EPAPER

Megha Company Construction: ఒక మేఘా.. 24 మోటర్ల కథ..!

Megha Company Construction: ఒక మేఘా.. 24 మోటర్ల కథ..!

మేఘా అక్రమాలపై సర్కారు వైఖరేంటి?
ఇంకా పూర్తి స్థాయి దృషి పెట్టలేదా?
నాణ్యత, భద్రతా ప్రమాణాలకు నీళ్లొదిలినా చర్యలేవీ?
వైఎస్ హయాంలోని 24 దుమ్ముగూడెం మోటర్లు ఎక్కడ?
తెలంగాణ నుంచి వాటిని ఆంధ్రాకి తరలించలేదా?
పట్టిసీమకి పట్టుకెళ్లిన ఆ మోటర్లపై పట్టుబట్టి విచారణ చేస్తారా..?
ఆ వ్యవహారంలో అధికారులు మౌనం దేనికి సంకేతం?
ఏ ప్రభుత్వం ఉన్నా.. మేఘా మాయలో పడాల్సిందేనా?
పంద్రాగస్టున సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం
అప్పటికైనా.. ప్రాజెక్టులో మేఘా మాయను గుర్తిస్తారా?


Megha Company Construction Works Face Political Heat: రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండిపోయిన దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు సీతారామా ప్రాజెక్ట్‌ పేరుతో ఈ పంద్రాగస్టు నాడు ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇది అందరూ సంతోషించాల్సిన విషయమే. అయితే.. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేసిన మాయాజాలాన్ని, పాల్పడిన అక్రమాలను కూడా ఓసారి గుర్తుచేసుకోవాలి. నాటి అధికార పార్టీ నేతలతో అంటకాగి, అడ్డదారిలో తెలంగాణలోని అనేక నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టులు కొట్టేసి, హడావుడిగా పనులు చేసి, నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేసిన ఈ మేఘా ఇంజనీరింగ్ సంస్థ..

సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలోనూ భారీగా అక్రమాలకు పాల్పడింది. ముఖ్యంగా వైఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన మోటర్లను తెలంగాణ నుంచి ఆంధ్రాలో తాను నిర్మించిన పట్టిసీమకు తరలించి, అక్కడ బిగించేసింది. రూ. 300 కోట్ల విలువైన ఆ మోటర్ల తరలింపుపై మేఘా ఇంజనీరింగ్ సంస్థ, వారిని పెంచి పోషించిన బీఆర్ఎస్ పెద్దలు నేటికీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ పంద్రాగస్టు నాడు సీతారామ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం కానున్న వేళ.. ఈ సందర్భంగానైనా ప్రభుత్వం నాటి అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


దుమ్ముగూడెం చరిత్ర..
దాదాపు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ఇండియా ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ఈ గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టను నిర్మించాడు. గోదావరి నదీ జలాలను కాల్వలలోకి మళ్ళించడం కాకుండా లీన్ ఫ్లో సీజన్‌లో క్రాస్ ఓవర్ బ్రిడ్జ్‌గా ఉపయోగించడం కోసం ఇది నిర్మించబడింది. అయితే, భద్రాచలం వద్ద గోదావరి నది మీద వంతెన నిర్మాణం తర్వాత ఈ ఆనకట్ట ప్రాధాన్యత కోల్పోయింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దుమ్ముగూడెం ప్రాజెక్టును రెండు విభాగాలుగా చేసి, మొదట భాగానికి రూ.2వేల కోట్లు, రెండవ దానికి రూ.3,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాజీవ్‌, ఇందిరా సాగ‌ర్ పేర్లతో దుమ్ముగూడెం, రుద్రంకోట వ‌ద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కాల ఏర్పాటుకు ముందడుగు వేశారు. సుమారు 4 లక్షల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందించే విధంగా రూ.3,600 కోట్లతో ప్రతిపాదనలు చేసి, సుమారు రూ. రెండు వేల కోట్లు ఖర్చుపెట్టి మోటర్లు, పైపులు కొనుగోలు చేసి ప‌నులు కూడా చేప‌ట్టారు. 1800 క్యూసెక్కుల నీటిని వినియోగించే లక్ష్యంతో రాజీవ్‌, ఇందిరాసాగర్‌లను ప్రతిపాదించారు.

