Big Stories

CM KCR : లోకల్ మీడియా వద్దు.. జాతీయ మీడియా ముద్దు.. సీఎం కేసీఆర్ వింత పోకడ

- Advertisement -

CM KCR : జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సీఎం కేసీఆర్‌కు మీడియా కావాలి. ఒకప్పుడు ఆంధ్రోళ్లు అని తిట్టి.. వారిని దగ్గర చేసుకోవడం కోసం నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో న్యూస్ పేపర్ కావాలి. ఉత్తరాది వాళ్లు విమర్శించి, ఇప్పుడు అదే ఉత్తరాదిలో పొలిటికల్ ఫుట్‌స్టెప్స్ కోసం ఇంగ్లీష్ ఛానెల్ పెట్టాలి. కాని, తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు పనిచేసిన ఇక్కడి మీడియా మాత్రం అక్కర్లేదు. ఇవే ప్రస్తుతం సీఎం కేసీఆర్‌పై వినిపిస్తున్న విమర్శలు. రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని ఘనంగా పేరు పెట్టిన సీఎం కేసీఆర్.. రాజ్యాంగంలో చెప్పినట్టు నడుచుకుంటున్నారా? ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్తంభాల్లో మీడియా కూడా ఒకటి. కాని, కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే సచివాలయంలోకి అనుమతి ఇచ్చి మరికొన్నింటిని రానీయకపోవడం ఏంటి? ఇందుకేనా, కొత్తగా కట్టిన సచివాలయ సౌధానికి బి.ఆర్.అంబేద్కర్ అని పేరు పెట్టింది?

- Advertisement -

సచివాలయాన్ని పడగొట్టే ముందు బీఆర్‌కే భవన్‌లోకి ఆఫీసులను షిఫ్ట్ చేసినప్పుడు కూడా మీడియాపై ఆంక్షలు పెట్టారు. ఎవరినీ అనుమతించేది లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు సీఎం కేసీఆర్. కొత్త సచివాలయంలో ఆ పరిస్థితి ఉండదు అనుకున్నారు. కాని, ఇప్పుడు కూడా అవే ఆంక్షలు కొనసాగుతున్నాయి. సచివాలయంలోకి మీడియా రాకుండా.. ఐ అండ్ పీఆర్ శాఖలోని పబ్లిసిటీ సెల్‌ను బయటే ఏర్పాటు చేయించడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ పోరాటం ఉధృతంగా నడిచిందే మీడియా వల్ల. అలాంటి మీడియాపై ఇంతటి నిషేధం దేనికి? తెలంగాణ వచ్చేసింది, ఇక అవసరం తీరింది కాబట్టి ఇక్కడ నిషేధం. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి, అక్కడ పబ్లిసిటీకి కావాలి కాబట్టి ఉత్తరాది మీడియాకు అందలం. ఇదెక్కడి రాజనీతి అని ప్రశ్నిస్తున్నారు. మొన్న కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా ఉత్తరాది మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నారు. దాదాపు 70 మంది రిపోర్టర్లు, స్టాఫ్‌కు విమాన టికెట్లు పంపించి మరీ రప్పించారని, వాళ్ల కోసం స్టార్ హోటళ్లలో రూమ్స్ బుక్ చేశారని కొందరు మీడియా వాళ్లే చెప్పుకుంటున్నారు. తెలంగాణ మీడియా ప్రతినిధులు అప్పుడే చేదు అయిపోయారా అని విమర్శిస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఉత్తరాది మీడియా సేవలో తరించిపోతున్నారనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో మీటింగ్ కోసం, అక్కడి పత్రికలకు కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం రోజు కూడా నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చారు. ఇదంతా ప్రజల సొమ్ము. పార్టీ ఫండ్ నుంచి తీసి ఇస్తున్నది కాదు. దీన్ని సీఎం కేసీఆర్ తన ఇష్టానికి వాడుకునేందుకు ఎవరు అనుమతించారు అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

అసలు కొత్త సచివాలయాన్ని కట్టిందే ప్రజల డబ్బుతో. అలాంటిది ఈ రాష్ట్ర ప్రజలుగా, మీడియా ప్రతినిధులుగా సచివాలయంలోకి ఎందుకు అడుగుపెట్టకూడదు. ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించే అధికారం ఎక్కడిది. ప్రజల డబ్బుతో నిర్మించిన పరిపాలన భవనంలోకి మీడియాను అనుమతించం అనే అధికారం ఎవరిచ్చారు. వేరే రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఈ ఆంక్షల పర్వం ఒక్క తెలంగాణాలోనే ఎందుకు? ఇదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News