతకట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఒకసారి పొత్తు ఓకే అనుకున్నాక, ఆ తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు అనే దగ్గర పేచీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

మొత్తం 175 సీట్లు. సగం సగం పంచుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. మెజార్టీ సీట్లు టీడీపీ కావాలంటుంది. పవన్ సైతం తన బలాన్నిచూపించి.. తనకు మెరుగైన స్థానాలు ఇవ్వాలంటారు. టీడీపీకి 100, జనసేనకు 75 రావొచ్చు. లేదంటే, టీడీపీకి 125, జనసేనకు 50..ఇలాగైనా ఉండొచ్చు. అంతకంటే తక్కువకు జనసేనాని ఒప్పుకోకపోవచ్చు.

ఇలానే డీల్ కుదిరితే.. టీడీపీ జనసేన కూటమి గెలిస్తే.. మరి, సీఎం అయ్యేది ఎవరు? చంద్రబాబా? పవన్ కల్యాణా? ఇది మరింత ఆసక్తికర అంశం. కూటమిని లీడ్ చేసే చంద్రబాబు మరొకరికి ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తారని అనుకోలేం. పవన్ సైతం ముఖ్యమంత్రి కుర్చీని అంత తేలిగ్గా వదులుకునే రకం కాదంటున్నారు. ఇప్పటికే అనేక ప్రసంగాల్లో ఓటర్లు దయతలిస్తే.. తాను సీఎంను అవుతానంటూ అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయనకు తాను సీఎం కావాలనే సంకల్పం బలంగా ఉంది. ఫ్యాన్స్ సైతం పవన్ కనిపించగానే.. సీఎం..సీఎం..అంటూ నినాదాలు చేస్తుంటారు. మరి, పవన్ కోరుకుంటున్నారని చంద్రబాబు సీఎం కుర్చీని వదులుకుంటారా? కష్టమే.

మధ్యే మార్గంగా.. ఓ ఆప్షన్ ఉండొచ్చు. మొదటి రెండున్నరేళ్లు ఒకరు.. ఇంకో రెండున్నరేళ్లు ఇంకొకరు. ఇలా పదవీకాలాన్ని పంచుకునే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఇంకో చిక్కు. మరి, మొదటి టర్మ్ సీఎంగా ఎవరుండాలనేది కీలకం అవుతుంది. సీనియర్ ను కాబట్టి తానే మొదట సీఎం అవుతానని చంద్రబాబు పట్టుబట్టొచ్చు. స్వతహాగా ఉదార స్వభావమున్న పవన్ కల్యాణ్ సైతం అందుకు ఓకే చెప్పొచ్చు. రెండో అర్థభాగంలోనే ముఖ్యమంత్రి పీఠంపై కుర్చుంటానని అంగీకరించవచ్చు. ఇదంతా సాఫీగా సాగితే సరి. లేదంటే… మహారాష్ట్రలో అలాంటి పరిస్థితే వచ్చింది. ఒప్పందం ప్రకారం అధికార మార్పు సాఫీగా జరక్క.. ప్రభుత్వం తారుమారు అయింది.

ఇలా అనేక సమస్యలు, చిక్కుముడులు ఉన్నాయి కాబట్టే.. పొత్తు విషయంలో చంద్రబాబు న్యూట్రల్ గా ఉంటున్నారని అంటున్నారు. పవన్ మాత్రం కాస్త తగ్గైనా.. జగన్ మీద నెగ్గాలనే కసితో ఉన్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News