BRS హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగి.. ఖమ్మం జిల్లాను ఏకచత్రాధిపత్యంతో నడిపించిన నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పార్టీలో సీనియర్లను సైలెంట్‌గా పక్కన పెట్టేసి.. తన హవాను కొనసాగించారనే వాదనలు ఉన్నాయి. పార్టీలో నెంబర్- 2 సీఎంగా చలామణి అయిన కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉండడంతో.. బ్రేక్ లేని కారులా.. జోరు పెంచుకుంటూ పోయారట. తన హయాంలో.. ఐదేళ్లు కాదు.. ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునేలా తన మార్కు కనపడేలా అభివృద్ధి చేస్తానంటూ పెద్దపెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. నియోజకవర్గంతో పాటు జిల్లా ముఖాభివృద్ధిని కూడా మార్చేస్తానంటూ కంకణం గట్టుకున్నట్లు గొప్పగా చెప్పుకున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు దిమ్మ దిరిగే ఓటమి ఇవ్వటంతో ఏకంగా నియోజకవర్గాన్ని మార్చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు.. ఏకంగా 50 వేల మెజారిటీ సాధించారు. ఇదీ.. నియోజకవర్గంలో జనాలు ఇచ్చిన తీర్పు. దీంతో జిల్లా రాజకీయాల్లో పువ్వాడ సైలెంట్ అయిపోయారట. ఓటమి తరువాత సొంత నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు కూడా లేవు. అయితే కొన్ని విషయాలు నియోజకవర్గంలో చక్కెట్లు కొడుతున్నాయి. తమకు కంచుకోటగా ఉన్న ఖమ్మంను వీడే ఆలోచనలో మాజీమంత్రి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నోటా.. ఈ నోటా ఆ మాట.. బయటకు రావటంతో ముఖ్య అనుచరులు కూడా ఈ అంశంపై చర్చించుకుంటున్నారట.
ఖమ్మంను వీడితే.. పువ్వాడ అజయ్‌కు ఉన్న ఆప్షన్లు ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఏళ్లుగా తనకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ అద్భుతమైన విధంగా పుంజుకోవటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పువ్వాడ ఉన్నారట. ఇప్పటికిప్పుడు కాకున్నా.. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం నేతలు ఓట్లు ఉండటంతో.. అక్కడైతే సునాయాసంగా బయటపడొచ్చనే భావనలో పువ్వాడ ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే అంశంపై ఇటీవల.. కేసీఆర్‌తోనూ పువ్వాడ చర్చించారని తెలుస్తోంది.
Also Read: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో గులాబీ పార్టీ హవా కొనసాగించింది. అదే సమయంలో పువ్వాడ.. ఖమ్మం నుంచి కూకట్‌పల్లికి.. షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వెంటనే గులాబీ అధినేత.. పువ్వాడను పిలిచి ఆరా తీసినట్లు వార్తలు నాడు గుప్పుమన్నాయి. దీంతో మాజీమంత్రి పువ్వాడ.. తాను ఖమ్మం నుంచి పోటీలో ఉంటానని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో ఓడిన తర్వాత పువ్వాడ ముఖ్యఅనుచరుల వద్ద తన గోడును వెల్లబోసుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఒకవేళ.. కూకట్‌పల్లి లేదా శేరిలింగంపల్లిలో అయితే తాను తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిచేవాడినని.. అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదనే వారి వద్ద పువ్వాడ వాపోయారట.
ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ హవా పూర్తి స్థాయిలో ఉంది. భవిష్యత్‌లో కూడా హస్తం పార్టీకే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయేకంటే.. నియోజకవర్గాన్నే మార్చేయాలనే యోచనలో పువ్వాడ ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి పూర్తిగా షిఫ్ట్ అయి హైదరాబాద్‌లోని.. ఆ రెండు స్థానాల్లో పట్టు సాధించుకునే విధంగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో BRSకు పట్టులేకుండా పోయింది. మిగతా జిల్లాలో సత్తా చాటుతున్నా..ఖమ్మంలో మాత్రం ఆశించిన ఫలితం కారుపార్టీకి దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఖమ్మంలో ఉంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు.. ఇతర పార్టీలోకి జంప్ కొట్టేస్తున్నారట. ఇందులో భాగంగానే మాజీమంత్రి పువ్వాడ.. ఖమ్మంకు గుడ్‌బై చెప్పనున్నారనే సమాచారం. BRSకు కాస్తో.. కూస్తో పట్టున్న గ్రేటర్ పరిధిలోనే తాను విజయం సాధించగలనని.. ఖమ్మంలో తమ వల్ల కాదనే మాజీమంత్రి.. తన అనుచరులతో వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెటిలర్ ఓటర్లు ఉంటే. దాంతో బయటపడి.. కనీసం సీటు దక్కుతుందనే భావనలో పువ్వాడ ఉన్నారట.
గ్రేటర్ పరిధిలో అయితే.. కుల సామాజికపరంగా పువ్వాడకు మద్దతు దొరికే అవకాశం మెండుగానే ఉన్నట్లు రాజకీయ వర్గాలూ కూడా అంచనా వేస్తున్నాయి. తన మనస్సులో మాటను ఇప్పటికే పువ్వాడ.. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ నడుస్తోంది. అందుకే ఖమ్మం పాలిటిక్స్‌లో చురుకుగా ఉండడం లేదనే వాదనలూ తెరపైకి వస్తున్నాయి. అయితే.. ఈ అంశంపై పువ్వాడ అజయ్ మాత్రం స్పందించలేదు. ఈ వార్తలను ఆయన ప్రధాన అనుచరుల్లో కొందరు ఖండిస్తున్నా.. కొందరు సమయం వచ్చినప్పుడు చెబుతామనే ధోరణిలో ఉన్నారట. ఏది ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ దూరంగా ఉంటారని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో గులాబీబాస్ కేసీఆర్.. పువ్వాడను ఖమ్మంలో కొనసాగిస్తారా లేక రాజధానికి షిఫ్ట్ చేస్తారా.. అనేది ఉత్కంఠగా మారింది.