Karnataka: కర్ణాటకలో బీజేపీ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో.. తాజా ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 28 మంది మంత్రుల్లో 13 మంది ఓటమి పాలవడం, మరో ఏడుగురు వెనుకంజలో ఉండడం కీలకంగా మారింది.
రెవెన్యూశాఖ మంత్రి ఆర్.అశోక రెండు సీట్లలో పోటీ చేయగా.. డీకే శివకుమార్ చేతిలో ఓడిపోయారు. అటు రవాణాశాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి బి.శ్రీరాములు బళ్లారిలో ఓటమి పాలయ్యారు. మొలకల్మూరు సీటు మార్చుకుని ఈ సారి బళ్లారి నుంచి బరిలో దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. గృహనిర్మాణ శాఖ మంత్రి వి.సోమన్న రెండు చోట్ల నుంచి పోటీ చేసి.. రెండు సీట్లలోనూ ఓటమిపాలయ్యారు. వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్యపై పోటీ చేసి ఓడిపోయారు. అటు చామరాజనగర్ లోనూ పరాభవం తప్పలేదు.
2018లో సోమన్న గోవింద్ రాజ్ నగర్ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం మార్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ ముఖ్య నేతలపై బీజేపీ ఈసారి మంత్రులను బరిలోకి దింపింది. చాలా మంది నేతల నియోజకవర్గాలను మార్చిన స్ట్రాటజీ బీజేపీకి వర్కవుట్ కాలేదు.
భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్ కూడా బిల్గి నుంచి ఓడిపోయారు. సహకార శాఖ మంత్రి సోమశేఖర్, వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ఓటమి పాలయ్యారు. బ్రహ్మానందం ప్రచారం చేసిన మంత్రి సుధాకర్ చిక్ బళ్లాపూర్ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. గత ఎన్నికల్లోనూ బ్రహ్మానందం ప్రచారం చేస్తే గెలుపొందారు. ఇప్పుడు అది వర్కవుట్ కాలేదు. ఎంటీబీ నాగ్ రాజ్, కేసీ నారాయణగౌడ కూడా ఓట్ల వేటలో వెనకబడ్డారు.
నిజానికి ఇన్నాళ్లూ ఉన్న బీజేపీ సర్కార్ క్యాబినెట్ లో 9 మంది కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన నేతలే మంత్రులుగా ఉన్నారు. వారి సపోర్ట్ తోనే ఇన్నాళ్లూ బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించగలిగింది. ఇప్పుడు వారిలో చాలా మంది ఓడిపోయారు. అలా, పార్టీ ఫిరాయింపుదారులకు, బీజేపీ నేతలకు గట్టి బుద్ధి చెప్పారు కన్నడ ఓటర్లు.