విభ‌జ‌నతో సీతారామ ప్రాజెక్టుగా..
రాష్ట్ర విభజన త‌ర్వాత‌ రుద్రంకోట వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసే ప్రాంతం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ప‌రిధిలోకి రావటం, దీంతో చింతలపూడి ప్రాంతానికి ఆయకట్టు ఏర్పాటు చేయగా, మొత్తం ఆయకట్టులో 70 వేల ఎకరాలు ఆంధ్ర ప‌రిధిలో ఉంది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసింది. ఉమ్మడి ఖ‌మ్మంలోని ప్రాంతాలతో బాటు మహబూబాబాద్‌ జిల్లాలోని మొత్తం 10 లక్షల ఎకరాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌రించారు. రూ.15 వేల కోట్లతో ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టుకు సీతారామ ఎత్తిపోతల పథకం అని నామకరణం చేశారు. దీనిలో భాగంగా సుమారు రూ.7500 కోట్లు ఖర్చుపెట్టి ప్రధాన కాలువతో పాటు మూడు భారీ లిప్టులు ఏర్పాటు చేశారు.

Also Read: మెడికల్ మాఫియా.. బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు

సత్తుపల్లి సమీపంలో యాతాలకుంట వద్ద టన్నెల్‌ నిర్మాణం కూడా ప్రారంభించారు. సుమారు 9 వేల క్యూసెక్కులు నీటి సరఫరా అయ్యేలా కాలువలు నిర్మించారు. దుమ్ముగూడెం వద్ద 36 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా నిర్మించారు. సీతమ్మ సాగర్ వద్ద 280 మెగా వాట్ల హైడల్ విద్యుత్త్ ఉత్పత్తికి ప్రతిపాదన ఉంది. జూలూరు, డోర్నకల్ వద్ద టెన్నెల్ పనులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాయించి పూర్తి చేశారు. భీముని గుండం కొత్తూరు వద్ద గల ఈ ప్రాజెక్ట్ మొదటి పంపు హౌజ్ నుంచి 9 వేల క్యూసెక్కులు గోదావరి జలాలు ఈ కాలువ ద్వార ఎత్తిపోస్తారు. పూచిగూడెం, కమలాపురం, బిజి కొత్తురు లిఫ్ట్ లు ఓపెన్ చేయనున్నారు. ఏన్కూర్ కాలువ పూర్తి చేసి వైరా ప్రాజెక్ట్ ను నింపుతారు.

సరిగ్గా టైం చూసి..
ఒకవైపు ఈ రీడిజైన్ గురించి చర్చ జరుగుతుండగానే అప్పటికే కొనుగోలు చేసిన రూ. 300 కోట్ల విలువైన మోటార్లను ఓ బడా కాంట్రాక్టర్ దర్జాగా అక్కడి నుంచి ఆంధ్రాకి తరలించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ కాంట్రాక్టునూ పట్టేసిన ఆ కాంట్రాక్టర్.. ఈ మోటర్లను అక్కడ బిగించి, రికార్డు టైంలో ప్రాజెక్టును పూర్తిచేశామని గొప్పలు పోయాడు. అంతేకాదు.. రూ.1660 కోట్ల విలువైన ప్రాజెక్టును తక్కువ టైంలో పూర్తి చేసినందుకు గానూ ప్రభుత్వం నుంచి 5 శాతం ఇన్సెంటివ్‌నూ అందుకున్నారు. మరి అతి తక్కువ సమయంలో పట్టిసీమ పూర్తి ఎలా అయిందని స్వేచ్ఛ.. ఆరా తీస్తే.. అసలు విషయం బయటికొచ్చింది.

ఆ 24 మోటర్స్ దొంగ.. మేఘా .?
దుమ్ముగూడెం (రాజీవ్ సాగర్) కోసం 2 వేల కోట్లు వెచ్చించగా, అందులో 400 కోట్లతో మోటర్స్ కొనుగోలు చేశారు. వైఎస్ హయాంలో జ‌ల‌య‌జ్ఞంలో భాగంగా టెక్నిక‌ల్‌గా ఈ ప్రాజెక్ట్‌కి కేటాయింపులు చేశారు. ఎగువనున్న ఖమ్మం జిల్లాను వదిలి దిగువకు నీళ్లెలా తీసుకుపోతారంటూ లెఫ్ట్ పార్టీల నిరసనలకు దిగటంతో ఈ ప్రాజెక్టు భూసేకరణ ఆలస్యమైంది. దీంతో.. త్వరగా సాగునీరు ఇచ్చేందుకు బ్రిటిష్ కాలంలో నిర్మితమైన దుమ్ముగూడెం ఆనకట్టను వాడుకోవచ్చని నాటి ఇంజనీర్లు ప్రతిపాదించారు. తర్వాత వైఎస్ మరణం, ఉద్యమం కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తర్వాత రాష్ట్ర విభజన జరగటంతో ఈ ప్రాజెక్టులోని కొంత ఆయకట్టు పశ్చిమగోదావరి జిల్లా కిందికి వచ్చింది.

