EPAPER

Mekathoti Sucharitha: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

Mekathoti Sucharitha: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై.. మంతనాలు షురూ. అవును.. మీరు వింటున్న మాటే.. ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల రిజల్ట్ తర్వాత ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ అధినేత జగన్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా వరుసగా టాటా చెప్పేయటంతో.. పైకి కనిపించకపోయినా.. లోలోపల వైసీపీ అధినేత మాత్రం ఇబ్బంది పడుతున్నారనే టాక్ నడుస్తోంది. వెళ్లేవారు వెళ్తారు..ఉండేవారు ఉంటారని జగన్ చెబుతున్నా.. పార్టీని వీడేవారంతా బలమైన నేతలు కావటంతో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది తప్పదేమో అంటూ ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారట.

పార్టీలో కీలకంగా ఉన్న వారిలో వాసిరెడ్డి పద్మ ఒకరు. మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. మాజీమంత్రి రోజా తర్వాత ఆ స్థాయిలో.. టీడీపీపై విమర్శలు చేసిన పద్మ.. వైసీపీ అధికారంలోకి రావటానికి తనవంతు ప్రయత్నం చేశారు. కొంతకాలంగా ఆమె పార్టీలో ఇమడలేకపోతున్నారనే వార్తలు వినిపించాయి. కట్‌ చేస్తే.. బుధవారం ఆమె పార్టీకి రిజైన్ చేశారు. అంతేకాదు.. జగన్‌ తీరుపై ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. ఎంతో కాలంగా తాను సతమతం అవుతున్నానని గతంలోనే ఆమె సన్నిహితులతో ఉన్నారట. అయినా.. కొన్నాళ్లు చూసిన పద్మ.. చివరకు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీలో అంతా తానే అనేలా జగన్ వ్యవహరిస్తారని.. ఇతరుల మాటకు కొంచెం కూడా విలువ ఇవ్వరంటూ మాటల తూటాలు పేల్చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు.. ముక్కున వేలేసుకుంటున్నారట.


వాసిరెడ్డి పద్మ పార్టీ వీడాక.. అది బాటలో కొందరు అనే వాదనలు వినిపిస్తున్నాయట. అదే బాటలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. గుంటూరు జిల్లాల్లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కీలక నేతగా ఆమె ఉన్నారు. పైగా మొదట్నుంచీ ఆమె పార్టీకి వీర విధేయురాలిగా ఉన్నారు. అలాంటి సుచరిత పార్టీని వీడుతున్నారనే వార్తలు రావటంతో వైసీపీ శ్రేణుల్లో చర్చ మొదలైందట. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత సుచరితకు.. సీఎం జగన్‌.. హోంమంత్రిగా అవకాశం కల్పించారు. తమ ప్రభుత్వం మహిళలకు.. ఎస్సీలకు పెద్దపీట వేస్తుందనే సందేశాన్ని కూడా పంపించేందుకు అలా చేశారనే వాదన ఉంది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. తర్వాత కాలంలో సుచరితకు ప్రాధాన్యత తగ్గిందంటూ ఆమె సన్నిహితులే చర్చించుకుంటున్నారట. తమ నేత పేరు కూడా వినిపించని పరిస్థితి రావటంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారట. దీంతో మేకతోటి సుచరిత కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లుగా చర్చ సాగుతోంది.

Also Read: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

YSR హయాంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుచరిత.. తర్వాత.. జగన్ వెంట నడిచారు. వారి ఇంట్లో ఒక మనిషిగా.. ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా కూడా మారారు. ఈ విషయాన్ని సుచరిత కుటుంబమే అనేక సందర్భాల్లో చెప్పుకొంది. అయితే.. రాజకీయాల్లో.. ఎవరికి ఉండే ప్రాధాన్యం వారికి ఉంటుంది. కాబట్టి మూడేళ్లుగా ఆమెకు.. జగన్‌ వైఖరి నచ్చటం లేదట. ఎస్సీ నాయకురాలిగా ఉన్న సుచరితకు హోంమంత్రిగా జగన్ అవకాశం ఇచ్చారు. అయితే.. రెండున్నరేళ్లకు ఆమెను తొలగించి.. మరో ఎస్సీ నాయకురాలికి ఇదే పదవి ఇవ్వడాన్ని సుచరిత జీర్ణించుకోలేకపోయారట. అప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. గత ఎన్నికల సమయానికి ఈ గ్యాప్ మరింత పెరిగిందట. దీంతో తాను ఇమడలేకపోతున్నానంటూ ఆమె సన్నిహితులు వద్ద పలుమార్లు చర్చించారట. దానికి తోడు గత ఎన్నికల్లో సీటు మార్పు అంశంపైనా ఆమె అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 2019లో భారీ మెజార్టీ సొంతం చేసుకున్న జగన్‌కు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. తర్వాత కొందరు నేతలు సైలెంట్ అయ్యిపోయారట. అందులో మాజీ హోంమంత్రి సుచరిత కూడా ఒకరు. అయితే.. నాడు పార్టీలో ఓ వెలుగు వెలిగిన సుచరితకు.. పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని ఆమె అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోనే పేరుగాంచిన తమ నేత.. ఇక వైసీపీలో ఉండటం ఏమాత్రం సరికాదని చర్చించుకుంటున్నారట. దీంతో మేడమ్ సుచరిత కూడా ఆలోచనలో పడ్డారని.. త్వరలోనే డిసిషన్ ఉంటుందని.. ఆమె సన్నిహితులే చర్చించుకుంటున్నారని సమాచారం. అదే జరిగితే ఫ్యాన్ పార్టీకి మరింత డ్యామేజ్ ఏర్పడే అవకాశాలున్నాయనే టాక్‌ పొలిటికల్ వర్గాల్లో సాగుతోందట.

వైనాట్ 175 నినాదంతో గత ఎన్నికలకు వెళ్లిన జగన్‌.. సుచరితను ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి గుంటూరులోని తాడికొండకు మార్చారు. ఆ తర్వాత అసలు టికెట్ తీసుకునేందుకు కూడా సుచరిత మొగ్గు చూపలేదట. ఆ సమయంలో ఓ కీలక పార్టీలోకి మారేందుకు కూడా ప్రయత్నించారట. అయితే.. భర్త సూచనలతో పార్టీలోనే కొనసాగారని ఆమె సన్నిహితులే చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో సుచరిత ఘోరంగా ఓడిపోయారు. తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారట. ఈ క్రమంలో ఆమె.. ఓ కీలక పార్టీతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారడం ఖాయమని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Related News

Nellore Politics: సై అంటే సై.. నెల్లూరు మంత్రుల మధ్య ఇసుక దుమారం

YS Jagan: చిలకా ఏ తోడు లేకా బెంగళూరు వైపు ఒంటరి నడక..?

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Big Stories

×