పట్టిసీమ ప్రతిపాదన
విభజన తర్వాత శేషాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాగానే పోలవరం ప్రాజెక్టు కట్టేవరకు గోదావరి జలాలను వృధాగా పోయే బదులు వాటిని కృష్ణానదికి తరలించాలనే ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించారు. పట్టిసీమ పని విలువ రూ. 1,170.25 కోట్లు. అయితే, దీని టెండర్ దక్కించుకున్న సంస్థ ఏడాదిలోగా పూర్తి చేయాలని, అలా పూర్తిచేస్తే మొత్తం విలువలో 5 శాతం అదనంగా ఇస్తామని, ఆలస్యమైతే ఫైన్ కూడా విధిస్తామని నాటి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలామంది కాంట్రాక్టర్లు వెనక్కిపోగా, ఎల్ అండ్ టీ, మేఘా సంస్థలు టెండర్ల బరిలో నిలిచాయి. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల సడలింపుతో 21.9 శాతం (రూ.256.28 కోట్లు) ఎక్సెస్ కోట్ చేసినా మేఘా సంస్థే ఎల్1గా నిలిచి టెండర్ దక్కించుకుంది. అంటే.. రూ. 1426.53 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేసినందుకు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన 5 శాతం మొత్తం.. అంటే మరో రూ. 198 కోట్లు.. మొత్తం రూ. 1624.5 కోట్లను పట్టిసీమ ద్వారా మేఘా పొందింది.

మోటర్లకు రెక్కలొచ్చాయా? 
అయితే, పట్టిసీమ ప్రాజెక్టులో 24 మోట‌ర్స్ అవసరపడ్డాయి. వీటిని చైనా నుంచి తెప్పించాలని మేఘా సంస్థ భావించి, అక్కడి సంస్థలను సంప్రదించగా, ఇప్పడు ఆర్డరిచ్చినా అవి డెలివరీ ఇచ్చేందుకు తమకు 9 నెలల సమయం పడుతుందని అక్కడి సంస్థలు చెప్పాయి. సరిగ్గా ఇక్కడే.. మేఘా సంస్థ తనదైన శైలిలో స్టెప్ వేసింది. దుమ్ముగూడెం ప్రాజెక్టుకోసం కొని, పక్కన బెట్టిన మోటర్లను చడీచప్పుడూ కాకుండా పట్టిసీమకు తరలించి బిగించి, అనుకున్న సమయం కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంది. కేవలం 175 రోజుల్లో మోటర్లు బిగించటం, 2016 మార్చి నాటికి ప్రాజెక్ట్ ఓపెనింగ్ కావటం జరిగిపోయాయి. మీడియా పట్టిసీమను ఒక అద్బుతంగా భావించినా.. తెర వెన‌క త‌తంగం జరిగింది మాత్రం ఇదేనని నాటి ఇంజనీర్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన మోటర్స్ సాఫీగా ఏపీకి వెళ్లటం వెనక నాటి ప్రభుత్వ పెద్దల పరోక్ష సహకారం కూడా ఉందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే అవి ఇప్పటికి ఎన్ని అర్టీఐలు దాఖలు చేసినా అధికారులు సమాధానం చెప్పడం లేదు. 2008లో కొనుగోలు చేసిన రూ. 300 కోట్ల విలువ చేసే మోటర్స్ 2016లో ఎక్కడికి పోయాయో నేటికీ గుర్తించలేకపోయారు.

రికార్డుల మాయ..
పట్టిసీమ కోసం కిర్లోస్కర్ కంపెనీ మోటర్లు వాడామని మేఘా సంస్థ చెప్పుకుంది. మొత్తం 24 మోటార్లలో 12 బీహెచ్ఈఎల్ నుంచి, మరో 12 చైనాలోని షాంఘయ్ ఎల‌క్ట్రిక్ కంపెనీ నుంచి తీసుకొచ్చామ‌ని రికార్డుల్లో ఉంది. ఆస్ట్రియా కంప‌నీ అయిన కిర్లోస్కర్ మోటార్లను ఫిట్ చేశామని చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. చెన్నై స‌ముద్ర మార్గం నుంచి మోటర్స్ దిగుమ‌తి చేసుకున్నట్లుగా చూపించి, సుంకాలు చెల్లించారనే వార్తలూ వచ్చాయి. మరి.. తెలంగాణ ప్రాజెక్టులోని అస‌లు మోట‌ర్స్ ఎక్కడ? అనేది నేటికీ బయటకు రాలేదని రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్నారు.

అదే నిజ‌మైతే.. కేసులే?
అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన మేఘా సంస్థ.. నిజంగా తెలంగాణ మోటర్లను తరలించినట్లయితే అది తీవ్రమైన నేరమే. పట్టిసీమ కోసం తెలంగాణ నుంచి మట్టి, ఇసుక రవాణా చేసారని తవ్వకాలు జరిపిన చోట స్థానికులు గతంలో నిరసనలకు దిగినా నాటి బీఆర్ఎస్ సర్కారు ఒక్క కేసూ పెట్టలేదు. అటు దీనిపై వైసీపీ పార్టీ కూడా మౌనంగా ఉండి, తర్వాత తాను అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును ఇదే మేఘాకు అప్పగించింది.

Also Read: మెడ్ ‘‘ప్లస్ ఎవరికి?’’

బిల్స్ కోసం దొంగ బిల్లులు
నాటి ఏపీ సర్కారు నుంచి పట్టిసీమ బిల్లులు తీసుకునేందుకు మోట‌ర్స్ దిగుమ‌తులు చేసుకున్నట్లు బిల్లులు తప్పనిసరి కావటంతో, దిగుమ‌తి సుంకం పేరుతో మేఘా సంస్థ దొంగ బిల్లులు తీసుకుందనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిని గుర్తించిన నాటి ప్రభుత్వ నీటిపారుద‌ల శాఖ సెక్రెట‌రీ ఈ బిల్లుల ఆమోదం ఫైలుపై సంత‌కాలు చేయలేదని, ఆయన సంతకం లేకుండానే డ‌బ్బులు రిలీజ్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఒక వేళ ఇదే నిజమైతే ఖజానాను కొల్లగొట్టటం తప్ప మరొకటి కాదు.

సుంకిశాలపైనా అనుమానాలు..
ఒక్క భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తే.. అందుకు ఏ టెక్నాల‌జీ వాడుతున్నారు? వాటి స‌ర్వీస్ స‌మ‌యం ఎంత‌..? ఒక వేళ మోటార్లు రిపేర్‌కు వస్తే ఎంత ఖర్చవుతుంది? ఎన్ని రోజుల్లో రిపేర్ చేయాలి? వంటి వివరాలు ప్రాజెక్టు రిపోర్టులో తప్పని సరిగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే పట్టిసీమలో మాదిరిగానే మేఘా సంస్థ సుంకిశాలలో చేసిందా? అనే అనుమానాలూ ఉన్నాయి. సుంకిశాల ఘటన తర్వాత వివరాలేమీ బయటపెట్టకుండా.. జరిగిన నష్టాన్ని తామే భరిస్తామని మేఘా సంస్థ చేసిన ప్రకటన మీద ఇప్పుడు పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

నేరం చేసి ఎన్నాళ్లైనా.. కేసు అనేది రికార్డులో నిలిచే ఉంటుంది. నిప్పులేనిదే పొగ‌రాదన్నట్లుగా.. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. ఇన్నేళ్ల చరిత్రలో ఏనాడూ తనమీద వచ్చిన ఆరోపణలకు స్పష్టమైన జవాబులు ఇస్తూనే వచ్చింది. ఐటీ రైడ్స్ నుంచి మొద‌లుకుని అవినీతి వరకు, బినామీ కంపెనీల నుంచి ఐ.ఏ.ఎస్. కూతురి గేట్ వే వ‌ర‌కు అన్నింటినీ ఖండించారు గానీ, గానీ, ఈ మోటార్ల మీద మాత్రం నోరెత్తటం లేదు. మోటర్స్ దొంగ‌త‌నం జ‌రిగింద‌ని రిటైర్డ్ ఇంజ‌నీర్లు, భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణ సంస్థల సిబ్బంది ఇప్పటికే ఉప్పందించాయి. తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. వీట‌న్నింటికి మేఘా ఒప్పుకుంటుందా.. దుమ్ముగూడెం మోటర్స్ కేసును కాంగ్రెస్ సర్కార్ అయినా పట్టించుకుంటుందా.. అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసును తొలిచేస్తున్న ప్రశ్న.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×